1972… సూపర్ స్టార్ కృష్ణ ఆ ఒక్క ఏడాదిలో ఏకంగా 18 సినిమాలు చేశాడు… అసలు చదువుతుంటేనే అబ్బురం అనిపిస్తుంది కదా… రోజుకు మూడు షిఫ్టుల్ని అలవోకగా లాగించేవాడు… అంతటి ఎనర్జీ… పని, పని, పని… ఎందుకలా పనిరాక్షసుడయ్యాడు..? పనే జీవితంగా ఎందుకు మారిపోయాడు..? దానికీ ఓ కారణముంది…
అంతటి కృష్ణకూ గడ్డురోజులున్నయ్… మరీ 1991, 1992 ప్రాంతాల్లో కృష్ణకు అవకాశాల్లేవు… ఖాళీ… నిజంగానే చేతిలో ఒక్క సినిమా లేదు… కనిపిస్తే చాలు, నిర్మాతలు మొహాలు చాటేసేవాళ్లు… దాటేసేవాళ్లు… కృష్ణకు అప్పటికే ఇండస్ట్రీ కల్చర్ తెలుసు… సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది… సక్సెస్ లేకపోతే ఎవడూ పట్టించుకోడు… ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ అసహనంగా తిరిగేవాడు కృష్ణ…
తరువాత తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వంలో వచ్చిన పచ్చటి సంసారం క్లిక్కయింది… అది కమర్షియల్‌గా కాస్త బాగానే నడిచేసరికి కృష్ణకు మళ్లీ ఫోన్లు రాసాగాయి… తరువాత బిజీ అయిపోయాడు… కానీ అల్లూరి సీతారామరాజు చేశాక, ఆ పాత్ర ప్రభావం కృష్ణ మీద బాగా పడింది… ప్రేక్షకులు ప్రతి పాత్రను దాంతో పోల్చుకునేవాళ్లు… దాంతో మళ్లీ వరుసగా సినిమాలు ఫ్లాప్… కాకపోతే తను అప్పటికే ఇండస్ట్రీలో సెటిలైపోయాడు కదా, అవసరమైతే తనే ప్రయోగాత్మక సినిమాల్ని నిర్మించేవాడు తప్ప వేరే నిర్మాతలను రిస్కులో పడేసేవాడు కాదు… మోసగాళ్లకు మోసగాడు, సింహాసనం వంటి సినిమాలన్నీ తనవే…
Ads
దిగువన ఫోటో చూడండి… అప్పట్లో సీనియర్ ఫిలిమ్ జర్నలిస్టులు పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, మోహన్ దివాకర్‌లతో కృష్ణ… శాస్త్రి మర్యాదకు ‘మీరు బిజీ సార్, దొరకరు, ఎప్పుడూ షూటింగులు’ అని ఏదో అనబోతో, కృష్ణ మధ్యలోనే నవ్వుతూ ఆపేసి, నిజం చెప్పాలంటే శాస్త్రి గారూ, ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా లేదు, పదండి, గంటల కొద్దీ మాట్లాడుకుందాం అన్నాడు… అదేమిటి, మీకు సినిమాలు లేకపోవడం ఏమిటి, నిర్మాతలు క్యూ కట్టాలి కదా అనడిగితే… నిర్మొహమాటంగా… ‘‘ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది… అదే శాసిస్తుంది… నాకు వరుసగా కొన్ని ఫ్లాపులు… దాంతో ఈ గడ్డురోజులు’’ అని చెప్పాడు…
‘‘నా కారు ఎదురుగా వస్తుంటే నిర్మాతలు తమ కార్లను పక్క దారుల్లోకి మళ్లించేవాళ్లు… కనిపిస్తే సినిమా చాన్సులు అడుగుతానని వాళ్ల భయం… ఇండస్ట్రీ అంటే అంతేనండీ…’’ అన్నాడు… అందుకే ఖాళీ ఉండటం అంటేనే కృష్ణకు చిరాకు, చికాకు… పని రాక్షసుడయ్యాడు… గెలుపో ఓటమో జానేదేవ్… తెర మీద కృష్ణ ఎప్పుడూ డైనమిక్‌గా కనిపిస్తూ ఉండాలి… అంతే…
తరువాత ఓసారి కొందరు సీనియర్ జర్నలిస్టులు కనిపిస్తే… ‘‘ఇండస్ట్రీ మీద ఫిర్యాదులు వేస్టండీ, మనుషులందరూ అంతేకదా, వాళ్లున్నదే ఇండస్ట్రీ… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీరే చూడండి… అందరూ ఘంటసాల తరువాత రామకృష్ణను ప్రమోట్ చేస్తుంటే, బాలుకు ఒక్క పాట ఇచ్చేవాడు లేక ఓసారి సూట్‌కేసు సర్దుకున్నాడు… ఇంటికి వచ్చాడు… కృష్ణ గారూ, ఇక నాకు పాటలు ఎవరూ ఇవ్వరు, నేను మళ్లీ నెల్లూరు వెళ్లిపోతానన్నాడు… పర్లేదు, ఇక్కడే ఉండు, నా సినిమాల్లో పూర్తి పాటలు నువ్వే పాడుదువు గానీ అని చాన్సులు ఇచ్చాను… నిలబడ్డాడు… ఎదిగాడు…
తరువాత ఏమైంది… ఎవరో నిర్మాతతో ఏదో ఓ పాట రెమ్యునరేషన్ గొడవలోకి నన్ను లాగి, ఏకంగా నా పాటలనే పాడను అని భీష్మించాడు… సక్సెస్ ఏదైనా మాట్లాడింపజేస్తుంది ఇక్కడ… సక్సెస్ ఏదైనా చేయిస్తుంది… సక్సెస్ బుర్రలోకి ఎక్కించుకోకపోతేనే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటాం, స్వచ్ఛంగా ఉంటాం’’ అన్నాడు… అవును, సక్సెస్‌తో ఎగిరి గంతేసేవాడు కాదు, ఫెయిల్యూర్‌తో డీలాపడేవాడు కాదు… దటీజ్ కృష్ణ… అలాంటివాడు కూడా ఒంటరితనంతో డీలాపడిపోయి, చివరకు ‘స్ట్రెస్’కు తలొంచాడు… నిష్క్రమించాడు… అదీ విషాదం…!!
Share this Article