.
ఇది మున్నూరు రవి వాల్ మీద కనిపించింది… బాగుంది… విషయం ఏమిటంటే…
నిజామాబాద్ పాత ఉమ్మడి జిల్లా… రుద్రూరు మండలం, రాయకుర్‌కు చెందిన వృద్ధ దంపతులు… పేర్లు సాయమ్మ, గంగారాం… వీళ్లపై కోడలు గతంలో వరకట్నం కేసు నమోదు చేయించింది..
Ads
ఈ కేసు విచారణ కోసం ఇద్దరు ముసలి దంపతులు సోమవారం (ఏప్రిల్ 28) బోధన్ కోర్టుకు వచ్చారు… వాళ్లేమో నడవలేని దుస్థితిలో ఉన్నారు… కోర్టు వరకూ ఆటోలో వచ్చారు గానీ కోర్టు హాలు వద్దకు నడిచి వెళ్లే పరిస్థితి లేదు…
ఇదే విషయాన్ని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) సాయి శివకు వివరించినప్పుడు… తనే స్వయంగా ఆటో నిలిపి ఉంచిన స్థలాన్నే కోర్టు హాలుగా మార్చేశాడు… తనే బెంచ్ దిగి వచ్చి, ఆటో దగ్గరకు వచ్చి, వారిపై నమోదైన కేసు వివరాల్ని విచారించాడు… చాలా రేర్, అభినందనలు…
కేసు అసలు వివరాలు తెలుసుకుని, వారి దీనస్థితి కూడా చూసి వారిపై నమోదైన కేసు కొట్టివేస్తూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశాడు,.. అసాధారణం, అనూహ్యం… కానీ అవసరం… కక్షిదారుల పరిస్థితుల దృష్ట్యా కొన్నిసార్లు న్యాయమే వాళ్ల వద్దకు కదిలిరావడం అభినందనీయం…
అందుకే సదరు మేజిస్ట్రేట్‌కు అభినందనలు దక్కుతున్నాయి… మానవీయ కోణం… అంతేకాదు, ఇలాంటి కేసులు వేగంగా తెమిల్చి పదే పదే కోర్టు దాకా రానవసరం లేకుండా (స్పీడ్ డిస్పోజల్) తీర్పు చెప్పడం కూడా ప్రశంసార్హమే…
నిజానికి ఇలాంటి కేసుల్లో పోలీసులే ముందుగా నిజానిజాలు విచారించి, కేసు జెన్యూన్ అని వాళ్లు నిర్ధారించుకుంటేనే కోర్టు దాకా తీసుకురావాలి… ప్రతి కేసునూ, మేమయితే నమోదు చేస్తాం, మీరూ మీరూ కోర్టులో తేల్చుకొండి అంటే… కోర్టు సమయం వృథా, కక్షిదారులకు తిప్పట, వ్యయం, ప్రయాస… సామాజికంగా నింద…!!
Share this Article