పద్మాలయా స్టూడియోస్ వద్ద కృష్ణకు ఓ మెమోరియల్ నిర్మించాలని కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్టుగా ఓ లీక్ వార్త మొత్తం మీడియాలో దర్శనమిచ్చింది… ఏం కవర్ చేసే ప్రయత్నం జరుగుతోంది..? మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాలపై వస్తున్న వ్యతిరేకతను డైల్యూట్ చేసే ప్రయత్నమా..? అదే అనిపిస్తోంది…
కృష్ణ వెళ్లిపోయాడు… అంత్యక్రియలకు సంబంధించి కొంత గందరగోళం… ప్రత్యేకించి అభిమానుల సందర్శనకు పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో పెడతాం అన్నారు… చివరి క్షణంలో రద్దు చేశారు… సాధారణంగా ఊరేగింపుకు ఓపెన్ టాప్ వాడుతుంటారు, అదీ లేదు…ఎవరైనా ప్రముఖులు మరణిస్తే వాళ్ల ఫామ్ హౌజులు లేదా ప్రైవేటు స్థలాల్లో ఖననం లేదా దహనం చేస్తుంటారు… అక్కడే స్మారకం కడుతుంటారు… కానీ కృష్ణ అంత్యక్రియల్ని మహాప్రస్థానం అనే స్మశానవాటికలో నిర్వహించారు…
ఈ మొత్తం నిర్ణయాల్లో గందరగోళంపై మహేశ్ బాబు ధోరణిపైనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి… రమేశ్ బాబు భార్య మృదుల, ఇతర కుటుంబసభ్యులు, ప్రత్యేకించి ఆదిశేషగిరిరావు చెప్పినట్టు మహేశ్ వినిపించుకోలేదనీ, దాంతో ఆయన సైలెంటుగా ఉండిపోయాడనీ అంటున్నారు… నిజానికి కృష్ణకు చివరి రోజుల్లో ఓ బాసటగా నిలబడింది ఆదిశేషగిరిరావు కుటుంబమే… మహేశ్ నిర్ణయాలతో తను బాగా బాధపడి, మౌనాన్ని ఆశ్రయించాడట…
Ads
ECMO పెట్టి, బాలు కేసులోలాగే కొన్ని రోజులు డబ్బు కుమ్మేద్దాం అనుకున్న దురాలోచనను బ్రేక్ చేశాడుట… అది ఓకే… నిజానికి రాత్రి అక్కడి తెచ్చే టైముకే కృష్ణ మరణించాడని అంటారు… కానీ తను స్టార్, అదేమో స్టార్ హాస్పిటల్, కొడుకు సూపర్ స్టార్… అంత వీజీగా తెమల్చరు కదా…
కృష్ణ స్వంత స్టూడియో పద్మాలయాను ప్రయివేటు అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ఇచ్చేసినా, దానికి సమీపంలో ఇంకా అయిదు ఎకరాల వరకు స్థలం వుందని తెలుస్తోంది. అలాగే పద్మాలయా స్టూడియోకి ప్రత్యామ్నాయంగా మహేశ్వరం ప్రాంతంలో కొన్ని ఎకరాల స్థలాన్ని కృష్ణ కొని వుంచినట్లు తెలుస్తోంది. దానికి సమీపంలోనే మహేష్ కు 30 ఎకరాల వరకు స్థలం వుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇలా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు వుండగా, ఒక్క ఎకరం కేటాయించి అక్కడ అంత్య క్రియలు జరిపించి, స్మారక మందిరం కట్టించి వుంటే బాగుండేదని టాలీవుడ్ జనాలు కామెంట్ చేస్తున్నారు. విజయనిర్మల కనుక బతికి వుంటే ఇలా జరగనిచ్చేది కాదని కూడా కామెంట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, శోభన్ బాబు ఫ్యామిలీ ఎలా చేసారో గుర్తుచేస్తున్నారు. నరేష్ తన తల్లి విజయ నిర్మల కోసం ఏం చేసారో వివరిస్తున్నారు.
ఇదంతా ప్రేక్షకుల్లోకి, ప్రత్యేకించి అభిమానుల్లోకి సరిగ్గా వెళ్లలేదు… దాంతో ఈ మెమోరియల్ ఏర్పాటు వార్తల్ని ప్లాన్ చేశారా..? అసలు అంత్యక్రియల్నే మహాప్రస్థానంలో చేసిన కుటుంబం మెమోరియల్ నిర్మిస్తుందా..? ఇదీ కృష్ణ ఫ్యాన్స్‌ను వేధించే ప్రశ్న… కృష్ణకు సంబంధించిన సినిమా గుర్తులు బోలెడు… 350 సినిమాలు కదా… బోలెడు అవార్డులు, షీల్డులు… ఇవన్నీ ఒక్కచోట భద్రపరుస్తారని లీక్డ్ వార్త చక్కర్లు కొడుతోంది…
ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఏ హీరోకి ఇలాంటి మెమోరియల్ అన్నది లేదు. ఎన్టీఆర్ మెమోరియల్ లో సమాధి తప్ప మరేం లేదు. ఎన్టీఆర్ సినిమా సామగ్రి చాలా వుంది. అది లక్ష్మీ పార్వతి దగ్గర వుంటే హరికృష్ణ అండ్ కో స్వాధీనం చేసుకున్నారు. మరి అవి ఇప్పుడు ఎక్కడ వున్నాయో ఎవరికీ తెలియదు.
ఎఎన్నార్ తన అవార్డులు అవీ ఒక్క దగ్గర వుంచి, ఇలాంటిది చేయాలని అనుకున్నారు. కానీ ఆయన మరణించాక అది అలా వుండిపోయింది. అన్నపూర్ణ స్టూడియోలో ఎఎన్నార్ అవార్డులు అవీ వుంచిన గదిలో దొంగతనం ప్రయత్నం కూడా జరిగింది. ఎఎన్నార్ కు అన్నపూర్ణలో ఓ విగ్రహం కూడా లేదు. అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడ ఎఎన్నార్ దహనకార్యక్రమాలు నిర్వహించారో తెలిసేలా ఓ గురుతు కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం కృష్ణ కోసం అయినా కుటుంబ సభ్యులు నిజాయితీగా ఓ స్మారక మందిరం జనం, అభిమానులు చూసేలా తయారు చేస్తే మంచి ఆలోచనే అవుతుంది….
Share this Article