Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణార్జునులు..! సమఉజ్జీల మల్టీస్టారర్లు ఇప్పుడు సింప్లీ అసాధ్యం..!!

February 17, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… యన్టీఆర్- ఏయన్నార్ , కృష్ణ- శోభన్ బాబు . తెలుగు సినిమా రంగంలో రెండు తరాల హీరోలు . ఒకరికి ఒకరు పోటీదారులు . ఆ పోటీ ఎంత తీవ్రం అంటే వాళ్ళు చనిపోయినా వాళ్ళ వీరాభిమానులు ఈరోజుకీ పాత కచ్చల్ని మరచిపోలేదు .

అలాంటి ఈ ద్వయాలు కలిసి ఓ చెరో డజను సినిమాల్లో నటించారు . వాటిల్లో సగం స్టార్లు , సూపర్ స్టార్లు , నటసామ్రాట్లు , నటరత్నలు అయ్యాక నటించినవే .

Ads

ఈ రెండు ద్వయాల తర్వాత వచ్చిన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లలో ఏ ఇరువురూ కలిసి ప్రధాన పాత్రలలో నటించకపోవటం ఆశ్చర్యమే . హిందీలో కూడా చాలా కాంబినేషన్లు ఉన్నాయి . అగ్ర నటులు కూడా కలిసి నటించారు . అయినా మన నలుగురిని మాత్రం ఎవరు కలపలేకపోయారు .

వీళ్ళను మించిపోయారు వీరి తర్వాత వచ్చిన ప్రభాస్ , మహేష్ బాబు , జూనియర్ యన్టీఆర్ , రాంచరణ్ , అల్లు అర్జున్లు . ఎవరి సామ్రాజ్యాలు వారివే . ఇంక మన సినిమాలోకి వద్దాం .

జయకృష్ణ నిర్మాతగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ కృష్ణార్జునులు సినిమా బ్రహ్మాండాలను పగలకొట్టలేదు కానీ బాగానే ఆడింది . కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . సినిమా చూస్తుంటే వీళ్ళిద్దరు కలిసి నటించిన మంచి మిత్రులు సినిమా గుర్తుకొస్తుంది . ఈ కృష్ణార్జునులు సినిమాలో కూడా కృష్ణ పాత్రలో శోభన్ బాబు మంచబ్బాయి . అర్జున్ పాత్రలో కృష్ణ దొంగబ్బాయి . ఇరువురూ గొప్ప స్నేహితులు .

ఇరువురూ జీవన సాగరంలో తరచూ విబేధిస్తుంటారు , మళ్ళీ మళ్ళీ కలుస్తుంటారు విడిపోలేక . శోభన్ బాబు చెల్లెల్ని కృష్ణ పెళ్ళి కూడా చేసుకుంటాడు . మధ్యలో వీళ్ళిద్దరి మధ్య విలనేశ్వరుడు తగాదాలు పెట్టి ఫైటింగులు కూడా చేపిస్తాడు .

విలన్ కుట్రలను తెలుసుకుని ఇద్దరూ కలిసి విలనేశ్వరుడిని , అతని పుత్రరత్నాన్ని వాయించేస్తారు . సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే విలన్ ఇద్దరి చేతా తన్నులు తినాలి . లేకపోతే ఆయా హీరోల అభిమానులు వెండితెరల్ని చీల్చి చింపేస్తారు .

ఈ సినిమాలో ఇంకో విశేషం ఉంది . శ్రీదేవి , జయప్రదలు వదినామరదళ్ళు . కలిసి మరదలా మరదలా అంటూ ఓ పాట కూడా డాన్సిస్తారు . 1982 మార్చిలో వచ్చిన ఈ సినిమా టైంకు ఇద్దరి మధ్యా ఎండు గడ్డి వేసినా భగ్గుమనేది కాదు . 1982 సెప్టెంబరులో దేవత సినిమా వచ్చేటప్పటికి బధ్ధ విరోధులు అయిపోయారు .

ఆ సినిమా షూటింగుకు వీళ్ళిద్దరి సీన్ల షూటింగుకు తాను ఎన్ని అష్టకష్టాలు పడ్డాడో రాఘవేంద్రుడు ఓ ఇంటర్వ్యూలో వివరించారు . అంత పెద్ద దర్శకేంద్రుడే అన్ని అష్టకష్టాలు పడ్డాడు . కానీ , ఈ సినిమాలో అందంలో , హుషారు నటనలో , డాన్సించటంలో ఆరోగ్యకరంగా పోటీ పడ్డారు .

