ఒప్పినోళ్లు మెచ్చనీ ఒప్పనోళ్లు సచ్చనీ …. అని మాయదారి మల్లిగాడు అనే సూపర్ హిట్ సినిమాలోని ‘వస్తా మళ్లొస్తా’ అనే బంపర్ హిట్ పాటలో ఓ చరణం… నిజంగా కృష్ణ బతుకంతా నమ్మింది, ఆచరించింది అదే బాట… మెచ్చుకునేవాడు, అంగీకరించేవాడు ఒప్పుకోనీ, లేదంటే ఒప్పుకోకపోతే, ఒప్పుకునేందుకు మనసు రాకపోతే, వాళ్ల చావు వాళ్లు చావనీ… అంతే… ఆ సినిమాలూ అంతే, తన బతుకు తీరూ అంతే… నిజానికి గొప్పగుణం…
ఈ సచ్చనీ పదం ఏమిటి అని విసుక్కోకండి… ఆత్రేయ రాశాడు, ఒప్పకపోతే పొండి… విషయం ఏమిటంటే… కృష్ణ అప్పట్లో ఓ సినిమా తీశాడు… పేరు ఏకలవ్య… ఎంఎస్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా మొదట్లో నడవకపోయినా, సెకండ్ రిలీజులో బాగానే నడిచినట్టుంది… సినిమా బాగానే ఉంటుంది…
నిజానికి కృష్ణకు డాన్సులు, స్టెప్పులు పెద్దగా రావు… అఫ్ కోర్స్, అప్పటి హీరోలందరూ అంతే కదా… ఏవో వాళ్లకంటూ కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఉండేవి, వాటినే రిపీట్ అండ్ రిపీట్… శాస్త్రీయ నృత్యం వంటి పెద్ద పెద్ద పదాలు దేనికిలెండి… ఏఎన్నార్ కాస్త బెటర్, మూమెంట్స్‌లో ఈజ్ ఉండేది… కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ పూర్ అందులో…
Ads
కృష్ణ స్టెప్పులు మరీ డ్రిల్ మాస్టర్, ఎక్సర్‌సైజుల టైపు కదా… అలాంటిది ఏకలవ్య సినిమా కోసం దర్శకుడు విజయారెడ్డి కృష్ణకు పెద్ద టాస్క్ పెట్టాడు… నువ్వు పేరిణి శివతాండవం చేయాలి కృష్ణ గారూ, అదీ కోరిక… అసలు స్టెప్పులే వేయలేడు, అలాంటిది కృష్ణ శాస్త్రీయ నృత్యం చేయాలా..? అందులోనూ క్లిష్టమైన పేరిణి శివతాండవం… కృష్ణకే నవ్వొచ్చింది… కానీ ఎందుకో హఠాత్తుగా నేను రెడీ అన్నాడు… అదే సూత్రం… ‘‘ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ’’…
అసలు ప్రయత్నమే చేయకపోతే ఎలా..? అదేమైనా అసాధ్యమైన విద్యా..? మరీ స్టేజీల మీద ప్రదర్శనలు కాదు కదా, నాలుగు మంచి స్టెప్పులు పడితే పాట అదిరిపోతుంది కదా… అప్పటికే మోగింది డమరుకం- మేల్కొంది హిమనగం పాట రెడీ అయిపోయింది… పాట కూడా బాగా వచ్చింది… ఎంఎస్‌రెడ్డి, బాలు, మహదేవన్ కాంబినేషన్ కావచ్చు బహుశా… నిజంగానే కృష్ణ పేరిణి శిక్షణకు రెడీ అయిపోయాడు… ఆశ్చర్యంగా…
నృత్యదర్శకుడు శ్రీను కృష్ణ ఇంటి దగ్గరే మూడురోజులు పేరిణిలోని కొన్ని ముద్రలు, అడుగులు నేర్పించాడు… అంత ఈజీ కాదు, కానీ కృష్ణ మూమెంట్స్‌లో ఓ కొత్తదనం చూపడానికి ఉపయోగపడింది… నవ్వేవాళ్లు ఎప్పటిలాగే నవ్వారు… కానీ అభిమానులకు బాగా నచ్చింది… తటస్థులు కూడా చప్పట్లు కొట్టారు… ఆ డాన్స్ బాగుందని కాదు, కృష్ణ టెంపర్‌మెంట్‌కు…
కృష్ణకు అడ్వాంటేజీ ఏమిటంటే… పేజీల కొద్దీ డైలాగుల్ని ఏకబిగిన చెప్పేయగలడు… ఒకసారి చదివితే బాగా గుర్తుంచుకోగలడు… అదే ఈ నాట్యం శిక్షణకూ వాడుకున్నాడు… శివుడిని ఆవాహన చేసుకునే డాన్స్ అది… కొన్ని స్టెప్పులను బాగా ‘బట్టీ పట్టాడు’… చాలామంది దీన్ని పట్టించుకోలేదు గానీ ఓ చదువురాని బోయవాడు పేరిణి తాండవం చేయడం ఏమిటి..? గ్రాంథికంలో మాట్లాడటం ఏమిటి అనే విమర్శలు వచ్చాయి… బట్ సినిమా కదా… సబ్ చల్తా… కృష్ణ పేరిణి తాండవంలాగే…!!
Share this Article