బీహార్, పూర్నియా జిల్లా, గణేష్‌పూర్… ఈమధ్య తరచూ రాత్రిపూట రెండుమూడు గంటలు కరెంటు పోతోంది… దాదాపు ఒకటే టైమ్… ప్రకటించిన కరెంటు కోత వేళలు కావు… పోనీ, అప్పుడప్పుడూ కరెంటు పోవడం సహజమే కదా అనుకుందామంటే ఒకే టైమ్‌కు కరెంటు కట్ కావడం ఏమిటి..? కొందరు గ్రామస్థులు వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్ చూశారు… బాగానే ఉంది…
పై ఆఫీసుకు ఫోన్ చేస్తే అంతా బాగానే ఉంది అంటారు… సమీపంలోని పొలాలకు వ్యవసాయ కరెంటు సరఫరా బాగానే ఉంది… మరేమిటి సమస్య..? ఏదో తేడా కొడుతోంది… కానీ గ్రామస్థులకు కారణం అంతుపట్టడం లేదు… ఏదో డౌట్ పీడిస్తోంది… పక్క గ్రామాలను అడిగితే మాకైతే రాత్రిపూట కరెంటు కోత లేదని నిశ్చయంగా చెబుతున్నారు…
Ads
దాంతో గ్రామస్థులు ఒకటీరెండు చిన్న టీమ్స్‌గా ఏర్పడి, కరెంటు పోయిన వేళల్లో ఊరిలో కొన్ని వీథులు జాగ్రత్తగా పరిశీలించసాగారు… ఎక్కడైనా సందేహాస్పదంగా ఎవరిదైనా ఉనికి కనిపిస్తుందేమోనని వెతకసాగారు… ఎవరి ఇంట్లోనూ దొంగలు పడలేదు… ఎవరిళ్లల్లోనూ ఏవీ చోరీ కాలేదు… మరేం జరుగుతున్నదో అర్థం కాలేదు…
కొందరు పిల్లలకు కాస్త ఏం జరుగుతుందో వాసన తగిలింది… దాంతో ఓరాత్రిపూట కరెంటు పోగానే మెల్లిగా, చప్పుడు గాకుండా ఆ ఊరి స్కూల్ చేరుకున్నారు… వాళ్లు ఊహించింది, సందేహించింది నిజమే… అక్కడ ఓ జంట రాసలీలల్లో మునిగిపోయి ఉంది… ఒక్కసారిగా టార్చ్ లైట్లు వెలిగించేసరికి ఆ జంటకు ఠారెత్తిపోయింది… బయటికి తీసుకొచ్చారు…
నాలుగు తన్నేసరికి సదరు పురుష్ నిజం చెప్పేశాడు… తను ఎలక్ట్రిషియన్… ఆమె తన ప్రియురాలు… ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు ఊరికి కరెంట్ కట్ చేస్తున్నాడు… మెల్లిగా స్కూల్ చేరుకుంటున్నాడు… రెండుమూడు గంటలు కాలం గడిపి వెళ్లిపోయి, కరెంటు ఆన్ చేస్తున్నాడు… నడిచినన్ని రోజులూ బాగా నడిచింది… కానీ బాగోతం బట్టబయలైంది… గుండు గీకారు… ఊళ్లో ఊరేగించారు…
ఆమె లబోదిబోమంది… కాళ్లావేళ్లా పడింది… దాంతో సర్పంచి, పంచాయతీ సభ్యులు ఓ నిర్ణయం తీసుకున్నారు… ఆమెతో సదరు ఎలక్ట్రిషియన్‌కు పెళ్లి చేసేశారు… ఆ ఊళ్లో ఏదో జరిగిందట, ఏం సంగతి సార్ అని సంబంధిత పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను విలేకరులు అడిగితే… ‘‘అవును, నిజమే… పట్టుకున్నారు, గుండు గీకారు, చివరకు పెళ్లి చేశారు, కథ సుఖాంతమే కదా… ఇక ఫిర్యాదు ఏముంది..? కేసు ఏముంది ఇందులో…’’ అని నవ్వేశాడట… అంతే కదా మరి…!!
Share this Article