.
తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేటీయార్ విమర్శలు మరీ దారితప్పిపోతున్నాయి… తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మీద ఏదో ఒకటి విమర్శించాలనే ధోరణిలో పడి… ప్రతి అంశాన్నీ వివాదం చేయటానికి, సీఎంను తిట్టిపోయడానికి ప్రయత్నిస్తూ… అడుసులో కాలేస్తున్నాడు..!
పర్‌ఫెక్ట్ ఉదాహరణ… యూరియా యాప్… తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది…? రైతులు యూరియా కోసం ఎండలో, చలిలో, వానలో క్యూలలో నిలబడే అవసరం లేకుండా… ఒక సౌకర్యం కోసం, ఒక సౌలభ్యం కోసం ఓ యాప్ తీసుకొస్తోంది…
Ads
అందులో బుక్ చేసుకుంటే, ఆ టైమ్‌కు వెళ్లి షాపు నుంచి యూరియా తెచ్చుకోవచ్చు, ఎక్కడా షాపుల ముందు నిరీక్షించాల్సిన పనిలేదు… ఇది ఆధునిక సాంకేతికత తాలూకు సౌకర్యం… దాన్ని అందుబాటులోకి తెస్తే నిజానికి కేటీయార్, బీఆర్ఎస్ అభినందించాలి… రైతులకు ఉపయోగకరం కాబట్టి…

కానీ కేటీయార్ ఏమంటున్నాడు..? ఎహె, ఇంతకుముందు చెప్పుల వరుసలతో క్యూలు కనిపించేవి, రైతులు అవస్థలు పడేవారు, జనం ప్రభుత్వాన్ని తిట్టేవాళ్లు, అదుగో ఆ తిట్లు తప్పించుకోవడానికి ఇలా యాప్ తీసుకొస్తున్నారు… షాపుల్లో అమ్మరట, యాప్‌లో అమ్ముతారట అని వెటకారం దట్టించాడు…

అంటే… ప్రభుత్వాన్ని తిడుతూ రైతులు ఎండల్లో, బజారుల్లో అవస్థలు పడాల్సిందేనని కేటీయార్ కోరుకుంటున్నాడా..? ఇదేం పెడ ధోరణి..? రైతులకు ఏ సౌకర్యమూ అందకూడదా..? రైతుల మీద మరీ ఈ వివక్ష ఏమిటి..? పైగా షాపుల్లో కాదు, యాపుల్లో అమ్ముతారట అని వ్యంగ్యం… యాప్‌లో బుక్ చేసుకున్నా తెచ్చేది షాపు నుంచే… అసలు యాప్ ఎందుకో కేటీయార్‌కు సరిగ్గా అర్థమైనట్టు లేదు చూడబోతే…

సరే, తన ధోరణి ఎలాగూ చెప్పుకుంటున్నదే… సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని ఓ మాజీ మంత్రి… మరింత ముందుకు పోయాడు… ఇది అసలు రైతులపై కక్ష అట, కౌలు రైతులపై కక్ష అట… ఎందుకయ్యా అంటే… రైతులకు ఈ విధానం ఏం తెలుసు..? దళారులు ప్రవేశిస్తారు..? అసలు కౌలు రైతులకు యూరియా దొరకదు అని ఏదో చెప్పుకొచ్చాడు…

అయ్యా, మంత్రివర్యా… అసలు కౌలు రైతులను గుర్తించకుండా ద్రోహం చేసిందే కేసీయార్… బీమా, పెట్టుబడిసాయం, సర్కారీ కొనుగోళ్లు సహా ఏ అంశంలోనూ అసలు వాళ్లను రైతులుగానే గుర్తించక, వీసమెత్తు ప్రయోజనం కూడా లేకుండా చేసింది కేసీయార్… అవన్నీ మరిచిపోతే ఎలా మాజీ మంత్రి గారూ…

మరిన్ని నిజాల్లోకి వెళ్దాం… రేవంత్ రెడ్డి ఎంతగా కేంద్రంతో ఘర్షణ జోలికి పోకుండా… రాష్ట్ర ప్రయోజనాల కోసం సామరస్య, సానుకూల ధోరణిలో పోతున్నా సరే…. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనతోనే కేంద్ర ప్రభుత్వం చాలా అంశాల్లో తెలంగాణకు నష్టం చేస్తోంది… సరిపడా యూరియా ఇవ్వకపోవడం కూడా అందులో ఒకటి… రామగుండం ప్లాంటు ఉత్పత్తిలో 70 శాతం తెలంగాణకే ఇవ్వాలనే ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా ఖాతరు చేయడం లేదు…

తమ ప్రభుత్వం ఉన్న ఏపీతో పోల్చినా ఇదే స్పష్టంగా కనిపిస్తుంది… నిజానికి నత్రజని వాడకం తగ్గించాలనీ, నానో యూరియాను ప్రమోట్ చేయాలని కేంద్ర ప్రభుత్వ విధానాల్లోనూ కొత్త దిశ కనిపిస్తోంది… కానీ తమ రాష్ట్రాల్లో గాకుండా తెలంగాణ వంటి కాంగ్రెస్ రాష్ట్రాలపైనే హఠాత్తుగా రుద్దడం, మెల్లిమెల్లిగా రైతుల్ని మార్చే ప్రయత్నాలు లేకపోవడం, అవగాహన పెంచే కార్యాచరణ లేకపోవడం కేంద్రం నుంచి ఓ మైనస్ పాయింట్…

సో, రేవంత్ రెడ్డి ఏం చేయాలి..? అదనపు కోటా, సరిపడా కోటా కోసం కొట్లాడుతూనే…. కేంద్రం అలాట్ చేసిన మేరకు రైతులందరికీ సర్దుబాటు చేయాల్సిన బాధ్యత… వీథుల్లో క్యూలు కట్టకుండా ఓ సౌకర్యాన్ని క్రియేట్ చేసింది ప్రభుత్వం… ఐనా సరే…
ప్రభుత్వాన్ని తిట్టడం కోసమైనా సరే, రైతులు ఎండావానల్లో, చలిలో బజార్లలో షాపుల ఎదుట నిలబడాల్సిందే, మీ చావు మీరు చావండి అంటున్నాడు కేటీయార్... రైతులకు మంచి జరిగినా సహించలేవా..? దీన్ని రాజకీయం అనరు, శాడిజం అంటారు కేటీయారూ..!!

బీఆర్ఎస్ మైక్ నమస్తే అయితే మరీ చోద్యం… ఫోన్ లేకపోతే యూరియా ఇవ్వరా..? అసలు ఇదంతా పంపిణీలో కోతకు రేవంత్ ఎత్తుగడ, పంట వేసినట్టు నిరూపిస్తేనే యూరియా బస్తా ఇస్తారట, ఇంటికి పంపిస్తారట అని ఏవేవో రాసుకొచ్చింది… ఇంకా నయం, తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణాన్ని తగ్గించే కుట్ర అని రాయలేదు… ఇంటికే పంపుతారట అనే వ్యంగ్యం దేనికి..? ఇస్తే, పంపిస్తే తప్పేమిటోయ్..!! ఓర్వలేవా..!!
Share this Article