నాగశౌర్య… అదేదో లక్ష్య అనే సినిమా కోసం, బాడీ ఎక్స్‌పోజర్ కోసం తొమ్మిదిరోజులు మంచినీళ్లు తాగలేదు అని చేసిన ప్రకటన నవ్వు పుట్టించింది… కృష్ణ విృంద విహారి సినిమా కోసం సాగించిన పాదయాత్ర మరీ అబ్సర్డిటీ… అప్పట్లో ఏదో రిసార్ట్ కేసులో ఇరుక్కున్నాడు… అప్పట్లో సాయిపల్లవితో గొడవలు… సినిమాలు వరుస ఫ్లాపులు… నిన్న ఎవరో జర్నలిస్టు వేసిన బ్రాహ్మణ భాష సంబంధ ప్రశ్నకు జవాబు లేక తత్తరపడిపోయాడు… తన కెరీర్ గమనిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది…
ఐనాసరే, తన్లాడుతూనే ఉన్నాడు… ఇప్పుడు అర్జెంటుగా తనకు ఓ హిట్ అవసరం… అందుకని రిస్క్ లేని జానర్… కాస్త కామెడీ, కాస్త ఫన్, కాస్త ఫ్యామిలీ డ్రామా, కాస్త రొమాన్స్, కాస్త లవ్వు అన్నీ కలిపేసిన ఓ కథ… న్యూజిలాండ్‌లో స్థిరపడిన ఇండియన్ అమ్మాయి షిర్లేను పట్టుకొచ్చాడు… మొత్తానికి ఏవేవో కథలు పడ్డాడు… అయితే తన ప్లాన్ ఫలించిందా..? పాదయాత్ర నోట్ల వోట్లు కురిపిస్తుందా..?
అమెరికా ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ ప్రకారం… సినిమా మరీ అంతగా కనెక్టయ్యేలా ఏమీ లేదు… ఏదో సాదాసీదాగా ఉంది… కానీ క్లీన్ సినిమా… పిల్లలు, ఫ్యామిలీతో వెళ్లదగిన సినిమా… అశ్లీలాన్ని, అసభ్యతను దగ్గరకు రానివ్వలేదు… ప్లెయిన్… ఎడాపెడా ట్విస్టులు, పగలు, యాక్షన్, నెత్తురు, ప్రతీకారాల వాసనలేమీ ఉండవు… దడదడమోగే బీజీఎం కూడా ఉండదు…
Ads
నాగశౌర్య నటనకు వంక పెట్టలేం… ఓవరాక్షన్ చేయడు… సటిల్డ్‌గా చేసుకుంటూ పోతాడు… మరీ ఎక్కువ ఎమోషన్లు కూడా ప్రదర్శించడు… హి ఈజ్ వోకే… అవునూ, ఈ సినిమాలో వ్రింద అనే పదం దేనికి..? అది నిజానికి బృంద కాదా… ఈ వృింద అనే పదానికి అర్థముందా..? అసలు ఇంకేమైనా విశేషార్థముందా..? అలాంటప్పుడు క్రిష్ణ అని రాస్తే బాగుండేది కదా… సర్లెండి, ఇలా ఆలోచిస్తే ఎవ్వడూ తెలుగు సినిమాను తీయలేడు అంటారా..? అయితే వోకే…
ఇక్కడ హీరోయిన్ గురించీ కాస్త చెప్పాలి… న్యూజిలాండ్ అంటాం గానీ తను ఇండియనే… షిర్లే సెతియా… మన దేశంలోనే పుట్టింది… డామన్ ఆమె స్వరాష్ట్రం… కానీ ఏడేళ్ల వయస్సులోనే పేరెంట్స్‌తోసహా న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వెళ్లిపోయింది… చదువూసంధ్యా అక్కడే… నిజానికి తను నటిగా కాదు, సింగర్‌గానే పాపులర్… అదీ పాప్ సింగర్… బోలెడు ఆల్బమ్స్ చేసింది… కొన్నాళ్లు రేడియో జాకీ… యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసింది… అవి బాగా క్లిక్ కావడంతో తను ముంబైకి వచ్చి కొత్త అవకాశాలు వెతుక్కోవడం స్టార్ట్ చేసింది…
హైదరాబాద్‌తో ఆమె అనుబంధం ఇప్పుడేమీ కొత్త కాదు… 2015 నుంచీ కనెక్టయ్యే ఉంది… అప్పట్లో మస్కా అనే సినిమా చేసింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం… తరువాత నికమ్మా అనే ప్రాజెక్టు చేస్తోంది… అప్పుడే తెలుగు నుంచి ఈ నాగశౌర్య సినిమా ఆఫర్ వచ్చింది..!! ఈ సినిమాలో బాగానే చేసింది, ఆమె పాత్ర రీత్యా పెద్దగా నటనకు స్కోప్ ఏమీ లేదు కాబట్టి సరదాగా చేస్తూపోయింది… కొత్తకొత్తగా ఏమీలేదు… అనుభవమున్న నటిలాగే…!!
ఈ సినిమా కూడా అప్పుడెప్పుడో 2020లో ప్రారంభమైంది… కదిలీ, ఆగి… ఆగీ, కదిలి… ఎట్టకేలకు రిలీజైంది… ఇది నాగశౌర్య సొంత సినిమా… ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడికీ, ఓ మోడరన్ యువతికీ నడుమ లవ్ ట్రాక్ కాబట్టి… కంట్రాస్టు ఎలివేట్ చేయడానికి నాగశౌర్యను బ్రాహ్మణ యువకుడిగా చూపించారు… భాష మార్చారు… కానీ అవసరం లేదు… సంప్రదాయ కుటుంబం అంటే బ్రాహ్మణ కుటుంబాన్నే చూపించాలా..? సున్నితమైన గీత దాటితే సంప్రదాయం కాస్తా ఛాందసం అవుతుంది…
థియేటర్లలో ఇప్పుడు చెప్పదగిన కొత్త సినిమాలు ఏమీ లేవు… పైగా ఈ సినిమా గొప్పగా లేకపోయినా సరే, చెత్తగా ఏమీ లేదు… ఒకటీ అరా పాటలు కూడా మెలోడియస్… హీరోయిన్ అందంగా ఉంది… సినిమా మొత్తం ఫన్, కామెడీ… వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ మెప్పించకపోయినా సరే, మరీ నాసిరకంగా ఏమీ లేదు కామెడీ… వెరసి స్థూలంగా కృష్ణ వ్రింద విహారి… జస్ట్, వోకే… నాట్ సూపర్…!! కాకపోతే ఇలాంటి సినిమాలన్నీ జనాన్ని థియేటర్లకు రప్పించగలవా అనేది పెద్ద ప్రశ్న… ప్రతి సినిమా సీతారామం కాలేదు కదా…!! అన్నట్టు సినిమా చూస్తున్నంతసేపూ మీకు ‘అంటే సుందరానికి’ సినిమా కథ గుర్తొస్తే అది మీ తప్పు కాదు… ఈ సినిమా దర్శకుడిదే…!!
Share this Article