“రామారావు ఆన్ డ్యూటీ” దర్శకుడు శరత్ మండవ గారికి… అయ్యా, మీరు తీసిన ఈ సినిమాలో హీరోను ఓ చోట డిప్యూటీ కలెక్టర్, మరో చోట స్పెషల్ కలెక్టర్, ఇంకో చోట సబ్ కలెక్టర్ అని పలికించారు. ఫైనల్‌గా అతని టేబుల్ మీద Deputy collector (mandala revenue officer MRO) FAC అని రాయించారు. బిత్తిరి సత్తికి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా డిప్యూటీ కలెక్టర్ ఎమ్మార్వోగా ఉండవచ్చని చెప్పారు. ఒకసారి తేడాలు చూద్దాం రండి…
1. డిప్యూటీ కలెక్టర్ :- గ్రూప్-1 ద్వారా నేరుగా డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు. గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహసిల్దార్‌గా ఎంపికై, ప్రమోషన్ మీద కూడా డిప్యూటీ కలెక్టర్ అవచ్చు. మాతృశాఖ రెవెన్యూ కాబట్టి, ఏదైనా ఒక రెవెన్యూ సబ్ డివిజన్‌లో ఆర్డీవోగా కూర్చుంటారు. ఆర్డీవో అవకాశం దక్కకుంటే డిప్యూటేషన్ మీద మరో శాఖకు వెళ్లి సమాన హోదా పొందుతారు.
2. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ :- డిప్యూటీ కలెక్టర్‌గా కనీసం ఆరేళ్లు పనిచేసిన తర్వాత ఈ హోదా దక్కుతుంది. ఈ హోదా వచ్చిన తర్వాత జిల్లా రెవెన్యూ అధికారి (డిఅర్‌వో) కుర్చీలో కూర్చుంటారు. లేకుంటే ఏదైనా పెద్ద సాగునీటి ప్రాజెక్టుకు స్పెషల్ కలెక్టర్ గా వ్యవహరిస్తారు.
Ads
3. సబ్ కలెక్టర్ :- సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికైన ఐఏఎస్ అధికారులకు మొదటి పోస్టింగ్‌గా సబ్ కలెక్టర్ ఇస్తారు. మదనపల్లి, తిరుపతి వంటి కీలకమైన రెవెన్యూ డివిజన్‌లలో సబ్ కలెక్టర్‌గా జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తారు.
ఒక రెవెన్యూ సబ్ డివిజనల్ అధికారి కుర్చీలో గ్రూప్-1 అధికారి (డిప్యూటీ కలెక్టర్) కూర్చుంటే, అతని ఆర్డీవో అని పిలుస్తారు. అదే కుర్చీలో ఐఏఎస్ అధికారి కూర్చుంటే, అతన్ని సబ్ కలెక్టర్ అంటారు. ఇద్దరి అధికారాలు ఒక్కటే.
ఉదాహరణకు… తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి నిశాంత్ కుమార్‌ను సబ్ కలెక్టర్ అని పిలిచేవారు.. ఇప్పుడు పని చేస్తున్న కనక నరసారెడ్డిని ఆర్డీవో అంటున్నారు. అలాగే మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి జాహ్నవిని సబ్ కలెక్టర్ అనేవారు… ఇప్పుడు ఉన్న మురళిని ఆర్డీవో అంటున్నారు. ఇప్పుడు పని చేస్తున్న అధికారులు ఐఏఎస్ కాదు, గ్రూప్-1 అధికారులు కాబట్టి వాళ్లను ఆర్డీవోలుగా పరిగణిస్తారు.
4. MRO (తహసిల్దార్) :- 1985లో అప్పటి సీఎం రామారావు మండల వ్యవస్థ తీసుకొచ్చారు. అప్పటి నుంచి మండలానికి ఒక తహసిల్దార్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహసిల్దార్ అయ్యాక, ప్రమోషన్ మీద తహసిల్దార్ అవుతారు. లేదా, గ్రూప్- 4 ద్వారా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరితే, సీనియర్ అసిస్టెంట్.. డిప్యూటీ తహసిల్దారు, ఆ తర్వాత తహసిల్దార్ అవుతారు. అంతే తప్ప, డిప్యూటీ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు.. తహసిల్దార్ కుర్చీలో కూర్చోరు. తహసిల్దార్ అంటే మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, కానీ, ఇక్కడ హీరో ఓ సందర్భంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటాడు.
మరో విషయం :- పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంటే ముమ్మాటికీ డిప్యూటీ కలెక్టర్ కంటే చిన్న హోదా. ఆ విషయం తెలియకుండా సిఐ అయిపోరు. ఒక సిఐ వెళ్లి ఇష్టమొచ్చినట్లు డిప్యూటీ కలెక్టర్‌తో మాట్లాడడు.
__
ఇలాగే బోయపాటి తీసిన అఖండలో హోదాలు తెలియకుండా ఒక సీన్ పెట్టారు. హీరోయిన్ కలెక్టరుగా జాయిన్ అవడానికి వస్తే, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిసీవ్ చేసుకుంటుంది. (ఆమెను చూసి కలెక్టరు హీరోయిన్ ‘మీ వద్ద శిక్షణ పొందిన నేను, మళ్ళీ మీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అని అంటుంది) అంతటి సీనియర్ దర్శకుడికి కూడా హోదాల మీద పట్టు లేకుంటే ఎలా… పైగా మాజీ జర్నలిస్టు… పట్టు లేకున్నా పర్లేదు, తెలుసుకోవాలి కదా. అసలు ప్రిన్సిపల్ సెక్రెటరీ అంటే కలెక్టర్‌కంటే చాలా పెద్ద హోదా. అసలు ఆ హోదా ఉన్నవాళ్లు రాష్ట్ర స్థాయి అధికారులుగా రాజధానిలో ఉంటారు. జిల్లాల్లో ఉండరు…
__
కరీమ్ షేక్, చిత్తూరు (Shaik Karemulla ఫేస్‌బుక్ వాల్ నుంచి సంగ్రహించబడినది)…
Share this Article