చాలా గుళ్లల్లో కల్యాణాలు, అభిషేకాలు ఏదో కమర్షియల్ తంతులాగా సాగుతూ ఉంటయ్… ఇస్తినమ్మ వాయినం అన్నట్టుగా పూజారులు ఏదో తమ డ్యూటీ తాము చేస్తున్నాం అన్నట్టు చేసేస్తుంటారు నిర్వికారంగా… వాటిల్లో పాల్గొనే భక్తులు కూడా పుచ్చుకుంటి వాయినం అన్నట్టుగా వచ్చామా, పోయామా అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు… అన్నింటికీ మించి అభిషేకాలు, నిత్య కల్యాణాల్లో భక్తుల్ని పర్సనల్‌గా ఇన్వాల్వ్ చేయడం పెద్దగా ఉండదు… వీవీఐపీ, షోపుటప్, మరీ ధనిక భక్తులు అయితేతప్ప…
హైదరాబాద్‌కు వందలోపు కిలోమీటర్ల దూరంలో ఉండే కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి గుడిలో ఈ తీరుకు భిన్నంగా, అభినందనీయంగా కనిపించింది… ఇక్కడ బ్రాహ్మణులతోపాటు బ్రాహ్మణేతర పూజారులు కూడా ఉంటారు… ఇక్కడి స్థానిక మైలపోలు, పట్నం వంటి విశిష్ట అర్చన పద్ధుతుల్ని బయటికి తోసేసి… అభిషేకాలు, కల్యాణాలు వంటి ‘‘ఆధిపత్య కుల ఆగమశాస్త్రాన్ని’’ ప్రవేశపెట్టడం మీద చర్చ వేరు… దాన్ని కాసేపు పక్కన పెడితే…
అభిషేకానికి భక్తుల్ని మూలవిరాట్టుకు ఎదురుగా కూర్చోబెట్టి, ఏదో తూతూమంత్రంలా గాకుండా పద్ధతిగా చేయిస్తున్నారు… దీనివల్ల కొంత కాలహరణం, వెయిటింగ్ అనివార్యమే అయినా అభిషేకం చేయించుకునేవారికి అపరిమితమైన భక్తానందం… సాధారణంగా జాతర సీజన్‌లో ఇలా సాధ్యం కాదేమో కానీ ఇప్పుడు మామూలు రోజుల్లో కూడా భక్తులు బాగా వస్తున్నారు… ప్రత్యేకించి ఆదివారాల్లో ఎక్కువ… యాదవ, ముదిరాజ్ కులస్థులకు మల్లిఖార్జునుడు కులదైవం… ప్రధానంగా యాదవులకు…
Ads
ఏడాదికి ఓసారైనా కొమురవెళ్లి వెళ్లాలని కోరుకుంటారు… ఈ దేవుడిని బలంగా ఓన్ చేసుకుంటారు… ప్రత్యేకించి హైదరాబాదులో స్థిరపడిన అనేక మంది ఆయా కులస్థులకు కొమురవెళ్లి ఎప్పుడూ ఓ స్పిరిట్యువల్ డెస్టినేషన్… పిల్లాపాపలతో, కుటుంబంతో వచ్చేసి ‘భక్తి’లో మునిగిపోతుంటారు… అఫ్‌కోర్స్, కొమురవెళ్లిలో మద్యమాంసాల్ని ముట్టుకోకుండా, దగ్గరలోని కొండపోచమ్మ దగ్గర బలి, వంట, ‘తీర్థప్రసాద’ సేవనం ఉంటుంది…
ఎంత మంది పాల్గొన్నారనే సంఖ్యతో నిమిత్తం లేకుండా నిత్యకల్యాణం పద్దతిగా జరిపిస్తున్నారు… మంత్రోచ్ఛరణతోపాటు వివాహతంతు చేసే పద్ధతి కూడా లోపరహితంగా అనిపించింది… నేను వెళ్లినరోజున నాలుగు జంటలు కల్యాణం టికెట్లు కొన్నారు… అందులో రెండు ఒకే కుటుంబానివి… జంటలతో కన్యాదానం చేయించడం, తలంబ్రాలు పోయించడం, చీరలో వడిబియ్యం విశిష్టంగా అనిపించాయి… ఉత్సవ మూర్తుల అలంకరణ దగ్గర కూడా రాజీలేదు…
అన్నింటికీ మించి ఓ మహిళ… హైదరాబాద్ నుంచి వచ్చిన యాదవుల ఆడబిడ్డ అట… కల్యాణం పూర్తి కాగానే అయ్యవార్లు తమలపాకుపై ఉంచి ఇచ్చిన పసుపును (కొమురవెళ్లిలో పసుపు పేరు బండారు, ఇక్కడ పసుపునే విశేషంగా వినియోగిస్తారు) అక్కడున్న ఇతర మహిళలందరికీ అందించడం, ప్రతిగా వాళ్లు ఆమె పుస్తెకు కూడా పసుపు అద్దడం… అచ్చం ఇళ్లల్లో చేసుకునే ఓ తాంబూల వేడుకగా అనిపించింది… జనం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా సాధ్యం కాదేమో గానీ ఆ మహిళ అలా ఆ కల్యాణతంతును ఓన్ చేసుకుని, తన ఇంట్లో కార్యక్రమంలా ఫీలై, అక్కడున్న అందరినీ తన ఇంటికి వచ్చిన గెస్టుల్లాగే భావించడం ఆసక్తిగా అనిపించింది…
ఆ కుటుంబం దేవుడికి కొత్త బట్టలు తెచ్చారు… రెండు తాంబాలాల్లో పసుపు కలిపిన బియ్యం తీసుకొచ్చారు… పూలదండలు సరేసరి… పిల్లాపాపలతోసహా కుటుంబం మొత్తం తరలివచ్చింది… ఎన్ని పెద్ద దేవాలయాల్లో ఈ తరహా ‘మమేకం’ కనిపిస్తుంది..? జాతర సీజన్ గాకుండా, ఆదివారాలు గాకుండా వేరే రోజుల్లో గుడికి వెళ్లండి… అభిషేకం, కల్యాణంలో భాగస్వాములు కండి… పైన నేను చెప్పిన ప్రతి అక్షరంతోనూ ఏకీభవిస్తారు… దేవుడితో దగ్గరితనం ఫీల్ కావడం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు…
Share this Article