కరోనా కష్టకాలంలో ప్రభువుల వారికి కాస్త కరుణా దృక్పథం ఉండాలి… తీసుకునే నిర్ణయాల్లో మానవీయ కోణం ఉండాలి… నా ప్రజలు అనే భావన కనిపించాలి… దురదృష్టవశాత్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అవేవీ లేవు… కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు పరిహారం కింద చెల్లించే స్కీం కూడా ఎత్తిపారేయడం దీనికి పక్కా నిదర్శనం… 27 లక్షల కోట్ల ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ శుష్కఫలితం మరో నిదర్శనం… బోలెడు… మిగతా కరోనా పాలసీ వైఫల్యాల గురించి రాస్తూ పోతే గ్రంథాలే… తాజాగా ఓ స్కీం ప్రకటించారు… అదేమంటే..? కరోనా వల్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్ని కోల్పోయిన పిల్లల్ని ఆదుకునే పథకం… అనాథలుగా మారిన పిల్లలకు పీఎం కేర్స్ నుంచి సాయం చేయడం దీని ఉద్దేశం… కానీ సరిగ్గా గమనిస్తే ఇదీ ఆత్మనిర్భరం వంటి డొల్లే… ఖజానా నుంచి రూపాయి ఖర్చు కావద్దు, వంద రూపాయల సాయం చేసినట్టు బిల్డప్ మాత్రం తగ్గొద్దు అన్నట్టుగా ఉంది…
ఇదే బీజేపీ ప్రభుత్వం ఉంది ఉత్తరాఖండ్లో… సీఎం పేరు తీరత్ సింగ్… ముఖ్యమంత్రి వాత్సల్య యోజన పేరిట దేశంలో అందరు సీఎంలకన్నా ముందుగానే అనాథ పిల్లలకు అండగా నిలబడే మంచి స్కీం ప్రకటించాడు… అది చిన్న రాష్ట్రం కానీ, పాలకుడికి పెద్ద మనసు… అదీ ఈ గడ్డు రోజుల్లో జనానికి కావల్సింది… ఆ అనాథ పిల్లలకు 21 ఏళ్లు వచ్చేవరకు నెలకు 3 వేల చొప్పన మెయింటెనెన్స్ డబ్బు ఇస్తానన్నాడు… ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు… అదే బీజేపీ ప్రభుత్వం ఉంది మధ్యప్రదేశ్లో… అక్కడి ముఖ్యమంత్రి కూడా ఓ స్కీం ప్రకటించాడు… అనాథలుగా మారిన పిల్లలను గుర్తించి, 18 ఏళ్లు నిండేవరకు నెలకు 5 వేలు ఇస్తాను, గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య బాధ్యతను తీసుకుంటాను, ఉచిత రేషన్ ఇస్తాను అన్నాడు… దేశవ్యాప్తంగా ఆ సీఎంలు తీసుకున్న ఉదార నిర్ణయం పట్ల అభినందనలు కురిశాయి… తాజాగా బీజేపీ పొత్తు ప్రభుత్వం బీహార్లో అనాథలకు నెలనెలా 1500 పెన్షన్ ప్లస్ ఉచిత విద్యను ప్రకటించింది… దాదాపు అలాంటిదే కేరళలోని సీపీఎం ప్రభుత్వం ప్రకటించింది… నెలకు 2 వేలు ఇస్తాం, విద్య బాధ్యతను కూడా తీసుకుంటాం అనేది అక్కడ సీఎం విజయన్ ప్రకటన సారాంశం… ఏపీలో జగన్ అనాథ పిల్లల పేరిట 10 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తాను అన్నాడు… స్టాలిన్ పేరెంట్స్ ఇద్దరినీ కోల్పోతే 5 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రకటించాడు, ఒక్కరిని కోల్పోతే బతికి ఉన్న పేరెంట్కు 3 లక్షలు ఇస్తారు, ఉచిత చదువు కోసం హాస్టళ్లలో చేరుస్తారు, లేదంటే నెలకు 3 వేల మెయింటెనెన్స్ ఇచ్చేలా తాజాగా ఓ కారుణ్య పథకం ప్రకటించాడు… ఏదైనా మంచి చేయాలనే సంకల్పం, సత్ హృదయం ఉన్న వాళ్లయితే ఇలాంటి నిర్ణయాలను ప్రకటించగలరు… మరి మోడీ తాజా పథకం వివరాలు చూద్దామా ఓసారి…
