జోసెఫ్ డిటూరి… ఆయన రిటైర్డ్ నేవీ ఆఫీసర్… సముద్రం మీద చాన్నాళ్లు డ్యూటీలు చేసినవాడు కదా… ఓ అధ్యయనం కోసం సహకరిస్తారా అనడిగారు సైంటిస్టులు… ఓఎస్, దానికేం భాగ్యం, కానీ ఏం చేయాలి అనడిగాడు తను… దేనికైనా రెడీ అన్నట్టుగా…
‘‘మూడు నెలలకు పైగా నీటి అడుగున ఉండాలి, మానవశరీరంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనేది మా స్టడీ కాన్సెప్ట్… అంటే, సముద్రజలాల ఒత్తిడిలో గడపడం…’’ అన్నారు వాళ్లు… సరే, జలాంతర్గాముల్లో పనిచేసే సిబ్బంది మీద సముద్రజలాల ఒత్తిడి పనిచేస్తుంది కదా, మళ్లీ ప్రత్యేకంగా స్టడీ దేనికి అనడిగాడు జోసెఫ్…
అప్పుడప్పుడూ పైకి వస్తారు వాళ్లు… కానీ మీరు అవిశ్రాంతంగా 3 నెలలకు పైగా అక్కడే ఉండాలి అని క్లారిటీ ఇచ్చారు వాళ్లు… సరే, నేను రెడీ అంటూ సిద్ధపడిపోయాడు ఆయన… సీన్ కట్ చేస్తే…
Ads
ఆయన అట్లాంటిక్ మహాసముద్రజలాల లోతుల్లో వదిలేశారు… విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, కానీ సాధారణ జీవనం గడిపేలా సౌకర్యాలుంటాయి ఓ సబ్ మెరైన్ వంటి ఏర్పాటులో… మొత్తం 93 రోజులున్నాడు… అంతకుముందు ఎవరో 73 రోజులున్నాడట, ఆ రికార్డు బ్రేక్ చేశాడు… బయటికి రాగానే వైద్యపరీక్షలు చేశారు… క్షుణ్నంగా… అసలు పంపించిందే దాని కోసం కదా…
పరీక్షల ఫలితాలు చూసి సదరు సైంటిస్టులు ఆశ్చర్యపోయారు… జోసెఫ్ వయస్సు కనీసం 10 సంవత్సరాలు తగ్గిపోయిందని ఆ ఫలితాల సారాంశం… ఎహె, వయస్సు తగ్గినట్టు వైద్యపరంగా ఎలా నిర్ధారిస్తారు అంటారా..? ఉన్నయ్, దానికీ కొన్ని లెక్కలున్నయ్… ః
టెలోమియర్లు, క్రోమోజోమ్స్ చివర్లలోని డీఎన్ఏ క్యాప్స్ సాధారణంగా వయస్సుతోపాటు చిన్నగా అవుతుంటాయి… కానీ డిటూరి శరీరంలో అవి 20 శాతం పొడవు పెరిగాయి… తన స్టెమ్ సెల్ కౌంట్ పెరిగింది… ఆరోగ్యపరంగా కూడా సత్సూచనలు, (గుడ్ సైన్స్) కనిపించాయి… అనుకున్నదానికన్నా హాయిగా నిద్రపోయాడు, నిద్రపోయే నిడివి పెరిగింది… నిద్రలో గాఢత పెరిగింది… మెటబాలిజం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఆయన వయస్సు తగ్గింది…
కొలెస్ట్రాల్ స్థాయి 72 పాయింట్లు తగ్గింది… ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గాయి… అవునా..? ఒక మనిషి వయస్సు తగ్గింది అని చెప్పడానికి ఇవేనా ప్రాతిపదికలు అనడిగారు జర్నలిస్టులు ఆ సైంటిస్టులు… ఇవేకాదు, ఇంకా చాలా ఉంటయ్, అన్ని ప్రామాణికాల్లోనూ వయస్సు తగ్గింపు నిర్ధారణే కనిపించింది అని బదులిచ్చారు వాళ్లు… ఎందుకలా ఈ అద్భుతం అనడిగితే… దానికోసమే కదా మా అధ్యయనం, నీటి ఒత్తిడి మనిషిపై చూపిన ప్రభావం అన్నారు వాళ్లు…
మరి అంతకుముందు 73 రోజులున్న మనిషిలో కూడా ఎంతోకొంత ఈ ప్రభావం కనిపించాలి కదా అనడిగారు జర్నలిస్టులు… అవే అనలైజ్ చేస్తున్నామన్నారు వాళ్లు దాటవేస్తూ… ‘‘ఆహా, ఇది బాగుంది, మనుషులకు ఇదీ ఓ చికిత్స మార్గం కావాలి… రెండు వారాల చొప్పున విశ్రాంతికి ఇలాంటి ఏర్పాట్లు రావాలి… హైపర్ బారిక్ మెడిసిన్ ఇది… ఆ ప్రయోజనాన్ని అనుభవించాల్సిందే గానీ చెప్పలేం’’ అంటున్నాడు డిటూరి బ్రిటిష్ టాబ్లాయిడ్ ‘డైలీ మిర్రర్’ ప్రతినిధితో…
తను నీటి అడుగున ఉన్న సమయంలో తనకు ఏర్పాటు చేసిన వ్యాయామ పద్ధతుల్లో వారానికి ఐదురోజులపాటు గంట చొప్పున వ్యాయామం చేశాడు… అంతకుమించి ప్రత్యేకమైన కసరత్తులేమీ చేయలేదు… అవునూ… ఈ కాలవ్యవధిని ఏ ఆరు నెలలకో, సంవత్సరానికో పెంచితే మనిషి ఓ ఇరవై ఏళ్ల వయస్సు తగ్గించుకుంటాడా..? సాధ్యమేనా..? తెలియదు, సదరు జర్నలిస్టులు అడగలేదు, ఆ సైంటిస్టులకూ ఆ సమాధానం తెలియదు…!!
Share this Article