ఏదో ఓ చర్చ ఎక్కడో మొదలవుతుంది… అది తరువాత ఎటెటో వెళ్లిపోతుంది… ప్రధాన చర్చలోనే కొన్ని ఉపచర్చలు కూడా పుట్టుకొస్తయ్… అవి నిజానికి ప్రధాన చర్చకన్నా ఇంట్రస్టింగుగా ఉంటయ్, అవసరమైనవి కూడా…! తెలుగునాట కొన్నాళ్లు ఆనందయ్య మందు ఓ చర్చ… అది అల్లోపతీకి దేశీయ వైద్యానికీ నడుమ పోరాటంగా మార్చారు కొందరు… ఏది శాస్త్రీయం, ఏది అశాస్త్రీయం అంటూ సోషల్ మీడియా నిండా ఒకటే చర్చ… మధ్యలో ఓ కెమికల్ ఇంజనీర్ (పరుచూరి మల్లిక్..?) కొన్ని చిట్కాలు చెప్పసాగాడు… ఎవరుపడితేవాళ్లు మెడికల్ ప్రొసీజర్ల మీద మాట్లాడటం ఏమిటంటూ మళ్లీ ఓ రచ్చ… సదరు ఇంజినీర్ ఏదో వీడియోలో ‘‘ఇన్సులిన్ లేదా మెటామార్ఫిన్ మాత్రలతో సుగర్ తగ్గడం లేదా..? అయితే ట్రెమడాల్ 100 ఎంజీ వేసుకుని చూడండి’’ అన్నాడు… కొత్త విషయమే… ఐతే ట్రెమడాల్ మందుకు కావల్సిన రా మెటీరియల్ గంజాయి నుంచి వస్తుందని చెప్పడం దగ్గర కొందరు డాక్టర్లు పట్టేసుకున్నారు… విరించి విరివింటి, చంద్రశేఖర్ నంబూరి అసలు గంజాయి నుంచి వచ్చే డ్రగ్స్ ఏమిటో, ఓపియం నుంచి వచ్చే డ్రగ్స్ ఏమిటో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇస్తున్నారు… అందులో కొన్ని అంశాల్ని మనం ఇప్పుడు తీసుకుందాం… ఆ చర్చ నిజానికి జరగాల్సిన అవసరముంది కాబట్టి…
ముందుగా ముఖ్యాంశాలు…
Ads
- గంజాయి నుంచి వచ్చేవి కెన్నాబినాయిడ్స్, ఓపియం (నల్లమందు, గసగసాల జాతి) నుంచి వచ్చేవి ఓపియాయిడ్స్
- ఓపియం నుంచి హెరియాన్, కోడిన్, పెపావరిన్, నార్కొటిన్, మార్ఫిన్ వంటి నేచురల్ ఓపియాయిడ్స్ తయారు చేస్తారు.., డ్రగ్స్… ఇది ఓ పెద్ద దందా… కానీ ట్రమడాల్, ఫెండానిల్ వంటి మెడిసిన్స్ సింథటిక్ ఓపియాయిడ్స్…
- గుండె, ఊపిరితిత్తులను అదుపులో ఉంచే మిడ్ బ్రెయిన్ ప్రాంతాన్ని ఒపియాయిడ్స్ ప్రభావితం చేస్తే… మన ఎమోషన్స్ ని ఆలోచనల్ని అదుపులో ఉంచే హిప్పోకాంపస్ హైపోథలామస్ లింబిక్ సిస్టం మీద కెన్నాబినాయిడ్స్ ప్రభావం చూపుతాయి…
చాలా దేశాలు గంజాయి మీద నిషేధాన్ని తొలగిస్తున్నయ్… WHO 2019లో చేసిన రికమండేషన్లను దృష్టిలో ఉంచుకుని, నార్కోటిక్ మందులపై ఏర్పడిన ఐక్యరాజ్యసమితి కమీషన్ గంజాయిని ఈమధ్యే “డేంజర్ మందుల” లిస్టు నుండి తొలగించింది… దానికి ఇండియా కూడా ఆమోదం తెలిపింది… ఎందుకంటే..?
- గంజాయిలో దాదాపు 80 రకాల కెన్నాబినాయడ్స్ కలిగి ఉంటయ్… అందులో టెట్రాహైడ్రో కెన్నాబినాయిడ్ (THC) అనే కెమికల్ తప్ప మొక్కలోని ప్రతీ ఇతర కెమికల్ ఒక అద్భుతమైన మందుగా పని చేయబోతోందని కనుగొన్నారు…
- ముఖ్యంగా కెన్నాబిడియోల్ (CBD) ఎన్నో వ్యాధులకు మందుగా పనిచేస్తుందని తెలుస్తోంది… ఇంకా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి… కాన్సర్ జబ్బులను కూడా తగ్గించే అద్భుతమైన మందులు గంజాయి మొక్కలో కెన్నాబినాయిడ్స్ రూపంలో ఉంటాయి… వాటిని బయటకు తీయడానికి వాటిపై పరిశోధనలు చేయడానికి ఇంతకాలం గంజాయి ని డేంజర్ మందుల లిస్టులో ఉంచడం వల్ల (1961 నుండి) సాధ్యపడలేదు…
- ప్రాణాల్ని హరించే విషయంలో ఒపియాయిడ్ మందులకంటే గంజాయి చాలా బెటర్… అంటే గంజాయి harmless narcotic అన్నమాట… ఇల్లిసిట్ డ్రగ్స్‌కు బానిసలౌతున్న యువతకు గంజాయి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ మందు ఔతుంది…
ఇదీ సదరు సోషల్ మీడియా కంటెంటులోని సారాంశం… నిజం… ఎవడో ఎక్కడో ఏ స్వార్థం కోసమో అనవసరంగా గంజాయి మీద నిషేధం పెట్టించాడు… (అమెరికాలోనే..? అదో పెద్ద కథ..)… తరువాత ప్రతి దేశమూ గుడ్డిగా అనుసరించింది… ఫలితంగా అద్భుతమైన వైద్యానికి ఉపయోగపడగల పరిశోధనలు ఆగిపోయాయ్… ఒక ఓషధిని భూతంగా చూస్తున్నాం… ఈ అరవై ఏళ్లలో దేశవ్యాప్తంగా లక్షల కేసులు పెట్టారు, జైళ్లలో పడేశారు… కానీ గంజాయిలోని అసలైన మెడిసిన్స్ కనుక్కుని, ట్రయల్స్ వేసి, చికిత్సల్లో వాడుకునే దిశలో ఒక్క అడుగు కూడా వేయలేకపోయాం… ప్రపంచమంతా ఇంతే… ఎస్, గంజాయి అంటే కేవలం పొగ, భంగు మాత్రమే కాదు… గంజాయి అంటే ఔషధం… ఇకనైనా పాలకులకు సద్బుద్ధి ప్రాప్తిరస్తు…!! అఫ్ కోర్స్, ఏం మాట్లాడతాడో తనకే తెలియన మన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ వల్ల గానీ, డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించని మన డ్రగ్ కంట్రోల్ విభాగాల వల్ల గానీ ఏమీ జరగదు… మోడీవర్యుడు కొత్త మంత్రిని ప్రసాదిస్తే, అప్పుడేమైనా జరగొచ్చు…!!
Share this Article