అధికారం పోయాక… కేసీయార్ జాడాపత్తా ఎలాగూ లేదు… జనమే వాళ్ల తీటకు వాళ్లు మళ్లీ పిలిస్తే, అనుకూలతలు కలిసొస్తే జనంలోకి మళ్లీ వస్తాడు… హైడ్రాలు, వరదలు, మూసీలు ఏవీ తనను ఫామ్ హౌజు నుంచి రప్పించలేవు… మరోవైపు కేటీయార్ ట్వీట్ల రాజకీయం… హరీష్ రావు ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తనకూ తెలియడం లేదు…
హర్యానా ఫలితాలపై కేటీయార్ స్పందన కాస్త నవ్వొచ్చేదిగా ఉంది… తనేం అంటాడంటే..? ‘‘కాంగ్రెస్ గ్యారంటీలకు వారెంటీ లేదని తేలిపోయింది, హర్యానా వోటర్లు తిరస్కరించారు… అంతేకాదు, బీజేపీని నిలువరించే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉంది, ఈ దేశ ఫెడరల్ స్పిరిట్ కాపాడేది కూడా ప్రాంతీయ పార్టీలే… భవిష్యత్తు కూడా వాటిదే’’
కాంగ్రెస్ గ్యారంటీలు, వారెంటీలు అని ప్రాసల వాడకం తప్ప అందులో అర్థం లేదు… ఎస్, కాంగ్రెస్ కర్నాటక, తెలంగాణల్లో ప్రయోగించిన అలవిమాలిన హామీలు జనాన్ని ప్రలోభపెట్టి, రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేవే… తమ అధికారం కోసం… కాంగ్రెసే కాదు, ప్రతి పార్టీ అంతే కదా మాస్టారూ… బీఆర్ఎస్ మాత్రం తక్కువ హామీలు ఇచ్చిందా…? మీరే కదా మా హామీల్ని కాంగ్రెస్ కాపీ కొట్టింది అని చెప్పారు అప్పట్లో… అంటే, మీరూ ఆ రేంజ్ హామీలే ఇచ్చినట్టు అంగీకారమే కదా…
Ads
గత ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు కూటమి ఇచ్చిన హామీలు ఏం తక్కువా..? ఐదేళ్లలో జగన్ పంచుడు పథకాలు ఏం తక్కువా..? కాకపోతే, కాంగ్రెస్ జనాకర్షక… కాదు, ప్రజాప్రలోభ హామీలకు హర్యానా వోటర్ల తిరస్కారం ఓరకంగా దేశానికే ప్రయోజనకరం… కరెంటు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, రుణాలు మాఫీ ఎట్సెట్రాలన్నీ ఇకపై ఏ పార్టీ విపరీతంగా ప్రలోభపెట్టినా సరే గెలుపు ఖాయమనే భ్రమలు మాత్రం ఉండవు… గుడ్ టు సొసైటీ… ఈ కోణంలో హర్యానాలో కాంగ్రెస్ ఓటమి ఓ శుభసంకేతం…
కేటీయార్ వ్యాఖ్యల్లో మరొక వింత ఏమిటంటే..? భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే… బీజేపిని నిలువరించేది ప్రాంతీయ పార్టీలే అనే వ్యాఖ్య… అచ్చం ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను పేరు మార్చి, జాతీయ పార్టీగా మార్చిన సంగతి మరిచిపోయినట్టున్నాడు… సారూ, మనది కూడా జాతీయ పార్టీయే… కాకపోతే తెలంగాణలోనే నడుం విరిగి, డాడీ ప్రధాని కలలు భగ్నమయ్యాయి… అంతే…
మొన్న ఏపీలో బీజేపీ కూటమి మీద జగన్ ప్రాంతీయ పార్టీ గెలవలేదెందుకు..? తెలంగాణ లోకసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లే పర్‌ఫామ్ చేశాయి, బీఆర్ఎస్ సోదిలోకి లేకుండా పోయిందిగా… హర్యానాలో జేజేపీ, ఐఎన్ఎల్‌డీలనే ఉపప్రాంతీయ పార్టీలు కొట్టుకుపోతే, కాంగ్రెస్, బీజేపీలే కదా పర్‌ఫామ్ చేశాయి… కశ్మీర్‌లో పీడీపీ అనే ప్రాంతీయ పార్టీ కూడా కొట్టుకుపోయిందిగా… మీలాంటి జాతీయ పార్టీ ఆప్ కూడా భంగపడింది కదా… కాంగ్రెస్‌తో కలిసిన నేషనల్ కాంగ్రెస్ గెలిచింది తప్ప ఆ ప్రాంతీయ పార్టీ సంపూర్ణ గెలుపు ఏమీ కాదు కదా…
అసలు ప్రాంతీయ పార్టీలు అంటేనే కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, వారసత్వ పార్టీలు… వేటికీ జాతీయ అంశాలపై ఓ విధానమే ఉండదు… నేషనల్ ఔట్ లుక్ కూడా ఉండదు… ప్చ్… పేరుకు ఓ జాతీయ పార్టీగా మారి, బొచ్చెడు ఖర్చు పెట్టి, బోలెడంత ప్రయాసపడి సైతం… ఇంకా ప్రాంతీయ పరిమితుల్లోనే ఉనికి కోసం కొట్లాడుతున్న తీరు, ప్రాంతీయ పార్టీలే దేశానికి దిక్కు అనే ఆలోచనలు నిజంగా ఓ దుస్థితే..!!
Share this Article