.
{ రమణ కొంటికర్ల } …… చావా సినిమాతో ఇప్పుడు శివాజీ కుమారుడు శంభాజీ చరిత్ర సోషల్ మీడియా హాట్ కంటెంట్ గా మారింది. అయితే, చావా సినిమాను తెగపొగిడే వర్గమొకటి… అదే స్థాయిలో చరిత్రను వక్రీకరించారని, సినిమాల్లో చూపించిందే చరిత్ర అనుకునే దిక్కుమాలిన రోజులను చూస్తున్నామని ఇలా వర్గాలుగా విడిపోయి హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఈ క్రమంలో శంభాజీపై అభ్యంతరకర కంటెంట్ షేర్ చేశారంటూ ప్రస్తుత గూగుల్ ఎన్‌సైక్లోపీడియాగా మారిన వికీపీడీయాకు పోలీసులు నోటీసులు పంపించడం మరో చర్చకు తెరలేపింది.
Ads
వికీపీడీయాలో శంభాజీపై పెట్టిన కంటెంట్ పై హిందూసంఘాలు భగ్గుమంటున్నాయి. మిగిలినవాటిల్లో ఎంత వేగంగా స్పందిస్తారో తెలియదు గానీ.. క్వైట్ న్యాచురల్‌గానే మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ అలయెన్స్ ప్రభుత్వమూ సత్వరమే వికీపీడీయా కంటెంట్ పై స్పందించింది.
రాజ్యమే స్పందించాక.. ఆ వ్యవస్థలో పోలీసులాగుతారా…? అంతా అనుకున్నట్టే పోలీసులూ వికీపీడియాకు నోటీసులు పంపించారు. సత్వరమే ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశించారు. కంటెంట్ తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు.
ఏకంగా ఫడ్నవీసే రంగంలోకి దిగి చారిత్రక వాస్తవాలను వక్రీకరించేవిధంగా వ్యవహరిస్తే తమ ప్రభుత్వం ముమ్మాటికీ సహించదనీ చెప్పుకొచ్చారు. భావప్రకటనా స్వేచ్ఛకూ పరిమితులుంటాయని.. ఇతరులను అవమానించేవిధంగా, స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా వ్యవహిరించడం తగదనీ ఆయన వికీపీడియాలో శంభాజీ పోస్టింగ్ పై స్పందించారు.
ఇంతకీ ఏ లైన్స్ అభ్యంతరకరం..?
“inciting communal hatred, as Chhatrapati Sambhaji Maharaj is highly revered in India”. ఈ పదాలు వికీపీడియాలో అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ వికీపీడియాకు నోటీసులు పంపింది. ఏకంగా ముఖ్యమంత్రి ఫడ్నవీసే రంగంలోకి దిగి మీడియా ముందుకొచ్చారు.
మతవిద్వేషాలను రెచ్చగొట్టే విషయంలో శంభాజీని ఓ ఉన్నతమైన వ్యక్తిగా కొలుస్తున్నట్టుగా వికీపీడియాలో పేర్కొనడంపై ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఓపెన్ సోర్స్ ఫ్లాట్ ఫామ్స్ పై తప్పుడు, వక్రీకరణలతో కూడిన సమాచారాన్ని పెడితే సహించేదే లేదంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం.
విక్కీకౌశల్ నటించిన చావా విడుదలతోనే హిట్ టాక్ సంపాదించుకోగా.. అసలు చరిత్రేంటో సరిగ్గా తెలుసుకోకుండానే చారిత్రక సినిమాలు తీస్తున్నారనే నాణానికి రెండోవైపు వాదనలూ మొదలయ్యాయి.
దీంతో వికీపీడియా వంటి సోర్సెస్ తో పాటు.. గత చరిత్రపై తవ్వకాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వికీపీడియాలో శంభాజీ మహారాజ్ గురించి పెట్టిన పోస్టింగ్ లో.. ఆయన్ను మతవిద్వేషాలు రెచ్చగొట్టే నాయకుడిగా పేర్కొనడంతో ఈ వివాదానికి తెరలేచింది.
సకాలంలో తక్షణమే ఆ పోస్టింగ్ ను తొలగించాలని, భవిష్యత్తులో అలాంటి పోస్టింగ్స్ పెట్టొద్దని హెచ్చరిస్తూ మహారాష్ట్ర సైబర్ క్రైమ్ శాఖ రాసిన లేఖతో ఇప్పుడు వికీపీడియా ఏం పోస్ట్ చేసి ఉంటుందన్నదానిపైనా సెర్చింగ్ మొదలైంది.
మొత్తంగా ఒకవైపు థియేటర్స్ లో కన్నీళ్ల పర్యంతమవుతూ వీడియోలు, ఇంకోవైపు చావాను తారాస్థాయిలో నిలబెట్టే రివ్యూలు.. మరోవైపు చావగొట్టారంటూ సమీక్షలు.. ఇంకోవైపు ఇప్పుడు తాజాగా వికీపీడియా పోస్టింగ్ పై మహారాష్ట్ర పోలీసుల నోటీసులు.. వెరసి, చావాకు అనుకున్నదానికంటే హ్యూజ్ రెస్పాన్సే దక్కుతోంది…
Share this Article