లిటిల్ అండమాన్..! వందల దీవుల్లో ఒకటి… అద్భుతమైన ప్రకృతి చిత్రం అది… అందమైన సముద్రతీరాలు, జలపాతాలు, దట్టమైన అడవులు, పగడపు దిబ్బలు…! మనదే… అండమాన్ నికోబార్ పరిధిలోనే ఉంటుంది… అక్కడ కేంద్ర ప్రభుత్వం ఓ నగరాన్నే నిర్మించాలని తలపెట్టింది… హాంగ్కాంగ్, సింగపూర్లను తలదన్నే నగరం… విమానాశ్రయాలు, స్టార్ హోటళ్లు, హాస్పిటళ్లు, స్పా సెంటర్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు… వాట్ నాట్..? ఓ టూరిస్ట్ హబ్ చేయాలనేది సంకల్పం… మరెలా..? కార్పొరేట్ కంపెనీలతో సంప్రదిస్తోంది… ఆల్రెడీ కొద్దిరోజుల క్రితం నీతిఆయోగ్ ‘లిటిల్ అండమాన్- ఓ సుస్థిర అభివృద్ధి’ పేరిట కాన్సెప్ట్ పేపర్ కమ్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది… పబ్లిక్ కోసం కాదు… భాగస్వామ్యంపై ఆసక్తి కలిగిన కార్పొరేట్, విదేశీ సంస్థల కోసం… అక్కడక్కడా మీడియాలో వివరాలు కనిపిస్తున్నా నీతిఆయోగ్ ఎక్కడా ఖండించలేదు… అంటే వార్తలు నిజమని అంగీకరించినట్టే… మన టూరిస్టులు ప్రస్తుతం మాల్దీవులకు పరుగులు తీస్తున్నారు… మనమెందుకు మాల్దీవుల్ని మించిన టూరిస్ట్ హబ్ నిర్మించలేం..? ఎందుకు నిర్మించకూడదు..? ఇదే ఆ విజన్ డాక్యుమెంట్ పరమార్థం… ఇంకా ఉంది…
దీని అభివృద్ధి ఎలా ఉంటుందంటే..? మూడు జోన్లు… అందులో మొదటి జోన్లో అంతర్జాతీయ విమానాశ్రయం… ప్లస్ ఎయిరో సిటీ… బోట్లు, చిన్న పడవలు ఉండే రేవు… టూరిజం సెంటర్లు, కన్వెన్షన్ సెంటర్లు, మెడిసిటీ తదితరాలు ఉంటయ్… సెకండ్ జోన్లో అడవులు… ఫిలిం సిటీ, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, స్పెషల్ ఎనకమిక్ జోన్లు, టూరిజం విల్లాలు తదితరాలు ఉంటయ్… ఇక మూడో జోన్లో ఫారెస్ట్ రిసార్టులు, ప్రకృృతి వైద్య కేంద్రాలు, అండర్ వాటర్ రిసార్టులు, కాసినోలు, ఆఫీసు కాంప్లెక్సులు ఉంటయ్… మూడు జోన్లను కలుపుతూ పెద్ద రింగ్ రోడ్డు… మొత్తం 250 చదరపు కిలోమీటర్ల నగరం… ఇదీ సంకల్పం… బాగానే ఉంది కదా… కానీ అప్పుడే దీనిపై వ్యతిరేక కథనాలు, ప్రచారాలు ప్రారంభమయ్యాయి… ఎందుకంటే..?
Ads
దీవిలో దాదాపు 90 శాతం రిజర్వ్ ఫారెస్టు… అంతరించిపోతున్న ఓంగే జాతికి ఈ దీవే నివాసం… పీవీటీ అంటారు… అంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్… అంటే దాదాపు అంతిమదశలో ఉన్న జాతి… ఇక ఇప్పుడు కొన్ని లక్షల చెట్లను కొట్టేస్తే, అడవుల్ని నిర్మూలిస్తే ఈ జాతి పూర్తిగా ఉనికిని కోల్పోతుంది అనేది ఒక భయం… అలాగే ఓ ప్రత్యేకరకం సముద్రపు తాబేళ్లకు ఈ బీచులే అడ్డాలు… పర్యావరణానికి హాని వల్ల వాటికీ ప్రమాదమే… అసలు అండమాన్ దీవుల్లో ఉన్నవే నాలుగు ప్రధాన నీగ్రిటో తెగలు… అందులో ఈ ఓంగే ఒకటి… ఆ తెగవాళ్లలో మిగిలింది ఎంత మందో తెలుసా..? కేవలం నూటాపదిమంది… అంతకుముందే జరావా వంటి తెగలు పూర్తిగా అంతరించాయి… ఈ దీవికి 1971 బంగ్లాదేశ్ యుద్ధం తరువాత వందల మంది శరణార్థులు వచ్చారు… జనాభా పెరిగి పెరిగి ఇప్పుడు 18 వేల వరకూ చేరింది… హట్ బే అనేది రాజధాని దీనికి… పదీపన్నెండు పల్లెలు… ఇప్పుడిక నగరమే నిర్మితమైతే ప్రధానంగా దెబ్బతినేది ఆ నూటాపదిమంది ఓంగే గిరిజనం… ఎక్కడో పునరావాసం చూపిస్తాం అంటోంది కేంద్రం…
అంతే మరి… కార్పొరేట్ జేసీబీలు కదులుతుంటే ఆదివాసులు ముందుగా చెల్లాచెదురవుతారు… ప్రకృతి వనరులు దోచుకోబడతాయి… ఇవీ వ్యక్తమవుతున్న భయసందేహాలు… కానీ లక్షల మంది టూరిస్టులను ఆకర్షించే నగరాన్ని నిర్మించడమే కాదు… ఇది దేశరక్షణ రీత్యా అత్యంత కీలకమైన మలక్కా జలసంధికి దగ్గరలో ఉంటుంది… ప్రపంచ సముద్ర రవాణాకు కీలకమైన మార్గం ఇది… చైనా కారణంగా ఇక్కడ వ్యూహాత్మకంగా మన సైనిక స్థావరాలు నిర్మించాల్సిన అవసరమూ ఏర్పడుతోంది… అందుకని ఒకటీరెండు దీవుల్లో బాగా యాక్టివిటీని పెంచి… ఒకటీరెండు దీవుల్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మిస్సైల్స్ కంబైన్డ్ యూనిట్లను మొహరించాల్సి ఉంది… దేశభద్రత రీత్యా తప్పదు… అందుకే కేంద్రం అన్నిరకాల అభ్యంతరాలను కొట్టిపారేస్తోంది… ఇండియా భద్రతకు, హిందూ మహాసముద్రంపై ఇండియా ఆధిపత్యానికి సవాళ్లు విసిరే చైనా ముత్యాలసరం ప్రాజెక్టుకు విరుగుడు రచించాల్సిందే… అందుకే అండమాన్ దీవులు ఇప్పుడు కీలకమయ్యాయి…!!
Share this Article