ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్ :: సినిమా గనుక బాగుంటే ఎవరు ఎన్ని బాయ్‌కాట్ పిలుపులు ఇచ్చినా సరే, సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపించినా సరే, ప్రేక్షకుడు పట్టించుకోడు… సినిమాను చూస్తాడు… సినిమా బాగాలేకపోతే చిరంజీవి, నాగార్జునలు కాదు కదా, బాలీవుడ్ ప్రముఖులంతా కట్టకట్టుకుని డప్పులు కొట్టినా సరే ఆ సినిమా బతికి బట్టకట్టదు… తన్నేస్తుంది…
లాల్‌సింగ్‌చద్దా మీద అందరి ఆసక్తి కేంద్రీకృతం కావడానికి రెండురకాల కారణాలు… ఒకటి) ప్రొఫెషనల్… రెండు) సినిమాయేతరం… మెల్లిగా ఎక్కడో మొదలైంది… హీరో ఆమీర్ ఖాన్ హిందూ ద్వేషి కాబట్టి సినిమాను బహిష్కరించాలి అని… నిజానికి ఇలాంటి వివాదాలు, పిలుపులు కొత్తేమీ కాదు, అవి సినిమా జయాపజయాల్ని పెద్దగా ప్రభావితం చేయలేవు… కానీ ఆమీర్ ఖానే స్వయంగా ‘‘నేను దేశభక్తుడినే, నా సినిమాను దయచేసి చూడండి, బహిష్కరించండి’’ అని చెబుతూ ఒకరకంగా తనే సినిమా బాయ్‌కాట్ పిలుపు మీద ఓవర్ రియాక్టయ్యాడు…
వార్ మెమోరియల్స్ దగ్గరకు వెళ్లాడు… దేశభక్తుడిగా కనిపించడానికి నానాపాట్లూ పడ్డాడు… తనకు తెలుసు, సినిమా అనుకున్నంత క్వాలిటీతో రాలేదని… పైగా హిందూ సెక్షన్ బాయ్‌కాట్ పిలుపులు… పీకూ సినిమాలో ఆమీర్ ఖాన్ హిందూ వ్యతిరేక ఎపిసోడ్లు ఏం చేశాడనే పాయింట్ దగ్గర ఆగలేదు… తను ఉగ్రవాద సపోర్టర్లతో భేటీ అయ్యాడనీ, అబద్ధపు వసూళ్లు చూపి చైనా నుంచి డబ్బు సమీకరిస్తాడనే దాకా తన మీద నెెగెటివ్ క్యాంపెయిన్ సాగింది… అప్పట్లో పెళ్లాన్ని ముందుపెట్టి, ఈ దేశం విడిచివెళ్లిపోవాలా అనే వ్యాఖ్యలూ చేశాడు తను…
Ads
దీనికితోడు హీరోయిన్ కరీనాఖాన్ కొడుకులకు పెట్టుకున్న హిందూద్వేషుల పేర్లు… సినిమా బాగాలేకపోతే ఎవడు చూడమన్నాడు అంటూ గతంలో చేసిన వీడియో బిట్లను ప్రచారంలోకి తీసుకొచ్చారు… పాతవి మరిచిపోవడం నేర్చుకోవాలని అని ఆమె కొత్తగా నీతులు చెప్పడం కూడా రాంగ్ స్టెప్… సినిమా రచయిత అతుల్ కులకర్ణి మీద కూడా ఇలాంటి విమర్శలున్నాయి… తను కూడా నేను హిందువునే, మరాఠీ బ్రాహ్మణుడిని అని చెప్పడం మరో దిద్దుబాటులా కనిపించే తత్తరపాటు, త్వరపాటు… ఇదంతా సినిమా మీద ఓరకమైన వ్యతిరేకతను పెంచడానికే ఉపయోగపడింది…
