ఇప్పుడు నాగచైతన్య ఎలా స్పందించాలి అన్నాడు ఓ మిత్రుడు…? నిశ్శబ్దంగా ఉండటంకన్నా బెటర్ ఆప్షన్ లేదు అనేది మరో మిత్రుడు జవాబు…! నిజం… అక్షరాలా నిజం… సమంత ప్రేమమైకంలో పడి పిచ్చోడయ్యాడు… కుటుంబసభ్యులకు ఎదురుతిరిగాడు… నాగార్జునకు ఆమె తత్వం సంపూర్ణంగా తెలుసు… అడ్డుకున్నాడు… కుదర్లేదు… పోనీలే, అమలలాగా ఒదిగిపోతుంది అనుకున్నాడు… రాజీపడ్డాడు… చైతూ ప్రేమకు వోకే చెప్పాడు…
సమంత చెప్పినట్టే… క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి, హిందూ సంప్రదాయంలో పెళ్లి… పర్లేదు… వాళ్ల ప్రేమ, వాళ్ల నమ్మకాలు మతం హద్దులు దాటి రాలేకపోయాయి… తన నటన జీవితానికి ఆంక్షలు పెట్టొద్దు అని షరతు పెట్టింది… చైతూ సరేనన్నాడు… కానీ సమంత ఎప్పుడూ అమల కాలేదు కదా… అమల పెళ్లిగాకముందు ఏమైనా కావచ్చు, పెళ్లయ్యాక అక్కినేని కుటుంబ మర్యాదల చట్రంలో ఒదిగిపోయింది… వేరే వ్యాపకాలు చూసుకుంది… నాగ్, తను… అంతే… కంఫర్ట్…
సమంత అలా కాదు… ఆమె నొటోరియస్ సర్కిల్ వేరు… తను మోల్డ్ కాలేదు… కావల్సిన అవసరమేముంది అనే ప్రశ్నకు జవాబు కష్టం… చైతూ కోరుకున్నది వేరు, సమంత ఆ సోకాల్డ్ కుటుంబమర్యాదల గోడల నడుమ బతకలేకపోయింది… తప్పని కాదు, తత్వాలను బట్టి ఉంటుంది… ఒక పెద్ద కుటుంబంలోకి వెళ్లినప్పుడు నాకిష్టమొచ్చినట్టు బతుకుతాను అంటే కుదరకపోవచ్చు… చాలా పరిమితులు అనివార్యంగా కట్టిపడేస్తుంటయ్… ఆమె రాజీపడలేదు… ఫలితం… ఘర్షణ…
Ads
సెలబ్రిటీ ప్రేమల్లో, పెళ్లిళ్లలో గాఢత తక్కువ… అవి మహా పెళుసు… సమంత బంధం అంతకుమించి… ఆమె చూపు వేరు, ఆమె గోల్స్ వేరు, ఆమె ఓ స్వేచ్ఛావిహంగం… రెక్కలు కట్టేసినట్టయింది… ఆమె జీవితంలో చైతూ ఓ పాసింగ్ క్లౌడ్… అక్కడ ఆమెను సరిగ్గా అంచనా వేయడంలో చైతూ ఫెయిల్… వెరసి రోజూ కొట్లాట… ఆమె భాషలో చెప్పాలంటే… ‘‘ఇద్దర్నీ ఓ గదిలో వదిలేస్తే అక్కడ పదునైన ఆయుధాలు లేకపోవడమే ఇద్దరికీ మేలు’’… చివరకు ఏమైంది… పెటాకులైంది…
అదీ పెద్ద ఇష్యూ కాదు… సెలబ్రిటీల బంధాల్లో బ్రేకప్పులు, పెటాకులు చాలా కామన్… చాలావరకు వారి ప్రేమల్లో రాజీలుండవు, సర్దుబాట్లుండవు… నేనేం తక్కువ, నాకేం తక్కువ అనే ఇగోలు ప్రభావితం చేస్తుంటాయి… అవన్నీ ప్రభావితం చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అనకండి… దాన్ని ప్రేమ అనడమే అబ్సర్డ్… ఆమె ఈ మర్యాదలు, కుటుంబ గౌరవమనే సోకాల్డ్ కట్టుబాట్లను తెంచేసుకోవడానికే నిర్ణయించుకుంది… చైతూ చేసేదేమీ లేదు… నిర్వికారంగా చూస్తూ నిశ్చేష్టుడు కావడమే… అదే జరిగింది…
సినిమా ప్రపంచం వేరు… తెర వెనుక బంధాలు రకరకాలు… అయితే దగ్గుబాటి, నందమూరి, అక్కినేని వంటి బడా సినిమా కుటుంబాలకు వచ్చేసరికి… అవీ వైవాహిక బంధాల దాకా వచ్చేసరికి… సొసైటీలో మర్యాద, మన్నన, మన్నూమశానం పరిగణనలోకి వస్తాయి… స్టూడియోలు, వ్యాపారం, లావాదేవీలు గట్రా చాలా ఉంటాయి… సమంత అమల జీవితాన్ని అధ్యయనం చేయకపోవడం ఓ తప్పు… అమల సర్దుబాటును, వైవాహిక బంధం కోసం రాజీపడిన తీరును సరిగ్గా అర్థం చేసుకుని ఉండాల్సింది… అలా ఉండలేను అనుకుంటే అసలు చైతూతో పెళ్లి అనేదే కరెక్టు కాదు… అదుగో అక్కడ పడింది రాంగ్ స్టెప్…
ఇన్నాళ్లూ ఆమె ఏమీ మాట్లాడలేదు… కానీ కరణ్ అనే ఓ పెక్యులియర్ కేరక్టర్ హోస్ట్ చేసే ఓ టీవీషోలో ఆమె ఏవేవో చెప్పింది… చైతూ పట్ల ఓ ద్వేషాన్ని గుమ్మరించింది పరోక్షంగానో, ప్రత్యక్షంగానో… పెటాకులకూ తాను చాలా అవస్థలు పడాల్సి వచ్చిందట… 250 కోట్ల పరిహారం తీసుకున్నాననే ప్రచారాన్ని ప్రస్తావించింది… దానికి నాగార్జునో, చైతూయో ఎలా బాద్యులు..? ఎవడో ఏదో రాస్తే వాళ్లేం చేస్తారు..? స్టిల్… ఈరోజుకూ అక్కినేని కుటుంబం మౌనంగానే ఉంది… ఆమె మీద బురద జల్లే ప్రయత్నం చేయలేదు…
మర్యాదగానే తెగదెంపులు అనే పాలసీ పాటించింది… చైతూ కూడా ఎక్కడా ఆమె మీద వీసమెత్తు విమర్శ చేయలేదు… ఎస్… అదే కరెక్టు… ఆమె తత్వం డిఫరెంటు… అందరికీ నచ్చాలని ఏమీలేదు… ఒకసారి విడిపోయాక ఇక వదిలేయాలి… తవ్వేకొద్దీ పెంకాసులు, కంకాళాలు… ఆ సోయి ఆమెకు లేదు… ఉండదు… ఆమె గగనంలో ఎగిరే పతంగి… దారంతో నియంత్రించడం కూడా కష్టమయ్యేలా ఎగిరే విహంగి… సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్ల డొల్లతనం చైతూకు అర్థమైంది… సో, ఏమీ స్పందించకుండా… హుందాగా వదిలేయడం బెటర్… అదే తనను వ్యక్తిగతంగా నాలుగు మెట్లు పైకి ఎక్కిస్తుంది… మరి ఆమె..? సినీగగనంలో కొన్ని తారలు కొంతకాలం తళతళ మెరుస్తాయి… ఇండస్ట్రీ చాలా తారల్ని చూసింది…!!
Share this Article