ఆంధ్రజ్యోతి జగన్ మీద రోజూ ఏదో ఒకటి రాస్తుంది… జాతి ద్వేషం అనను గానీ, అది ఆ పచ్చ పార్టీ క్యాంపు ఎజెండా… సాక్షి నీలి పత్రిక, నీలి మీడియా అని ఓ ముద్దరేస్తుంది… (నిజానికి సాక్షికి పెద్దగా నీలితనం మీద ఇంట్రస్టు, టేస్టు ఉన్నట్టు కనిపించదు… కాస్తోకూస్తో ఆంధ్రజ్యోతి సైటులోనే ఓ పోకడ ఎక్కువ…) సాక్షి అనే పేరునే తన పత్రికలో పబ్లిష్ చేయదు… అదేదో నిషిద్ధాక్షరిలాగా…
సాక్షి ఆంధ్రజ్యోతిని బూతు పత్రిక, యెల్లో మీడియా, తోకపత్రిక అని రకరకాలుగా పిలుస్తుంది… అదీ ఆంధ్రజ్యోతి అనే పేరు రాయదు… చిన్న పిల్లల తరహా… వాడు నా పేరు రాయడు, నేనెందుకు వాడి పేరు రాయాలి అన్నట్టుగా…! సరే, రెండూ వేర్వేరు పార్టీల క్యాంపుల్లోని మైక్ సెట్లు… నడుమ ఈనాడు…
ఈనాడులో ఏదైనా వార్త వస్తే మటుకు సాక్షి ఎక్కడలేని రోషం, పౌరుషం పొంగుకొస్తాయి… ఠాట్, నువ్వు రాసింది తప్పు, ఇదీ నిజం అంటూ తన వెర్షన్‌ను ఎడిటోరియల్ పేజీ నిండా పరిచేస్తుంది… అదెంత మంది చదువుతారని నన్నడగొద్దు… అవి జగన్ ప్రభుత్వ యాడ్స్‌లాగా అనేకానేక లెక్కలు, సమీకరణాలు, మ్యాథ్స్ నోట్‌బుక్‌లాగా ఉంటయ్… అంతే… ఐనాసరే, ప్రజాధనం కోట్లకొద్దీ ఆ యజ్ఞగుండంలో కుమ్మరిస్తూనే ఉంటారు…
Ads
ఇవి పుట్టుమచ్చల కొట్లాటలు… అర్థమైనవాడికి అర్థమైనంత..! పట్టుమని పదిమంది చదివే మరింకే పత్రిక లేదు గనుక ఈ మూడు రాసిందే చెలామణీలోకి వస్తుంటుంది… కట్ చేస్తే… తెలంగాణకు వెళ్దాం… కేసీయార్ తన ప్రెస్‌మీట్లలో విలేకరుల మీదే మాటల దాడి చేస్తాడు… ప్రశ్న అడగనివ్వడు, అడిగినవాడికి పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టే… చెప్పింది రాసుకోవాలి, ప్రశ్నలు కూడా అడగమన్నవాళ్లే, అడగమన్నవే అడగాలేమో…
మరి కేసీయార్ కొడుకే కదా కేటీయార్… గురువారం మోడీని తిట్టడానికి ఓ ప్రెస్‌మీట్ పెట్టాడు… సహజం… రెండు పార్టీల నడుమ మండుతోంది… మరోవైపు ఆయన సోదరి అరెస్టు ముంగిట్లో నిలబడి ఉంది… వీ6 లేదా వెలుగు విలేకరి ఏదో అడిగినట్టున్నాడు… ఇంకేం కేటీయార్ అందుకున్నాడు… ‘‘డ్రై స్టేట్ గుజరాత్ లో లిక్కర్ తాగి 42 మంది చనిపోతే.. దాన్ని స్కాం అంటామా.. స్కీమ్ అంటామా.. మీ వీ6లో చూపించారా? వీ6లో ఏం చూపిస్తారో తెలుసు.. ఏం మాట్లాడతారో తెలుసు.. ఏం డ్రామాలు చేస్తారో మాకు తెలుసు.. ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు… బీజేపీకి మౌత్ పీస్ లా ఉన్న చిల్లర చానెల్స్ ను ప్రజల ముందు ఎండగడతాం అంటూనే… బీజేపీ ఆఫీసులో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేను బ్యాన్ చేశారు.. అది అప్రజాస్వామికం కాదా, బీజేపీ అడించినట్లు కొన్ని పత్రికలు, టీవీలు ఆడుతున్నాయి.. బీబీసీపైనే దాడి చేసినోళ్లు.. దేశంలోని ఈ మీడియా ఎంత..? మీ ఓనర్ మీ ఆఫీసులోనే పార్టీ మీటింగులు పెడతాడనీ అన్నట్టు వినిపించింది…
ఇదేదో సదరు జర్నలిస్టును కించపరిచినట్టుగా భావించాల్సిన పనిలేదు… కేటీయార్ మాటలు సదరు పత్రిక, సదరు టీవీ, సదరు యాజమాన్యంపై చేసిన వ్యాఖ్యలే… కాకపోతే మీడియా మీటింగుకు పిలిచి, ఇలా పదిమంది మధ్యలో ఒక్క విలేకరిని పట్టుకుని, తను పనిచేసే మీడియాను ఉద్దేశిస్తూ పరుష వ్యాఖ్యలు చేయడం సరైందిగా అనిపించలేదు… వీ6, వెలుగును తిట్టాలనుకుంటే స్ట్రెయిట్‌గానే తిడితే సరి, ఆ విలేకరి చేసిన తప్పేముంది..? మీడియా హౌజు లైన్‌ను బట్టి వ్యవహరించాడు… అంతేకదా…
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ భగ్గుమంటున్నప్పుడు… వాటి మౌత్ పీసులు ఇలాంటి ఘర్షణలకే గురవుతాయి కదా… నమస్తే తెలంగాణ, తెలంగాణటుడేలను బీజేపీ బ్యాన్ చేసిందట… త్వరలో వీ6, వెలుగులను బీఆర్ఎస్ బ్యాన్ చేస్తుందట… వెలుగులో బీఆర్ఎస్, సర్కారు వ్యతిరేక వార్తలు రాస్తే కొన్నిసార్లు నమస్తే నెగెటివ్ కౌంటర్లు రాసేది… ఇప్పుడిక కేటీయార్ నోటి నుంచే బ్యాన్ మాట వచ్చిందిగా, ఇక అదీ రెచ్చిపోతుంది… పార్టీల వార్‌కన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మీడియా వార్ హాట్‌హాట్‌గా ఉంది… తెలుగు వార్తాచానెళ్లకే ఈ పోరాటం చేతకావడం లేదు… ప్చ్, ప్చ్..!! ఫాఫం, కాంగ్రెసే… పత్రిక లేదు, చానెల్ లేదు… ఎవరినీ తిట్టలేదు, ఎవరినీ కీర్తించలేదు…!!
Share this Article