- 10 లక్షల కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తారు, కానీ 18 ఏళ్లు రావాలి… తరువాత అయిదేళ్లపాటు అందులో నుంచి నెలవారీ స్టైఫండ్ ఇస్తారు… 23 ఏళ్లు నిండాక ఆ డబ్బు తన ప్రొఫెషనల్ అవసరాలకు తీసుకోవచ్చు… ఇప్పుడు పిల్లలుగా ఉన్నవాళ్లు బతికేదెలా..? అనే ప్రశ్నకు ఈ స్కీంలో సమాధానం లేదు…
- ఉన్నత విద్య కోసం లోన్ తీసుకుంటే దాని వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందట… మన బ్యాంకులు ఇచ్చే ఉన్నత విద్యారుణాల తీరు, ఆ కొర్రీలు గట్రా మనకు తెలిసిందే… పైగా ప్రభుత్వం భరించేది ఆ వడ్డీని… కానీ పిల్లల తక్షణ సమస్యలేమిటనేది ప్రధానం కదా…
- 18 ఏళ్లు నిండేవరకు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఆరోగ్య బీమాను వర్తింపజేస్తారుట… అసలు సమస్య వచ్చేదే పేద పిల్లలకు… వాళ్లు ఎలాగూ ఈ పథకం కిందకు వస్తారు కదా… మరిక వాళ్లు చెల్లించే ప్రీమియం ఏమిటి..? దానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చెంత..? ఇదో పెద్ద సాయంగా షో దేనికి..?
- పదేళ్లలోపు పిల్లలయితే కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ ఇస్తారుట… లేదంటే ప్రైవేటు స్కూళ్లలో ‘రైట్ ట్ ఎడ్యుకేషన్’ కింద చేరుస్తారట… కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు దొరకవ్… ఈ విద్యాలయాల సంఖ్యే పరిమితం… రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరూ అమలు చేయడం లేదు, ఒకవేళ చేసినా మొత్తం సీట్లలో 25 శాతం ఉచితంగా పేదలకు ఇవ్వాలి, కానీ వాళ్లు చెల్లించే ఫీజులేముంటయ్..? కేంద్ర ఖజానాకు భారం ఏముంది..? అంటే ఇలాంటి స్కీములు కొనసాగాలని ఏమీ లేదు… 4 లక్షల విపత్తు పరిహారాల పథకాన్నే ఎత్తిపారేసిన ప్రభుత్వం వీటిని కొనసాగించాలని ఏముంది..? అసలు ఈ స్కీములో పిల్లల్ని తక్షణం ఆదుకునే వీసమెత్తు కరుణ ఉందా..?
- నిజానికి కేంద్ర పథకాల్ని అమలు చేసే ప్రత్యేక యంత్రాంగం ఏమీ ఉండదు రాష్ట్రాల్లో… అందుకని ఓ ఏకరూప పథకాన్ని ప్రిపేర్ చేసి, రాష్ట్రాలకూ కొంత బాధ్యతను కల్పించి, వాటితోనే అమలు చేయించి, కేంద్రం కొంతమేరకు ఆర్థిక సాయం చేస్తే… అవి సాఫీగా అమలవుతయ్, కాస్త సార్థకత కూడా.., కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం అర్థం కాని కీలకాంశం ఇదే..! తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ ముఖ్యమంత్రులకు అభినందనలు… తమ గుండెలో తడి ఉందని చెప్పుకోగలిగారు, పాలకుడు ఏం చేయాలో చెబుతున్నారు… అక్కడ మోడీ, ఇక్కడ కేసీయార్…. హతవిధీ….!!
Share this Article
Ads