Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరాఖర్లో విజయశాంతి కన్న బిడ్డను కృష్ణ, శ్రీదేవి స్వీకరిస్తారు…

March 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. యన్టీఆర్ కృష్ణావతారం కాదిది . కృష్ణ కృష్ణావతారం . బుద్ధిమంతుడు వంటి బ్లాక్ బస్టర్ని నిర్మించిన చిత్రకల్పన బేనర్లో సెప్టెంబర్ 1982లో బాపు దర్శకత్వంలో వచ్చింది ఈ కృష్ణావతారం . బాపు ఆత్మమిత్రుడయిన ముళ్ళపూడి వెంకట రమణ ఈ సినిమాకు నిర్మాత కూడా . ఆయన , శ్రీరమణ కలిసి ఈ సినిమా స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . బహుశా అందరికీ వాటాలు ఉన్నాయేమో !

మూలకధ కె యన్ టైలర్ అని టైటిల్సులో చెప్పారు . ఈ టైలర్ తుళు భాషలో పాపులర్ కధా రచయిత , రంగస్థల నటుడు , సినిమాలలో కూడా నటుడు . ఆయన మూలకధకు మెరుగులు దిద్దుకుని ముళ్ళపూడి , శ్రీరమణ ఈ సినిమా కధను తయారు చేసుకుని బాపుకు దర్శకత్వం అప్పచెప్పి ఉండాలి .

Ads

ఈ సినిమా చూస్తుంటే మాయదారి మల్లిగాడు సినిమా గుర్తుకొస్తుంది . కధలు వేర్వేరు . కృష్ణ చలాకీగా , స్వఛ్ఛ మనసుతో పదిమందికీ ఉపయోగ పడే వ్యక్తిగా , నవ్వుతూ బతికాలిరా అనే మనిషిగా నటించారు రెండు సినిమాలలోని పాత్రల్లో . అలా ఆ సినిమా గుర్తుకొస్తుంది .

కృష్ణకు జోడీగా అతిలోకసుందరి . జోడీ చాలా అందంగా ఉంటుంది . నిజాయితీపరుడైన తన మామ కొరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెంటనే ఉండే పాత్రలో శ్రీదేవి బాగా నటించింది . బహుశా బాపు దర్శకత్వంలో ఆమె ఈ ఒక్క సినిమాలోనే నటించిందేమో !

కృష్ణది దొంగల్లుడు పాత్ర . ఓ డబ్బున్న మారాజుకి ఓ కంత్రీ లాయర్ అల్లుడు ఉంటాడు . ఆ లాయర్ కస్టమర్ చిల్లర దొంగ కృష్ణ . సినిమాలో పేరే కందుల కృష్ణావతారం . కంత్రీ లాయర్ దుర్మార్గంగా మరదలిని గర్భవతిని చేస్తాడు . పరువు కాపాడుకోవటానికి ఓ దొంగల్లుడు అవసరం అవుతాడు . హీరో గారిని దింపుతాడు కంత్రీ లాయర్ .

ప్రసవం అయిపోయాక హీరోని లేపేయటానికి ఇంట్లో అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు . హీరో మాత్రం మోసపోయిన చిన్న కూతురికి రక్షణగా ఉంటాడు . క్లైమాక్సులో కంత్రీ లాయర్ హీరోని షూట్ చేయబోయి , మరదల్ని షూట్ చేస్తాడు .

చనిపోయే ముందు తనను గర్భవతిని చేసిందీ , అన్ని విలన్ కార్యక్రమాలు కంత్రీ బావయ్యే అని చెప్పి ప్రాణాలను వదులుతుంది . ఆమె ప్రసవించిన బిడ్డను తీసుకుని హీరోహీరోయిన్లు నిష్క్రమిస్తారు . టూకీగా ఇదీ కధ .

కధ డిఫరెంటుగానే ఉంటుంది . బాపు శుభ్రంగానే తీసారు . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాపు మార్కులో శ్రావ్యంగానే ఉంటాయి . కృష్ణ , శ్రీదేవి జోడీ అందంగా , చలాకీగా ఉంటుంది . అయితే ఆ లెవెల్లో అడినట్లుగా లేదు సినిమా . కృష్ణ సినిమా కాబట్టి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి ముళ్ళపూడి వారు నష్టాలు లేకుండా లాభాలతోనే బయటపడి ఉండాలి . యాభై రోజుల పోస్టర్ పడింది .

కంత్రీ లాయరుగా శ్రీధర్ , మరదలుగా అప్పుడప్పుడే పైకొస్తున్న విజయశాంతి , భార్యగా కె విజయ , డబ్బున్న మామగా రమణమూర్తి , అత్తగా పి ఆర్ వరలక్ష్మి నటించారు . ఇతర పాత్రల్లో వల్లం నరసింహారావు , అల్లు రామలింగయ్య , కాంతారావు , రాళ్ళపల్లి ప్రభృతులు నటించారు .

బాపు మార్క్ తోటలో పాటలు ఉన్నాయి . మేలుకోరాదా కృష్ణా మేలుకోరాదా , ఇంట్లో ఈగల మోత , కొండ గోగు చెట్టు , సిన్నారి నవ్వు , హాయి హాయి హాయి ఆపదలు గాయి , ఓ కంట కన్నీరు మురిసేను సూడు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . జైల్లో స్వాగతం గురూ అనే పాట మాయదారి మల్లిగాడు సినిమాలోని నవ్వుతూ బతకాలిరా పాటను గుర్తుకు తెస్తుంది .

పాటల్ని సి నారాయణరెడ్డి , ఇంద్రగంటి శర్మలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజలు బాగా పాడారు . బాబా ఆజ్మీ తన ఫోటోగ్రఫీలో సినిమాను , ముఖ్యంగా కృష్ణని అందంగా చూపారు . ఆజ్మీ బాపుకి ఇష్టమైన , నమ్మకమైన ఫోటోగ్రఫీ నిపుణుడు కదా ! ఎవరి టీం వారిది సినిమా రంగంలో .

వెరశి మంచి , శుభ్రమైన , అసభ్యత లేని సంస్కారవంతమైన సినిమా . A feel good , sentimental , emotional , family entertainer . కృష్ణ అభిమానులు , అతిలోకసుందరి అందాభిమానులు , బాపు అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడండి . చూడబులే . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
  • ‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
  • ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
  • వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
  • అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
  • అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
  • అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
  • దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
  • గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions