ఒక వార్త ఎందులోనో కనిపించింది… కాస్త ఆసక్తికరంగానే అనిపించింది… తమిళ సినీ నిర్మాతలకు అంత దమ్ముందా..? మన తెలుగు నిర్మాతలకు, దర్శకులకు అందులో వీసమెత్తు దమ్ము కూడా లేదెందుకు..? ఎందుకీ బతుకులు అని కూడా అనిపించింది ఓ దశలో…
తీరా వార్త చివరకు వచ్చేసరికి ఓ వాక్యం ఉంది…‘‘గతంలోనే తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది… కానీ పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం…’’ అని వార్తకు చివరలో పంక్చర్ కొట్టారు… నిజమే… కోలీవుడ్ గానీ, బాలీవుడ్ గానీ, టాలీవుడ్ గానీ, శాండల్ వుడ్ గానీ, మాలీవుడ్… ఏ వుడ్డయినా సరే అంతా హీరోస్వామ్యమే కదా…
హీరోల పాదాల మీద పడి దేకడమే తప్ప ఇప్పుడు నిర్మాతలకు, దర్శకులకు హీరోల మీద నియంత్రణ ఏముంది..? హీరోలు చెప్పినట్టే కథ, చెప్పినవాళ్లే ఆర్టిస్టులు… చివరకు చెల్లెలి పాత్రలు, ఎక్సట్రా ఆర్టిస్టులు కూడా… మ్యూజిక్, డాన్స్ మాస్టర్ల దాకా దేనికి..? క్యారవాన్‌లోకి టీలు, టిఫిన్లు, స్నాక్స్ ఎట్సెట్రా సప్లయ్ చేసే బాయ్స్ కూడా హీరోలకు నచ్చినవాళ్లే ఉండాలి… అడిగిన ఏరియాలకు రైట్స్ ఇచ్చేయాలి… రెమ్యునరేషన్ సమయానికి ఇవ్వలేకపోతే స్థిరాస్తులు అమ్మి మరీ హీరోలకు కట్టేయాలి… (రాజమౌళి వంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రమే ఎగ్జెంప్షన్…)
Ads
ఇంతకీ వార్త చెప్పనేలేదు కదూ… చెన్నై నిర్మాతల మండలి శింబు, ధనుష్, విశాల్, అధర్వలకు రెడ్ కార్డు జారీ చేసిందట… అనగా కొత్త సినిమాల్లో నటించకుండా, అనగా ఎవరూ వారిని తీసుకోకుండా తమలోతాము నిషేధం విధించుకోవడం అట… హహహ… ఒక నిర్మాత మీద పడి మరొకరు పోటీలుపడి మరీ హీరోల డేట్ల కోసం వెంపర్లాడే దురవస్థలో నిజంగానే ఈ నిషేధాలు పనిచేస్తాయా..? హీరోలు కన్నెర్ర జేస్తే వణికిపోయే నిర్మాతలు ఈ నిషేధాన్ని అమలు చేస్తారా..?
పైగా నిర్మాతలు ప్రతాపం చూపించడానికి వీళ్లేమీ అల్లాటప్పా నటులు కాదు… ఇందులో విశాల్ నడిగర్ సంఘం (యాక్టర్స్ అసోసియేషన్) పెబ్బ అనుకుంటాను… గతంలో నిర్మాతల మండలికీ అధ్యక్షుడిగా కూడా చేశాడు… ధనుష్, శింబు నిర్మాతలు కమ్ హీరోలు… అధర్వ రేంజ్ ఏమిటో తెలియదు… పేరుకు రెడ్ కార్డు జారీ చేసినా సరే వీళ్లపై అది అమలు చేయగలరా…? నెవ్వర్… గతంలోలాగే తుస్సు ఖాయం…
ఏఏఏ సినిమా షూటింగుకు సమయానికి సరైన సమయానికి రాకపోవడంతో శింబు మీద… మరో సినిమా షూటింగుకు అసలే రాకపోవడంతో ధనుష్ మీద నిషేధం అట… ఈ ధనుష్ సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా..? సాక్షాత్తూ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి రామస్వామి… ఇక ఊహించుకొండి… రెడ్ కార్డు జారీ అమలు జరుగుతుందో లేదో…
గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విశాల్ ఏవో అవకతవకలకు పాల్పడినట్టు తనపై ఆరోపణ… షూటింగులకు ఇబ్బందులు క్రియేట్ కావడం కాదు ఇక్కడ కారణం… సరే, బాగానే ఉంది… కనీసం తమిళ నిర్మాతల మండలి అధికారికంగా బయటకు ప్రకటించకపోయినా కనీసం నిర్ణయం తీసుకుంది… తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి కనీసం ఆ దమ్ము కూడా ఉందా..? ఏమండీ దిల్ రాజు గారూ… వింటున్నారా..? మొన్నీమధ్య ఓ అగ్ర హీరో ముక్కుపిండి పారితోషికం వసూలు చేస్తే నిర్మాత ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట… సినిమా అట్టర్ ఫ్లాపయినా సరే..!!
Share this Article