టీవీల్లో కనిపించే… యూట్యూబ్ చానెళ్లలో కనిపించి ఊదరగొట్టే సిద్ధాంతులకు రాద్ధాంతం తప్ప సిద్ధాంతం తెలియదు… అసలేమీ తెలియదు… ప్రేక్షకులను రకరకాల వ్యాఖ్యానాలతో పిచ్చివాళ్లను చేయడం తప్ప…. ఎలాగోలా ఒర్రేవాడు కావాలనేది ఆయా ట్యూబ్ చానెళ్లు, టీవీల సంకల్పం… ఇంకేముంది..? రంగురంగుల పూసల దండలు వేసుకుని ప్రత్యక్షమవుతారు ఈ రాద్ధాంతులు…
సాధారణంగా శనిదోషాలు ఉన్నవాళ్లు శనిత్రయోదశి రోజున గుళ్లల్లో శనికి ఆరాధన చేస్తారు… నల్లబట్టలు, నల్లనువ్వులు, నువ్వులనూనె సమర్పణ… మంచిదే… కొందరు ప్రతి శనివారం గుళ్లల్లో నవగ్రహాల్లో ఒకడిగా కొలువు దీరిన శనికి పూజలు చేస్తారు… వచ్చే 18వ తేదీన అలాంటివాళ్లకు ఇంకా విశేషమైన దినం… ఎందుకంటే, ఆరోజున మహాశివరాత్రి కూడా వస్తోంది… ఇంకేం..? మొదలుపెట్టారు, 144 సంవత్సరాలకు వచ్చే మహర్దినం… పూజలతో శనికి ఊపిరాడనివ్వకండి అన్నట్టుగా మొదలుపెట్టారు…
అసలు శనికీ, శివుడికీ సంబంధం ఏముంది..? శనికి విరుగుడు ఏమిటో తెలుసా..? శనినే పూజించడం… లేదా హనుమంతుడి పూజ… అంతే తప్ప శివుడు, విష్ణువు పూజలు కాదు… అంటే వారిని పూజించకూడదని కాదు, శనికి విరుగుడుగా మాత్రం కాదు… అసలు ఈ 144 ఏళ్లకు ఒకసారి వస్తున్న మహత్తర పుణ్యదినం అనే మాట నిజమేనా..? కాదు…
Ads
ఇది కంచికామకోటి పీఠ ఆస్థాన సిద్ధాంతి ఎల్.విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి 1801 సంవత్సరం నుంచి ఇప్పటికి, ఇకపైనా 2301 సంవత్సరం వరకు… అంటే 500 ఏళ్లలో ఎన్నిసార్లు శివరాత్రి ప్లస్ శనివారం ప్లస్ శనిత్రయోదశి కలిసి వచ్చాయో చార్జులుగా ఇచ్చాడు… బోలెడుసార్లు వచ్చింది ఇలా… అంతెందుకు…? 1986 మార్చి ఎనిమిదిన కూడా వచ్చింది… అప్పటికి ఈ చానెళ్లు, శుష్క సిద్ధాంతుల పైత్యం ఇంత పెచ్చుమీరలేదు… అంతేకాదు, 2057 మార్చి 3న కూడా ఇలాగే వస్తోంది…
అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది… ఇలాంటి శని, శివరాత్రి, శనిత్రయోదశి కలిసిన రోజు రావడం అనేది మరీ పుష్కరపుష్కర కాలానికి ఓసారి (144) కాదు అని…. అలా వస్తూనే ఉంటాయి… సుబ్రహ్మణ్య శర్మ తన చార్టులలో ఉదయకాల త్రయోదశి, ప్రదోష కాల త్రయోదశి వివరాలు కూడా ఇచ్చాడు…
‘‘మహాశివరాత్రి నియమం వేరు, శనిత్రయోదశీ (శని ప్రదోషం) నియమం వేరు… ఉదయ వ్యాప్తి, ప్రదోష వ్యాప్తి రెండింటికీ రెండు వేరు వేరు నియమాలు, వ్రతములు ఉన్నవి… శని త్రయోదశీ ఉదయకాలం, ప్రదోషకాలం ఉన్న రెండింటి గురించి వివరం భవిష్యోత్తరంలో, స్కాందంలో చక్కగా చెప్పారు, రెండింటిలో ఈశ్వరారాధన చేయాలి అని…! అలాగే మహా శివరాత్రి కి కూడా ఈశ్వరారాధన చేయుట ప్రధానం. అష్టయామములలో అలాగే లింగోద్భవ కాలములో కలిపి తొమ్మిది పూజలు ఆచరించుట శివరాత్రి నియమం లేదా శివరాత్రి వ్రతం…’’ ఇదీ ఆయన మాట… పంచాంగ రుజువులతో సహా ఈ 144 ఏళ్లకోసారి అనే డొల్ల వాదనను తోసిపుచ్చాడు ఆయన…
సో, శివరాత్రి కాబట్టి శివుడి పూజలు చేసుకోవచ్చు… శనిత్రయోదశి కాబట్టి శని ఆరాధన కూడా చేసుకోవచ్చు… అంతేతప్ప ఇతర శనిత్రయోదశులకు, ఇతర మహాశివరాత్రులకు, రెండూ కలిసి రాబోయే ఫిబ్రవరి 18వ రోజుకూ పెద్ద తేడా ఏమీ ఉండదు… అదీ సంగతి…!!
Share this Article