కొమ్మినేని… ప్రస్తుతం ఏపీ మీడియా అకాడమీ చైర్మన్… సుదీర్ఘకాలం జర్నలిస్టుగా ప్రింట్, టీవీ మీడియాల్లో పనిచేసిన విశేషానుభవం… ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో, ఇంకేదో టీవీలో రిపోర్టింగ్ ప్రముఖ స్థానాల్లో పనిచేసిన నైపుణ్య జర్నలిస్టు… ఐతేనేం, తప్పు చేయవద్దనేముంది..? సారీ, తప్పు రాయవద్దనేముంది..? తప్పు మాట్లాడకూడదనేముంది..?
ఏదైనా వార్త రాసేముందు ఒకటికి పదిసార్లు చూసుకోవాలని, అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే నిజదోషాలు లేకుండా చూసుకోవాలని సీనియర్ జర్నలిస్టులు చెబుతుంటారు… అవసరం కూడా… కాకపోతే ప్రజెంట్ జర్నలిజానికి అవేవీ అక్కర్లేదు… కొమ్మినేని పాతతరం జర్నలిస్టు… దాన్నే పాటిస్తాడని అనుకుంటాం… కానీ లేదు… తను కూడా ప్రజెంట్ జర్నలిజం బాటలో పడి, అధికార పదవిలో పడి అవన్నీ మరిచిపోయాడేమోనని డౌట్… ఆయన ఈనాడులో ఉన్నప్పుడు వార్త రాస్తే ఆ కాపీలో వేలుపెట్టడానికి డెస్క్ కూడా సందేహించింది…
ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో పనిచేసినప్పుడు చాలా వార్తల్లో తెలుగుదేశం అభిమానిలాగే కనిపించేవాడు… ఆ పత్రికలకూ అదే కావాలి… కానీ అదే తెలుగుదేశం ఆయన్ని సహించలేదు… టీవీల్లో పనిచేసినప్పుడు ఎక్కడో తేడా కొట్టింది… నిజానికి ఆయన తెలుగుదేశం వ్యతిరేక స్టాండ్ ఏమీ తీసుకోలేదు… కానీ లోకేష్‌తో పడలేదని అంటారు… ఫలితంగా బయటికి వచ్చేయడం, ‘జగన్ కోసం తెలుగుదేశం వారికి అయిష్టుడయ్యాడు’ అనే కారణం ఉంది కదా… సాక్షిలోకి తీసేసుకున్నారు…
Ads
ఇదంతా చెప్పడం దేనికీ అంటే… తను మరొకరికి పాఠాలు చెప్పాలి… తన అనుభవం తనకు కల్పించిన స్థాయి అది… కానీ సాక్షిలో ఓ వ్యాసం చూస్తే ఆశ్చర్యం వేసింది… పాపపు పనులు, పోరాటం పక్కనబెట్టి రామోజీలోనూ భయం శీర్షికతో ఉంది అది… అసలు తను రాసిందేనా అనే డౌట్ వచ్చి పదే పదే చూస్తే వ్యాసం కింద తన పేరే ఉంది…
చంద్రబాబు మీద కేసు పెడితే ఈనాడు జగన్ పైశాచికానందం పేరిట ఈనాడు ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ రాసింది… దాన్నే ప్రస్తావిస్తూ కొమ్మినేని ‘పాపపు పనులు’ అని రాసేయడం నా ఆశ్చర్యానికి కారణం… నిజంగా రామోజీరావు భయపడి ఉంటే జగన్ మీద అంత ధాటిగా, ఘాటుగా ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ ఎలా వచ్చేది..? పైగా ఆ కేసు మీద గతంలో ఎన్నడూ లేని రీతిలో అయిదు పేజీల ప్రత్యేక కథనాలతో నింపేశారు… ఇక రాయడానికి ఏమీ మిగల్లేదో, చంద్రబాబును రిమాండ్‌కు పంపిస్తూ జడ్జి ఆదేశించడంతో రామోజీ వెనక్కి తగ్గాడో తెలియదు గానీ… అరెస్టు వార్తల్లో ఆ దూకుడు కనిపించలేదు…
ఐనంతమాత్రాన రామోజీ భయపడిపోయాడని సూత్రీకరించడం, తేల్చేయడం కొమ్మినేని వంటి సుదీర్ఘ జర్నలిస్టుకు కరెక్టు కాదేమో అనిపించింది… తను జగన్ కరుణించిన ఓ అధికార పోస్టులో ఉన్నంత మాత్రాన ఆయనకు సంతృప్తి కలిగించే రాతలకు దిగాలా..? అసలు మీడియా అకాడమీ అధ్యక్షుడు ఇలాంటి అభిప్రాయాల్ని ఎందుకు వ్యక్తీకరించాలి..? రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర పార్టీ ప్రముఖులు మాట్లాడితే దానికి ఓ అర్థం ఉంటుంది… సాక్షి ఎడిటర్, కాలమిస్టులు రాస్తే అర్థముంది…
ఇంకా తనేం రాస్తాడంటే..? ఆ ఎడిటోరియల్ కింద రామోజీరావు సంతకం లేదు… ఇలాంటివి రాసినప్పుడు చీఫ్ ఎడిటర్ హోదాలో సంతకం చేస్తుంటారు… కానీ లేదు… ఇది వ్యాసమా..? కథనమా..? ఎడిటోరియలా..? సో, ఆయన సంతకం చేయలేదు కాబట్టి భయపడిపోతున్నట్టేనట… అదెలా..? తనకు గుర్తులేదో, మరిచిపోయాడో తెలియదు గానీ… (నిజానికి ఈనాడులో ఏం జరిగినా ఆయనకు తెలుస్తుంది, గుర్తుంటుంది)
2019 డిసెంబర్ 14 నుండి రామోజీరావు ప్రధాన ఎడిటర్ గా తప్పుకొనగా, తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ గా డి.ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్ గా ఎం. నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు…. ఇదీ ఈనాడు వికీ పేజీ చెబుతోంది… అదే నిజం… తను అసలు చీఫ్ ఎడిటరే కానప్పుడు తన సంతకం ఎలా ఉంటుంది ఎడిటోరియల్ కింద..? తెలంగాణకు వేరే, ఏపీకి వేరే ఎడిటర్లు ఉన్నందున ఈ కామన్ ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ కింద ఎవరి సంతకమూ లేదు… సో, అది లేదు కాబట్టి రామోజీ వణికిపోతున్నట్టేనా..?
ఉంటుంది, రామోజీరావుకు కోపం ఉంటుంది… తన ఆర్థికమూలంగా ఉన్న మార్గదర్శి వేళ్లు పీకడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు… పైగా తనలో ఎన్నాళ్లుగానో వైఎస్ కుటుంబం మీద పేరుకున్న కోపం, వ్యతిరేకత సరేసరి… తనను సీఐడీ అధికారులు ఇంటరాగేట్ చేయడం మీద ఈనాడు రామోజీరావుకు కోపం ఉండటం అసహజం కాదు, ఉండకపోతేనే తప్పు… సో, కొమ్మినేని గారూ… మీడియా అకాడమీ అంటేనే జర్నలిస్టులకు వృత్తిలో శిక్షణ ఇచ్చే సంస్థ… మరి మీరే ఒకరు వేలెత్తి చూపే రాతలు రాస్తే ఎలా..? బాగాలేదు… మీ స్థాయికి కరెక్టు కాదు…
Share this Article