వీరిరువురూ ఎంత ఆహ్లాదకరంగా నటించారో అంతే ఆహ్లాదకరంగా కృష్ణ- శోభన్ బాబులు కూడా నటించారు . దాసరి కూడా ఇద్దరినీ చక్కగా అందంగా చూపారు . ఎప్పటిలాగే కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు అన్నీ ఆయనే . అంతే కాదు ; సినిమాలో ఓ సీన్లో ఎర్ర నారాయణమూర్తి కనిపిస్తాడు . ఓ అయిదారు డైలాగులు ఉంటాయి . ఆ డబ్బింగ్ కూడా ఎందుకనో మరి దాసరే చెప్పినట్లుగా ఉంది .

మొత్తం మీద ఓ చక్కటి ఎంటర్టైనర్ . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . చిత్రీకరణ చాలా బాగుంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిన మరదలా మరదలా అనే పాట నాకు బాగా నచ్చింది . వరకట్నం సినిమాలో మరదలా మరదలా తమ్ముడి పెళ్ళామా అంటూ సాగే సావిత్రి , కృష్ణకుమారిల పాట గుర్తుకొస్తుంది . అందులో ఉన్నంత సరసం ఈ పాటలో ఉండదనుకోండి .

మంచుకొండల్లోన ఎండ కాచినట్లు , సుందర బృందావనిలో డ్యూయెట్లు రెండు జంటలవీ చాలా బాగుంటాయి . రెండూ వేటూరయ్యే వ్రాసారు . దాసరి వ్రాసిన మేమే కృష్ణార్జునులం అంటూ సాగే పాట కృష్ణ- శోభన్ బాబుల మీద ఇద్దరి హీరోల అభిమానులకు బాగా నచ్చుతుంది . ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు , బంగారు బాలపిచ్చుకా పాటలు కూడా బాగానే ఉంటాయి . (అఫ్ కోర్స్, ప్రాసల ప్రయాసలో వెచ్చగుంది పచ్చిక, ముద్దుముచ్చిక వంటి పిచ్చి పదాలు కూడా బోలెడు బాలపిచ్చుకా పాటలో…)

శ్రీదేవి ముక్కు ఆపరేషన్ (రైనోప్లాస్టీ) చేయించుకున్నాక వచ్చిన ఈ సినిమాలో ఆమె ముక్కు మీద విలపించిన వారు ఉన్నారు , సంబరం చేసుకున్న వాళ్ళూ ఉన్నారు . సినిమా వాళ్ళవన్నీ మనవే కదా !!

ఇతర ప్రధాన పాత్రల్లో పుష్పలత , రావు గోపాలరావు , ప్రసాదబాబు , అల్లు రామలింగయ్య , సత్యనారాయణ , కె విజయ ప్రభృతులు నటించారు . ఏ మోహన్ బాబో , గిరిబాబో నటించి తన్నులు తినవలసిన విలన్ కొడుకు పాత్రను ప్రసాద్ బాబుకు రావటం కూడా విశేషమే .

ఇద్దరు లీడింగ్ హీరోలు , ఇద్దరు లీడింగ్ హీరోయిన్లు కలిసి నటించిన మల్టీ స్టారర్ మంచి ఎంటర్టైనరే . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . తరచూ ఏదో ఒక చానల్లో కూడా వస్తూనే ఉంటుంది . A watchable , entertaining , feel good movie without any obscene scenes .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!
  • కూలిపోతున్న మినీ బంగ్లాదేశ్… కానీ ఇలాంటివి దేశంలో కోకొల్లలు..!!
  • నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
  • ఎస్.., ఓ అవకాశం ఇవ్వాల్సిందే..! ధిక్కార తూటా శాంతిమంత్రం..!!
  • చార్‌ ధామ్ కాదు… ఇది పంచ కేదార్..! వెరీ ఇంట్రస్టింగ్ కారిడార్..!
  • ఒక మనిషి మరణించబోతున్నాడు… దేవుడొచ్చాడు చేతిలో ఓ పెట్టెతో…
  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions