Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేవలం పోలీసులు విచారిస్తున్నారు సారూ… తీర్పు చెప్పడం లేదు…

January 23, 2026 by M S R

.

ముందుగా ఓ విషయం గుర్తుచేసుకుందాం… ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు తన మీద నమోదైన కేసులు (అవీ రాజకీయ ప్రేరితాలే) వస్తే… మౌనంగా బోనులో నిలబడ్డాడు… ఒక్క ముక్క కూడా ఈ సిస్టంకు వ్యతిరేకంగా మాట్లాడలేదు… అది హుందాతనం, వ్యవస్థకు ఇచ్చే గౌరవం… తప్పుచేయనివాడు అలా మౌనగాంభీర్యాన్ని కనబరుస్తాడు…

మరో విషయం… తమిళనాడులో ఓ గుడిలో కార్తీకదీపం కేసులో తీర్పునిస్తే, ఆ న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానానికి ప్రయత్నించాయి డీఎంకే, లెఫ్ట్ తదితర పార్టీలు… బ్లాక్ మెయిల్… తరువాత కొన్నిరోజులకే మరో కేసులో మరో బెంచ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలను కడిగేసింది… బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడలేదు న్యాయవ్యవస్థ…

Ads

ఈ దేశ హోం మంత్రి అమిత్ షా విచారణకు హాజరయ్యాడు సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో… జగన్ మీద ఇప్పటికీ అక్రమాస్తుల కేసుల విచారణ జరుగుతూనే ఉంది… రాహుల్, సోనియాల మీద నేషనల్ హెరాల్డ్ కేసుంది… ఎవరూ అతీతులు కారు… వీరెవ్వరూ వీరతిలకాలు, బలప్రదర్శనలు, విచారణల్లో మేమే ఉల్టా ప్రశ్నలు వేస్తామనే వ్యాఖ్యానాలకు పోలేదు…

ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే..? కేటీయార్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసు విచారించే సిట్ విచారణకు పిలిచింది… వాళ్లు మమ్మల్ని ప్రశ్నలు అడగడం కాదు, మేమే ప్రశ్నిస్తాం అనేది హరీష్, కేటీయార్ స్పందన… అదేదో రాజుల కాలంలో యుద్ధానికి పోతున్నట్టు వీరతిలకాలు… బలప్రదర్శన… జనసమీకరణ… నిరసనలు, నినాదాలు…

హరీష్ రావు మాటలు ఎలా ఉన్నాయంటే… ‘‘రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టారు… అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవర్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదు….

ఏ పొక్కలో దాక్కున్నా వదలం, సప్తసముద్రాలు దాటిపోయినా ఊరుకోం… అంతకు అంత అనుభవిస్తారు… జాగ్రత్త ఆలోచించుకోండి… రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టం…  మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది…’’

(సప్తసముద్రాలు దాటి దాక్కుని, అక్కడే పౌరసత్వం పొంది తప్పించుకోవాలనుకున్న అంతటి ప్రభాకరరావు కూడా చివరకు చట్టం ఎదుట నిలబడకతప్పలేదు… ఈ సందర్భంగా ఇదీ గుర్తుకుతెచ్చుకోవాలి)…

ఎస్, ఇది విచారణ… కోర్టు గానీ, పోలీసులు గానీ హరీష్‌ను, కేటీయార్‌ను నేరస్థులు అనడం లేదు, నిందితులు లేదా సాక్షులు అనే అంటోంది… విచారణ వాళ్ల విధి… ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ కేసయినా విధినిర్వహణ తప్పదు… దానికి శాపనార్థాలు, బెదిరింపులు ఏమిటి..? పింక్ బుక్‌లో పేర్లు ఎక్కించడం ఏమిటి..?

రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నవాళ్లతో సిట్ అట… ఈ సిట్‌కు నేతృత్వం వహిాంచే సజ్జనార్ మీ పాలనకాలంలో పనిచేయలేదా..? కీలక పోస్టుల్లో లేడా..? శివధర్ రెడ్డితో కీలకమైన ఆపరేషన్లు చేయించుకోలేదా కేసీయార్..? ప్రభుత్వం, చట్టం చెప్పినట్టు చేస్తారు..? చట్టం, న్యాయం, వ్యవస్థలను బెదిరిస్తే ఆగుతాయా..?

పైగా పదే పదే మేమే ప్రశ్నలడుగుతాం, అడుగుతున్నాం అనే బయట ప్రచారాలు దేనికి..? సాక్షాత్తూ నీ ఫోన్, నీ అనుచరగణం ఫోన్లే ట్యాపయ్యాయి తెలుసా అని విచారణలో అడిగితే హరీష్ రావు దగ్గర జవాబే లేదు… చట్టానికి, విచారణకు సహకరిస్తాం, మా తప్పేమీ లేదు అంటున్నప్పుడు… ఈ హడావుడి, హంగామా ఎట్సెట్రా అవసరం లేదుగా… వాళ్లేదో అడుగుతారు, మీరేదో చెబుతారు, అంతేకదా…

అందుకే గుర్తుచేసింది ఒక పీవీని, కార్తీకదీపం తీర్పు చెప్పిన ఓ జడ్జిని… రాజకీయాలు బెదిరిస్తే చట్టాలు, న్యాయం వెనక్కి తగ్గితే ఇక ఒక్క ప్రజాప్రతినిధి కూడా బోనులో నిలవడు, కేసులూ నిలవవు… నో, మేం సిట్‌లో ఉండబోం, కేటీయార్- హరీష్‌ నిర్దోషులు, మేం విచారించలేం అని సదరు పోలీసులు అందులో నుంచి వైదొలగాలా..?! ఏం కోరుకుంటున్నట్టు..?!

చివరగా... సాక్షాత్తూ కేసీయార్ బిడ్డ కవితే చెబుతోంది... నేనూ బాధితురాలినే... నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని... మరి ఆ కేసు తీవ్రత ఏమిటో, బండారం ఏమిటో వ్యవస్థ బయటపెట్టాలి కదా... బండి సంజయ్ విచారణ సందర్భంగా చాలా నిజాలు చెప్పాడు... మరి విచారణ ఓ కొలిక్కి రావాలి కదా... నో, మేం వ్యవస్థలకే అతీతం అంటే ఎలా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేవలం పోలీసులు విచారిస్తున్నారు సారూ… తీర్పు చెప్పడం లేదు…
  • ఆహా… ఏం ప్రేమ కథరా బాబూ..! శిక్షిస్తున్నామా..? దీవిస్తున్నామా..?
  • కొందరిని మరిచిపోలేం… తరచూ గుర్తొస్తుంటారు… కళ్లు చెమ్మగిల్లజేస్తూ…
  • ట్రంపుతో పుతిన్ ఆట… ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై ‘షరతులు వర్తించును’…
  • సూది కోసం సోదికెళ్తే… పాత బొగ్గు బండారాలే బయటపడుతున్నయ్…
  • ఈ భూమితో సంబంధం లేకుండా మనిషి బతకగలడా..? ఓ ప్రయోగనగరం..!!
  • కాంతారావు డెస్టినీ మార్చేసిన సినిమా… ‘స్వాతి చినుకులు’ ముంచేశాయి…
  • ‘‘వందల వీథి కుక్కల్ని చంపేసే ఊళ్లకు తెలుసు… ఆ సమస్య తీవ్రత…’’
  • రెహమాన్ ఆస్కార్ దొంగ..! రియల్ విన్నర్ సుఖ్వీందర్ సింగ్..! ఎలాగంటే..?!
  • అసలైన విజేత శర్వానంద్… పరాజితుడు రవితేజ… ఎందుకనగా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions