మొదటి కథ:- పద్నాలుగేళ్లు పాలించిన “చెప్పు”
రామాయణ గాధలు తెలియనిదెవరికి? కాకపోతే- రాత్రంతా రామాయణం విని, పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడుగుతుంటాం కాబట్టి-మరలనిదేల రామాయణంబన్న . . . రోజూ తినే అన్నమే మళ్లీ మళ్లీ తింటున్నాం కదా అన్నారు విశ్వనాథ వారు. రాముడు అడవికి వెళ్లాడు. భరతుడు తాత, మేనమామల కేకయ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చాడు. అన్న రామన్న లేడు. తండ్రి దశరథుడి మరణం. తండ్రి ఉత్తర క్రియలయ్యాక మొత్తం అయోధ్యను తీసుకుని అడవిలో అన్న దగ్గరికి వెళ్లాడు.
నేను రాజ్యం అడగలేదు, అమ్మ కైకేయి అడిగినప్పుడు అక్కడ లేను . నాన్న పోయారు. అయోధ్య సింహాసనం ఖాళీగా ఉంది . వచ్చి నువ్వే ఏలుకో – అని వినయంగా రామయ్యకు చెప్పాడు. భరతా! తండ్రి ఉన్నా, లేకున్నా మాట మాటే. రావడం కుదరదు. 14 ఏళ్లు నేనడవిలో ఉంటానన్నాడు రాముడు. అయితే నేనూ అయోధ్యకు వెళ్ళను. ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని దర్భలు పరుచుకుని మొండికేస్తాడు భరతుడు. ఇది తెగే వ్యవహారం కాదని మధ్యలో వసిష్ఠుడు కలుగజేసుకుని బంగారు పాదుకలు తెచ్చి- రామా ఒకసారి ఈ పాదుకలు తొక్కి భరతుడికివ్వు, నీ పాదుకలనే నిన్నుగా అనుకుని భరతుడు నీపేరిట రాజ్యం చేస్తాడు- అని సూచించాడు. ఈ మధ్యేమార్గం రాముడికి- భరతుడికి ఇద్దరికీ నచ్చింది. ఆ క్షణం నుండి ఏకంగా పదునాలుగేళ్లు చతుస్సాగర పర్యంత సకల మహీమండల సువిశాల రాజ్యాన్ని రామపాదుకలే పాలించాయి.
Ads
రెండో కథ:- సన్మానం “చెప్పు”
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తెలియని నాటక ప్రియులు ఉండరు. అయన రచించిన హరిశ్చంద్ర పద్య నాటకం ప్రదర్శించని తెలుగు ఊరు ఉండదు. సహజంగా గొప్ప రచయిత, రంగస్థల నటుడు. హరిశ్చంద్రుడిని పీక్కుతినే నక్షత్రకుడి పాత్ర బలిజేపల్లి స్వయంగా వేసేవారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఒకచోట హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తున్నారు. ముందు వరుసలో తెలుగు తెలిసిన ఒక బ్రిటిషు ఆఫీసరు కూర్చున్నాడు.
నక్షత్రకుడిగా బలిజేపల్లి పెట్టే కష్టాలు, హరిశ్చంద్రుడిని అనే మాటలకు పట్టరాని కోపం వచ్చి చెప్పు తీసుకుని బలిజేపల్లిపై విసిరాడు. ఈ లోపు కలకలం మొదలయ్యింది. నాటకంలో లీనమై నక్షత్రుకుడి మీద కోపం వచ్చిందని, క్షమించమని స్టేజ్ పైకి వచ్చి ప్రాధేయపడ్డాడు. బలిజేపల్లి పొంగిపోయాడు. ఆ చెప్పునే మెడలో హారానికి గుచ్చుకుని ధన్యోస్మి అన్నాడు. ఆ క్షణంలో సభికులు బలిజేపల్లికి పాదరక్షక బిరుదును ప్రదానం చేశారు. అప్పటినుండి ఆయన పాదరక్షక బిరుదాంకిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అయ్యాడు. బహుశా ఇంకెవరికీ, ఎప్పటికీ ఈ పాదరక్షక బిరుదు రాదు.
ఎందరిమీదో కోపంగా, నిరసనగా చెప్పులు పడుతుంటాయి. నటనకు అభినందనగా చెప్పు అందుకున్నవాడు బలిజేపల్లి ఒక్కడే. చెప్పు విసిరినవాడు రసహృదయుడు. వేయించుకున్నవాడు ఇంకా సరస హృదయుడు.
ప్రస్తుత కథ:- మగవారి చెప్పుల మార్కెట్
అప్పుడెప్పుడో జయలలిత ఇంట్లో వందల జతల చెప్పులు ఇంటిని అలంకరించాయని చెప్పుకునేవారు. చెప్పుడు మాటలు కావు, నిజమే అని తేలింది కూడా… రాజకీయ ప్రత్యర్థులు ఆమె చెప్పులకు అనేక చెప్పుడు కథలు జోడించినట్లున్నారు. కాస్త కలవారు, మ్యాచింగ్ ఫ్యాషన్ స్పృహ ఉన్న మహిళలెవరయినా డ్రస్సుకు, సందర్భానికి తగిన చెప్పులే తొడుక్కుంటున్నారు. కొందరికి డ్రస్సుల షెల్ఫ్ లు ఉన్నట్లు చెప్పుల షెల్ఫ్ లు కూడా ఉంటున్నాయి. ఒకప్పుడు ఎంత విలువైన చెప్పులయినా వీధి గుమ్మం అవతలే తప్ప ఇంట్లోకి వచ్చేవి కావు. ఇప్పుడు నగల అల్మారాల స్థాయిలో చెప్పుల అల్మారాలు ఇంటి లోపలికి వచ్చేశాయి.
భారతదేశంలో ఇన్నాళ్లుగా ఈ చెప్పుల స్పృహ మహిళలకు మాత్రమే ఉండేది. కొన్నేళ్లుగా మగవారు కూడా డ్రస్సులకు తగ్గ చెప్పులు, బూట్లు కొంటున్నారని షూ తయారీ కంపెనీలు తెగ సంబరపడిపోతున్నాయి. పట్టణాలు, నగరాల్లో అర డజను చెప్పుల జతలు, అర డజను బూట్ల జతలు మెయింటైన్ చేస్తున్న మగవారున్నారని షూ కంపెనీల సర్వేలో తేలింది.
సందర్భానికి తగిన చెప్పులు, బూట్లు కొనండి మగానుభావులారా! అని షూ కంపెనీలు ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి. నలుగురు మగవారు కూర్చుని మాట్లాడుకునేవేళ చెప్పుల గురించే చెప్పిన మాట చెప్పకుండా చెప్పుకునే రోజులొచ్చాయి! చెప్పుకుంటే చెప్పుకే చెవులుపుట్టే కథలు కొన్ని. చెప్పకుండా చెప్పులే వసుధను పాలించిన పుణ్యకథలు కొన్ని.
చెప్పుకోలేని చెప్పు కథలు కొన్ని. చెప్పుకుంటే సిగ్గుచేటయిన చెప్పు కథలు కొన్ని.
చెప్పినా…
చెప్పకపోయినా…
ప్రతి చెప్పుకు ఒక చెప్పుకోవాల్సిన కథ ఉంటుంది.
యుగయుగాలుగా మనిషిని మోస్తున్న చెప్పే కనుక నోరు విప్పి చెప్పితే…
మనిషికి చెప్పుకోవడానికి ఏమీ మిగలదేమో!
ఏమో!!……. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article