మామూలుగా మహేష్ బాబు బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతాడు… ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లలో ఎక్కడైనా సరే మాట తూలడు… వివాదాల జోలికి పోడు… కూల్‌గా, హుందాగా ఉంటాడు… కానీ మొన్న ఓచోట హఠాత్తుగా హిందీ సినిమాలకు సంబంధించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదాన్ని కొనితెచ్చింది… నిజంగానే తన వ్యాఖ్యలు అర్థరహితం… హిందీ సినిమా తనను భరించలేదు అనే వ్యాఖ్య సందర్భరహితం కూడా..! తను ఏ మూడ్‌లో ఉండి, ఏం అనబోయి, ఆ మాటలన్నాడో తెలియదు గానీ, ఆ వ్యాఖ్య కరెక్టు మాత్రం కాదు…
మహేష్ బాబు వ్యాఖ్యపై తెలుగు మీడియా పెద్దగా డిస్కషన్ పెట్టడం లేదు గానీ… హిందీ సినిమాలను చిన్నబుచ్చినట్టుగా జాతీయ పత్రికలు, నార్తరన్ మీడియా రాసేస్తోంది… ఒకరిద్దరు హిందీ సినిమావాళ్లు ఆ వ్యాఖ్యల్లో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు గానీ మరీ పెద్ద సీరియస్ కౌంటర్లు లేవు… అయినా సరే మహేష్ బాబు ఎందుకలా మాట్లాడినట్టు..?
ఇక్కడ రెండు అంశాలు… 1) పాన్ ఇండియా 2) హిందీలో సినిమా… ఆమధ్య ప్రభాస్ సాహో తీశాడు, పేరుకు పాన్ ఇండియా అయినా మొదట హిందీలో తీసి, తెలుగు, ఇతర భాషల్లో డబ్ చేసినట్టుగా ఉంది… అలాగే రాధేశ్యామ్ కూడా… తనకు బాహుబలితో వచ్చిన పేరును అలా యూజ్ చేసుకుంటున్నాడు… సేమ్, ఆదిపురుష్ సహా ఇంకొన్ని హిందీ సినిమాలూ చేస్తున్నాడు… ఇలా మహేష్ బాబు చేయగలడా..? చేయగలడు… ఎప్పుడూ అంటే… తనకు ఆల్‌రెడీ ఇంకేదైనా సినిమా ద్వారా హిందీ ప్రేక్షకుల్లో పేరు వచ్చినప్పుడు మాత్రమే…
Ads
ఉదాహరణకు… పుష్పతో అల్లు అర్జున్‌కు కాస్త పాపులారిటీ వచ్చింది, తను నేరుగా హిందీలో సినిమా తీస్తే జనం గుర్తుపడతారు… చూస్తారు… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్‌కు, జూనియర్‌కు కూడా హిందీలో రీచ్ వచ్చింది… అయితే వాళ్లు ఎలా వాడుకుంటారనేది వేరే సంగతి… నిజానికి ఇప్పటి ట్రెండ్‌లో హిందీ ప్రేక్షకులకు పరిచయం కావడం, వీలయితే క్లిక్ కావడం కష్టమేమీ కాదు…
పర్ సపోజ్… మహేష్ బాబు ఒక తెలుగు సినిమాకు ఒరిజినల్‌గా 40 కోట్లు ఖర్చయ్యిందీ అనుకుందాం… గరిష్ఠంగా యాభై లక్షలు ఖర్చు పెడితే, పాటలు హిందీల్లోకి తర్జుమా అయిపోతయ్, డైలాగులకు వాయిస్ ఓవర్ కూడా పూర్తవుతుంది… బాహుబలి వంటి సినిమాలతో ఆల్రెడీ రాజమౌళి అన్ని రాష్ట్రాల్లోనూ డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిపోయాడు… సో, డిస్ట్రిబ్యూషన్ పెద్ద కథేమీ కాదు… సినిమా క్లిక్ అయితే ఒరిజినల్ నిర్మాణ వ్యయం కూడా రాబడుతుంది… అంతేకాదు, ఓటీటీ, టీవీ రైట్స్‌తో డబ్బే డబ్బు… సౌత్ ఇండియా పెద్ద హీరోలందరూ చేసే పని ఇదే… పాన్ ఇండియా సినిమాల అసలు మార్కెటింగ్ మర్మం కూడా ఇదే… అదనపు ప్రయోజనం ఏమిటంటే దర్శకుడు, హీరోలిద్దరికీ హిందీలో మార్కెట్ క్రియేటవుతుంది…
తను ఎలాగూ త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్నాడు… అదెలాగూ మినిమం ఏడెనిమిది భాషల్లో రిలీజ్ చేస్తాడు రాజమౌళి… అప్పుడైనా హిందీలో కనిపించాల్సిందేగా… అసలు రాజమౌళి దృష్టి ఎక్కువగా హిందీ మార్కెట్ మీదే ఉంటుంది… పైగా రాజమౌళి మళ్లీ ఏ రెండుమూడు వందల కోట్లో ఖర్చు పెడతాడు కదా… మరిక మహేష్ బాబును భరించలేకపోవడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది..? బాలీవుడ్ రేంజ్‌ను మించి మహేష్ బాబు సినిమాలకు ఖర్చు కావడం లేదు కదా… సో, ఏ కోణం నుంచి చూసినా తన వ్యాఖ్యల్లో పరిణతి కనిపించడం లేదు…
జరుగుతున్న డ్యామేజీ గమనించి మహేష్ బాబు టీం ఓ ప్రకటన విడుదల చేసింది… మహేష్ బాబు వ్యాఖ్యలు సరిగ్గా కమ్యూనికేట్ కాలేదనీ, తనకు హిందీయే కాదు, ఏ భాష సినిమాల మీద కూడా తేలికభావం లేదని క్లారిటీ ఇచ్చింది… తెలుగులో కంఫర్ట్‌గా ఉన్నాననేది తన ఉద్దేశమనీ చెప్పింది… ఓ పని చెయ్ మహేషా… జనానికి క్లాస్ పీకే సినిమా కథలు గాకుండా… మంచి సరదా పాటలు, కామెడీని రంగరించి ఓ ప్యూర్ హిందీ సినిమా తీయించు… ఎందుకు ఆదరించరో, ఎందుకు నిన్ను బాలీవుడ్ భరించలేదో అదీ చూద్దాం…!!
Share this Article