చూశారా, చూశారా… కేరళ మంత్రివర్గంలో 13 మంది కోటీశ్వరులున్నారు తెలుసా..? ఇవిగో వివరాలు, ఎవరికెంత ఆస్తి ఉందో చెప్పేస్తున్నాం… అన్నట్టుగా ఓ స్టోరీ ఏదో ఇంగ్లిషు పత్రికలో వచ్చింది… దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో చాలామంది ఎర్రన్నలు కూడా కోటీశ్వరులే సుమీ అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు… అందులో వెక్కిరింపు, విమర్శ, ఆశ్చర్యం గట్రా కనిపిస్తున్నయ్… కానీ బేసిక్‌గా ఈ స్టోరీ విషయంలోనే మనకు కొన్ని అభ్యంతరాలు ఉండాలి… ఇదేమీ ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ ఏమీ కాదు… అందరూ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఉన్న వివరాలే ఇవన్నీ… దాపరికాలు లేవు, రహస్య ఆస్తులేమీ కావు… లీగల్, వైట్ ప్రాపర్టీ… (పార్టీ కార్యదర్శి భార్యకు మంత్రి పదవి, ముఖ్యమంత్రి అల్లుడికి కట్నంగా మంత్రి పదవి అనే విమర్శలు వేరు.., బంధుప్రీతికి సీపీఎం సిద్ధాంతపరంగా సమాధానం చెప్పుకోవాలి, చెబుతుందా లేదా అనేది వేరే కథ)… కానీ ఈ ఆస్తుల విషయానికొస్తే…
- లెఫ్టిస్టులుగా ఉంటే కోటీశ్వరులు కావొద్దా..? 2. కోటీశ్వరులు లెఫ్ట్ భావజాలంతో ఉండకూడదా..? 3. లెఫ్ట్ సభ్యత్వానికి ఆస్తి పరిమితి ఏమైనా ఉందా..? 4. ఇంతకుమించిన ఆస్తి ఉంటే పార్టీకి అప్పగించేయాలని ఏమైనా నిబంధన ఉందా లెఫ్ట్ రాజ్యాంగంలో..? 5. కోటీరెండు కోట్లు ఉంటే ఇక అది అన్యాయపు ఆస్తిగానే చూడాలా..? సో, బేసిక్‌గా ఈ ఆస్తుల వివరాలను ఈ కథనం చూసిన కోణమే తప్పు అనిపిస్తుంది… ఓ ఉదాహరణ చెప్పుకుందాం… ముఖ్యమంత్రి పినరయి విజయన్ బిడ్డ పేరు వీణ విజయన్… ఆమె మొదటి పెళ్లి ఫెయిలైంది… తనలాగే ఒంటరిగా ఉన్న రియాజ్‌ను పెళ్లిచేసుకుంది… ఇప్పుడు రియాజ్ మంత్రి, తన ఆస్తి 1.86 కోట్లుగా చూపించాడు… వీణ సొంతంగా బెంగుళూరులో ఓ సాఫ్ట్వేర్ స్టార్టప్ పెట్టుకుంది… ఆమె ప్రొఫెషనల్, ఆమె ఓ కంపెనీ ఓనర్… అయితేనేం..? భర్త లెఫ్ట్ ఆచరణకు అదేమైనా నిషిద్ధమా..? అది ఆమె వృత్తి… అందులో లాభాలు వస్తే గర్వంగానే చెప్పుకుంటుంది, తప్పేముంది..? సో, రియాజ్ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆస్తి వివరాలను తప్పుగా చూడాల్సిన అవసరం ఏముంది..?
ఒక వ్యక్తికి పూర్వీకుల నుంచి కొంత ఆస్తి వచ్చింది, మార్కెట్ వాల్యూ పెరిగింది… అవును, కోట్లకు పెరిగింది… సో వాట్..? అదేమీ అక్రమ సంపాదన కాదు కదా… ఆ ఆస్తిని చూసి, వాళ్ల వ్యక్తిత్వాలను అంచనా వేయలేం కదా… మరో ఉదాహరణ… శైలజ స్థానంలో కొత్తగా ఆరోగ్య మంత్రిగా ప్రమాణం చేసిన వీణా జార్జి ఒకప్పుడు జర్నలిస్టు… ఆ కొలువు వదిలేశాక రాజకీయాల్లోకి వచ్చింది, భర్త టీచర్… ఇద్దరికీ కలిపి కొంత ఆస్తి ఉంది… ఆ వివరాలే చెప్పుకుంది ఆమె… పార్టీ కార్యదర్శి భార్య బిందు ఆస్తి 1.22 కోట్లు… మంచి కమర్షియల్ ప్లేసుల్లో గనుక కాస్త భూమి ఉన్నా, ఇల్లు ఉన్నా ఈ కోటి ఈరోజుల్లో మరీ అంత విశేషంగా చూడాల్సినంత అంకె మాత్రం కాదు… ముఖ్యమంత్రి ఆస్తి 1.18 కోట్లు… ఐనా కాంగ్రెస్, ఇతర పార్టీల నేతల ఆస్తులతో పోలిస్తే ఇవి ఎంత..? లెక్కలోకి వచ్చేవేనా..? వ్యక్తిగత ఆస్తులు, సంపాదనలకు సంబంధించి కాస్త పార్టీ నిఘా, కంట్రోల్ ఉన్న పార్టీ సీపీఎం ఒక్కటే… అఫ్ కోర్స్, చాలాచోట్ల చాలామంది లెఫ్టిస్టులు కూడా దారితప్పి ఉండవచ్చుగాక… ఐనా ఇతర పార్టీలతో పోలిస్తే బెటరే… బెటరే…!!
Ads
Share this Article