అది ఏ పండుగ గానీ… అసలు పండుగలతో సంబంధం లేని రిలీజు గానీ… మార్కెట్‌లోకి బాలయ్య సినిమా వస్తుందంటే, దానికి పోటీగా రావాలంటే ఏ చిరంజీవో, లేక ఇంకెవరో స్టార్ హీరో సినిమాయో ఐఉండాలి… లేకపోతే బాలయ్య బాపతు మాస్ పోటీని తట్టుకోవడం కష్టం… అలాంటిది అసలు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ లేని హీరో విజయ్ సినిమా లియో ఏకంగా బాలయ్య సినిమాకు దీటుగా దసరా పోటీకి వచ్చిందంటే ఆశ్చర్యమే… పైగా బాలయ్య సినిమాకన్నా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారట…
సరే, అదంతా సినిమా మార్కెట్, బిజినెస్ ఇష్యూస్… ఈ సినిమా మీద ఇంత హైప్ క్రియేటయ్యిందంటే కారణం హీరో విజయ్ కొంతవరకే కారణం… అసలు కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్… తను ఇప్పుడు తమిళ మార్కెట్‌లో బాగా దూకుడు మీదున్న దర్శకుడు… కమర్షియల్ సినిమాల మేకింగులో..! పైగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లోని గత సినిమాలు బాగా వసూళ్లను రాబట్టాయి… అందుకే ఈ ఆసక్తి సినిమా మీద…
కానీ మొదటి నుంచీ పలు వివాదాలు… అసలు సమయానికి రిలీజవుతుందా అనే సందేహాలు… సినిమా ది హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ కాపీ అని వార్తలు రావడం… ట్రెయిలర్‌కు పెద్దగా ఆదరణ రాకపోవడం గట్రా చిత్రానికి మైనస్ అవుతుందనుకున్నారు… సినిమా రిలీజయ్యాక కూడా కొద్ది గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు పైరసీదార్లు… సరే, సినిమా విషయానికి వస్తే లోకేష్ దర్శకత్వంతోపాటు ఈమధ్య జైలర్ సినిమాకు ఓ రేంజులో సంగీత దర్శకత్వం చేసిన అనిరుధ్ ఈ సినిమాకు కూడా కంపోజర్…
Ads
ప్రస్తుతం దేశం మొత్తమ్మీద అనిరుధ్ డిమాండ్ అంతా ఇంతా కాదు… కానీ ఈ సినిమాకు సంబంధించి బీజీఎం ఓ మోస్తరుగా ఉంది… పాటల గురించి ప్రస్తావనే అవసరం లేదు… సినిమా ఫస్టాఫ్ మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన దర్శకుడు సెకండాఫ్‌లో ఆ టెంపో సస్టెయిన్ చేయలేదు… ప్రత్యేకించి ఫ్లాష్ బ్యాక్ పెద్దగా ఇంప్రెసివ్‌గా లేదు… సంజయ్ దత్ వచ్చాక కథలో మరింత గందరగోళం, ఒక దశలో దర్శకుడు ఇక హ్యాండిల్ చేయలేక చేతులెత్తేశాడు…
ఎస్, ఇది ఆ ఇంగ్లిష్ చిత్రమ్మీద ఆధారపడే తీశానని దర్శకుడు తెర మీదే క్లారిటీ ఇచ్చాడు కాబట్టి దానిపై వివాదం లేదు… కథ కూడా పెద్ద గొప్పదేమీ కాదు… ఎక్కడికో వెళ్లి గోప్యంగా బతకడం, ఐనా ఐడెంటిటీ బయటపడటం వంటివి చాలాసార్లు చూశాం… కానీ లోకేష్ మార్క్ టేకింగు ఈ సినిమాకు బలం… పైగా తమిళ సినిమాల్లో సర్వసాధారణంగా కనిపించే ఇంట్రో సాంగులు లేవు, బలమైన ఇంట్రో సీన్లు కూడా లేవు… కావాలని కామెడీని అతికించలేదు… ఐటం సాంగ్స్ గట్రా ఇరికించలేదు… స్ట్రెయిట్‌గా కథ సాగుతూ ఉంటుంది… ఎక్కడా పక్కదోవ పట్టదు… కథను బట్టి యాక్షన్ సీన్లున్నాయి…
సినిమా ఓ మోస్తరుగా రావడానికి విజయ్ కూడా ఓ కారణం… పలుచోట్ల బాగా చేశాడు… త్రిష పాత్రకు పెద్ద ప్రయారిటీ ఏమీ లేదు… సోసో… సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి… ఐతే బాలయ్య సినిమాకు పోటీగా వచ్చాడు కదా, ఆ రేంజులో నిలబడతాడా..? ఏమో, దొందూ దొందే… నేలకొండ భగవంతుడు కూడా అంత గొప్పగా ఏమీ లేడు కదా… కాకపోతే కేసరిలో శ్రీలీల ఉంది… ఈ లియో సినిమాలో అలాంటి అట్రాక్షన్ కూడా ఏమీ లేదు… అంతే తేడా…
Share this Article