.
కృష్ణయ్యను నిందించటం ఎందుకు? పార్టీలు పిలిచి ఎమ్మెల్యే టికెట్లు, రాజ్యసభ సీట్ ఇస్తే కృష్ణయ్య తీసుకొన్నారు అనుకోవాలి, డబ్బులు ఇచ్చి రాజ్యసభ కొనుక్కునే పరిస్థితి కృష్ణయ్యకు లేదు…
2014లో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీ నగర్ సీట్ కృష్ణయ్యకు ఇచ్చింది. అప్పటి వరకు ఎల్బీ నగర్ టిడిపి, తెరాస మరియు బిజేపీ పార్టీల ఇంచార్జులుగా ఉన్న ఎస్వీ కృష్ణ ప్రసాద్, కాచం సత్యనారాయణ, కళ్ళెం రవీందర్ రెడ్డి అందరూ కాంగ్రెస్ అభ్యర్థి సుదీర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ లో చేరిపోయారు. సుధీర్ గెలుపు సులభం అనుకున్నారు కానీ కృష్ణయ్య 12,500 తేడాతో తెరాస అభ్యర్థి రామ్ మోహన్ గౌడ్ మీద గెలిచారు. కాంగ్రెస్ సుధీర్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని కృష్ణయ్య టీడీపీని అడిగారా? లేదు.. బీసీ సీఎం అనే నినాదంతో తమ ఓట్ బ్యాంక్ కాపాడుకోవాలని టీడీపీయే పిలిచి మరీ టికెట్ ఇచ్చింది.
Ads
2018 ఎన్నికలు .. మిర్యాలగూడ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది .. 2014లో గెలిచిన జానారెడ్డి శిష్యుడు నల్లమోతు భాస్కర్ రావు తెరాసలోకి ఫిరాయించటంతో 2018లో తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవాలని జానారెడ్డి ప్రయత్నం చేసినా వర్గపోరులో కుదరలేదు. ఒక వర్గానికి ఇస్తే మరో వర్గానికి కోపం .. ఇవన్నీ ఎందుకు అనుకొని కృష్ణయ్యను పిలిచి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ . ముప్పై వేల తేడాతో తెరాస భాస్కర్ రావు చేతిలో ఓడిపోయారు.
2019లో సీఎం అయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చేసిన రాజకీయంలో భాగంగా ఎవరు సలహా ఇచ్చారో కానీ (I-Pac కాదనుకుంటున్నా…) కృష్ణయ్యను పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చారు.. రాజ్యసభ రాకముందు జీవితంలో ఒక్కసారి కూడా కృష్ణయ్య జగన్ ను కలిసి ఉండరు..
కృష్ణయ్య 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం అసలు పనిచేయలేదు. 2024లో కూడా ఏదో చేసాం అంటే చేసాం అన్నట్లు నాలుగు సభల్లో పాల్గొన్నారు..
ఆయన కుర్మ/కురుబ.. సీట్ ఇచ్చిన జగన్ కృష్ణయ్యను వాడుకుంది లేదు . కానీ ఆంధ్రాలో బిసి నాయకులు లేరా అంటూ చాలా మంది బిసి నాయకులు వైసీపీకి దూరం అయ్యారు.
బీజేపీ ఎందుకు కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చింది?.
2014 ఎన్నికల్లోనే మోడీ బీసీ ప్రధాని అని బీజేపీ దక్షిణాదిలో ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ కూడా బీసీ ప్రధాని అని బాగా ప్రచారం చేశారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాదిలో సాంప్రదాయకంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న కొన్ని సామాజిక వర్గాలు దూరం అయ్యాయి.
దాన్ని అర్ధం చేసుకున్న బీజేపీ బీసీ కార్డ్ బాగా వాడటం మొదలు పెట్టింది. హర్యానాలో జాట్లను కాదని బిసిలకు సీట్లు ఇచ్చింది, గెలిచింది కూడా. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి కౌంటర్ గా “మాధవ్ ” అనే పేరుతో బహుజనులకు ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. మాధవ్ అంటే మాలి, దంగర్, వింజారీ ఫ్యాక్టర్. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది.
ఇప్పుడు టార్గెట్ తెలంగాణ .. ఇక్కడ కూడా బిసి నినాదంతోనే బీజేపీ రాజకీయం చేస్తుంది . బండి సంజయ్ (మున్నూరు కాపు), అరవింద్ (మున్నూరు కాపు), ఈటెల రాజేందర్ (ముదిరాజ్)లతో ఇప్పటికే ఉన్న బిసి నాయకత్వానికి కృష్ణయ్య (కురుమ లేదా గొల్ల కురుమ) అదనవు బలాన్ని జత చేస్తుంది.. త్వరలో ఒక పద్మశాలీ నేతను కూడ చేర్చుకుంటారు..
బీజేపీ స్ట్రాటజీకి బిసి నేతలు కార్యసాధకులు అవుతారో లేదో కానీ బీజేపీకి ఓటు బ్యాంక్ తయారు చేయటానికి ఉపయోగ పడతారు.. జగన్ పదవి ఇచ్చి వాడుకోలేదు కానీ బీజేపీ తీరు వేరే.. పక్కా ప్రణాళికతో పనిచేస్తుంది, నాయకులతో పనిచేయిస్తుంది..
అన్ని పార్టీలకు మరో 12 నెలల్లో జరగబోయే GHMC ఎన్నిక పెద్ద పరీక్ష .. ఒక రకంగా 2028 శాసనసభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించవచ్చు.
నైతిక విలువలు అంటూ కృష్ణయ్యను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించలేదు.. మీరు ఏమి చూసి నాకు పదవి ఇచ్చారు అని తనే ఎదురు ప్రశ్నిస్తే పార్టీల దగ్గరే సమాధానం ఉండదు.. మరి ఇన్ని పార్టీలు మారితే అవకాశవాదంతో పదవులు తీసుకుంటే పర్లేదా? సిద్ధాంతం, విలువలు ఉండాలి కానీ వాటిని తుడిపేస్తున్నది పార్టీలే..
నయీమ్ నన్ను సీఎంగా చూడాలి అనుకున్నాడు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కృష్ణయ్య నిజ జీవితంలో ఒకసారి సీఎం అభ్యర్థి అయ్యారు.. మరి సీఎం అవుతారా? అవొచ్చు కాకపోవచ్చు కానీ సీఎం కాలేడు అని మాత్రం చెప్పలేము…… ( విశ్లేషణ :: శివ రాచర్ల )
Share this Article