ఎక్కడో ఇంట్రస్టింగ్‌గా అనిపించే ఓ వార్త తారసపడింది… మొన్నామధ్య శ్రీమంతుడు సినిమా కథ నాదేనని కోర్టుకెక్కిన శరత్ చంద్ర అనే రచయిత ఈ వ్యాజ్యంలో గెలిచాడు కదా, అది ఇంకా సెటిల్ కాలేదు, ఎలా సెటిల్ చేసుకుంటారనేది దర్శక నిర్మాతల ప్రయాస, దాన్నలా వదిలేస్తే…
అదే రచయత ఇప్పుడు మరో సినిమాను కూడా ఇలాగే గెలికే ప్రయత్నం చేస్తున్నాడు… అదీ మహేశ్ బాబు సినిమాయే… పేరు మహర్షి… శ్రీమంతుడు సినిమాకథలాగే మహర్షి కూడా రొటీన్ ఫార్మాట్‌లో గాకుండా కొంత డిఫరెంటుగా ఉంటుంది… సినిమా హిట్టు కూడా… ఇప్పుడు శ్రీమంతుడు కేసు సెటిల్ కాగానే మహర్షి మీద లీగల్ యాక్షన్ స్టార్ట్ చేస్తాను అంటున్నాడు సదరు రచయిత…
Ads
శ్రీమంతుడు సినిమా కథకు ఒరిజినల్ ఏమిటో, తను రాసిన నవల పేరు ఏమిటో, ఎక్కడ పబ్లిషయిందో చెప్పాడు… రచయితల సంఘం కూడా తమ దగ్గర రిజిష్టరై ఉంది కాబట్టి సపోర్ట్ చేసింది… బట్ మహర్షి సినిమా కథకు ఒరిజినల్ ఏమిటో శరత్ చంద్ర చెప్పలేదు… అది సంఘం దగ్గర రిజిష్టర్ అయ్యిందో లేదో కూడా చెప్పలేదు… ఒకటి గెలిచాను, ఇంకొకటి గెలికాను అన్నట్టున్న ఆ వార్త ఇంట్రస్టింగు అనిపించింది… రిజల్ట్ మీద ఊహాగానాలు ఇక్కడ అనవసరం…
అసలు ఇదేకాదు, సినిమా కథలు, పాటల మీద వివాదాలు, విమర్శలు, కేసులు కొత్తమీ కాదు గానీ ఈమధ్య కొంత పెరుగుతున్నట్టు కనిపిస్తోంది… అప్పట్లో ఏం పిల్లడో ఎల్దమొస్తవా అనే పల్లవిని ఏదో మెగా రాంచరణ్ సినిమా పాటలో వాడుకుంటే వంగపండు రచ్చ చేశాడు… ఇప్పుడు ఏదో కొత్త సినిమాలో ఏరువాకా సాగారో అనే రెండు పాత పాట వాక్యాల్ని యథాతథంగా వాడేసుకున్నారు… ఆమధ్య కాంతార సినిమా పాట వరాహరూపం మీద ఓ కేసు ఆసక్తికరంగా సాగింది… వ్యాజ్యం వేసిన వాళ్లే గెలిచారు… అది ట్యూన్ గొడవ, కంటెంట్ ఇష్యూ కాదు…
తాజాగా మరో కేసు… ఇదీ రేపు రిలీజ్ కాబోయే ఊరు పేరు బైరవకోన సినిమా గురించి… హీరో సందీప్ కిషన్ నటించాడు… ఈ సినిమా విడుదల ఆపాలని, స్టే ఇవ్వాలని (అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా తరహాలో) హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) కేసు వేశాడు… అడ్వంచర్స్ ఇంటర్నేషనల్, ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారనేది తన దావా… కేసు 12కు వాయిదా పడి, సినిమా రిలీజుకు ప్రస్తుతానికి అడ్డంకులు లేనట్టేనని భావిస్తున్నారు…
ఇది కథ, పాటలకు సంబంధించిన కేసు కాదు, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారానికి సంబంధించిన కేసు… ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు, వ్యాపారంతో లింక్ ఉన్నట్టుంది… 30 కోట్ల కేసు… సరే, ఆ కేసు మెరిట్స్, డీమెరిట్స్ జోలికి ఇక్కడ పోవడం లేదు… వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన కేసులు కూడా క్రమేపీ పెరుగుతున్నట్టు అనిపిస్తోంది అని చెప్పడం వరకే ఈ కేసు ప్రస్తావన…
మరొకటి మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమాకు సంబంధించి… ఇది కథ, పాటలు, వ్యాపారానికి సంబంధించిన కేసు కాదు… ఇది మనోభావాలకు సంబంధించి… కేరళ హైకోర్టులో పడింది కేసు… కుంజమాన్ పొట్టి అనే ఇంటిపేరును ఈ సినిమాలో వాడారనీ, ఆ పేరు గల వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తుంటారనీ, శతాబ్దాలుగా పౌరోహిత్యం చేసుకునే ఈ ఇంటిపేరున్న అర్చకులకు ఈ చిత్రీకరణ చెడ్డపేరు తీసుకొస్తుందనీ వాదన…
పైగా మమ్ముట్టి ఇమేజీ దృష్ట్యా జనంలో తమ పట్ల నెగెటివిటీని పెంచుతుందని దావా… సెన్సార్ సర్టిఫికెట్ వాపస్ తీసుకోవాలని వ్యాజ్యం… దీంతో సినిమాలో మమ్ముట్టి పాత్ర పేరును మార్చేశారని ఓ వార్త కనిపించింది… రిలీజుకు అడ్డంకులేమీ లేకపోయినా తెలుగులో మాత్రం ఇప్పుడే రిలీజ్ చేయడం లేదని మరో వార్త… ఇంకా వివరాలు తెలియాలి…
ఏతావాతా చెప్పేది ఏమిటంటే… కథ, పాటలు, ట్యూన్లు, డిస్ట్రిబ్యూషన్ హక్కులు, వ్యాపార ఒప్పందాలు, సర్టెన్ గ్రూపుల మనోభావాలు… కాదేదీ సినిమాలపై కేసులకు అనర్హం అన్నట్టుగా న్యాయస్థానాలకు లాగబడుతున్నాయి… ఇవి ఇంకా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి… కోర్టు బయట పరిష్కారాలకు ఇండస్ట్రీలో సరైన ‘పెద్ద మనుషుల వ్యవస్థ’ లేకపోవడం ఓ ప్రధాన కారణం కావచ్చు… ఇక అదంతా వేరే డిబేట్…
అంతేకాదు, పార్టీలను, నాయకులను బదనాం చేసేవి, భజన చేసేవి, పొలిటికల్ ఫాయిదా కోసం తీసే సినిమాల చిక్కులు మరో చర్చ… ఆర్జీవీ జగన్ మీద తీసిన వ్యూహం, శపథం, అమరావతి రాజధాని భూములపై తీసిన రాజధాని ఫైల్స్ వంటి సినిమాల వివాదాలు మరో చాప్టర్… అవీ చెప్పుకుందాం… విడిగా…
Share this Article