ఐనాసరే, సినిమా గనుక బాగుంటే ఇవన్నీ కొట్టుకుపోయేవి… ప్రేక్షకుడు తూచ్ అని కొట్టేసేవాడు… అసలే ఇప్పుడు హిందీ సినిమాలన్నీ థియేటర్లలో తన్నేస్తున్న దుర్దినాలు… అజయ్, కంగనా, అక్షయ్‌లే కాదు, ఆమీర్‌ఖాన్ అయినా అంతేకదా… ఇక సినిమా సంబంధ విషయాల్లోకి వస్తే… అప్పుడెప్పుడో 1994లో ఇంగ్లిషులో వచ్చిన సినిమా ఫారెస్ట్ గంప్… అప్పట్లో పలు ఆస్కార్ అవార్డులతో కలకలం క్రియేట్ చేసింది… మాస్టర్ పీస్… రీమేక్ హక్కులు తీసుకున్నా సరే, దాన్నలాగే తీయలేం కదా… అదసలే సినిమా బ్యాక్‌డ్రాప్‌లో చెప్పబడిన అమెరికావోడి చరిత్ర… సో, దాన్ని ఇండియనీకరించాలి…
ఓ పిల్లాడు… జన్మతః కొన్ని దైహిక బలహీనతలుంటయ్… సరిగ్గా నడవలేడు, వెన్నెముక బలంగా ఉండదు, ఐక్యూ తక్కువ… ఐనాసరే, క్లాస్‌మేట్ సహకారంతో పరుగులు తీస్తాడు, సైన్యంలో చేరతాడు, వ్యాపారం చేస్తాడు… కథ అలా అలా సాగిపోతుంటుంది… ఎక్కడా సరైన ఎగ్జైట్‌మెంట్ అనిపించదు ప్రేక్షకుడికి… ఈ కథను 14 ఏళ్లుగా చెక్కుతున్నాడట అతుల్ కులకర్ణి…!! అంత ఇంప్రెసివ్ మార్పులేమీ లేవు… సరికదా దర్శకుడు అద్వైత్ చందన్ ఫస్టాఫ్ కాస్త ఎంటర్‌టెయినింగ్‌గా తీయగలిగినా, సెకండాఫ్‌కు వచ్చేసరికి మరీ తెలుగు టీవీ సీరియల్ చేసేశాడు…
ఆమీర్‌ఖాన్ పర్‌ఫెక్షనిస్ట్ అంటారు గానీ ఇందులో అంత పెద్ద మెరిట్ ఏమీ కనిపించదు… తన నటనలో మొనాటనీ వచ్చేస్తోంది… కరీనాఖాన్ పాత్రకు పెద్ద స్కోప్ లేదు… ఒకరకంగా సినిమా ద్వారా నాగచైతన్య, తల్లిగా చేసిన మోనాసింగ్ కాస్త వెలుగులోకి వస్తారు… నాగ్ అప్పుడప్పుడూ సరదాగా హిందీ సినిమాల్లో నటిస్తుంటాడు… అంతేతప్ప తను హిందీలో సీరియస్ హీరో కాదు… చైతూకు కూడా ఈమేరకు ఈ సినిమా ఉపయోగపడుతుంది… హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసేంతవరకు..!!
సినిమా నిడివి ఒరిజినల్ సినిమాకన్నా 22 నిమిషాలు ఎక్కువ… అసలే సినిమా విసిగిస్తూ ఉంటూ, నిడివి కూడా ఎక్కువయ్యేసరికి ఒకదశలో ప్రేక్షకుడికి నీరసం పెరిగిపోతుంది… పాటలు కూడా సోసో… ఎయిటీస్ వాతావరణం సరిగ్గా re-create చేయలేదు… ఈ సినిమాకు తెలుగులో సమర్పకుడు చిరంజీవి… తను అసలు ప్రివ్యూ చూశాడా..? ఇదీ తన ఆచార్య తరహాయే అని గ్రహించలేకపోయాడా..? ప్చ్, పాదఘట్టం… ఏతావాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే… బాయ్‌కాట్ లొల్లి దాకా దేనికి..? దర్శకుడు, హీరో, కథకుడు వాళ్లే చంపేసుకున్నారుగా…!! చివరగా :: హీరో టెర్రరిస్టును కాపాడుతాడు అట… వాడు సాధు జీవి అయిపోతాడు అట… ఏ లోకంలో ఉన్నావు కులకర్ణి…!?
Share this Article