బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ & క్లాసిక్ సినిమా మన వూరి పాండవులు… . పాండవులు అనో , లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు . టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది .
భారతంలో పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా అయిదుగురు పాండవులు , ఓ దుర్యోధన+ దుశ్శాసనుడు ఉంటాడు , ఓ శకుని ఉంటాడు . వీరందరూ ఉన్నాక కృష్ణుడు లేకుండా ఎలా ఉంటాడు !? కాకపోతే భారతంలో కృష్ణుడు బలరాముడి తమ్ముడు , ఈ సినిమాలో దుర్యోధనుడు+ దుశ్శాసనుడికి తమ్ముడు . భారతంలోలాగా ద్రౌపది ఉండదు . మోసగించబడిన , అవమానించబడిన స్త్రీ ఉంటుంది .
పండిత పామరుల మెప్పు పొందిన ఈ మన ఊరి పాండవులు సినిమా 1978 లో వచ్చింది . పడువారళ్ళి పాండవురు అనే కన్నడ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడంలో అంబరీష్ , రామకృష్ణ (మన రామకృష్ణ కాదు) , ఆరతి , తదితరులు నటించారు . ఆ తర్వాత కాలంలో బాపుయే హిందీలోకి హం పాంచ్ అనే టైటిలుతో రీమేక్ చేసారు . హిందీలో సంజీవ్ కుమార్ , మిధున్ చక్రవర్తి తదితరులు నటించారు . తమిళంలోకి కూడా రీమేక్ అయింది . తమిళ సినిమాలో శరత్ బాబు , సరిత , గీత , తదితరులు నటించారు .
Ads
మన తెలుగు సినిమాకు మూడు అవార్డులు కూడా వచ్చాయి . కృష్ణంరాజుకు ఉత్తమ నటుడిగా , నిర్మాతలకు ఉత్తమ చిత్రంగా , బాలూ మహేంద్రకు ఉత్తమ సినిమాటోగ్రాఫరుగా అవార్డులు వచ్చాయి . అవార్డులతో పాటు డబ్బులు కూడా దండిగానే వచ్చాయి .
ఈ సినిమా చాలామందికి సినిమా జీవితాన్ని ఇచ్చింది . ప్రముఖ నటీమణి గీతకు , ప్రముఖ నటుడు భానుచందరుకి ఇది మొదటి సినిమాయే . చిరంజీవికి రెండో సినిమా . సినిమాలో దుర్యోధనుడికి మేనల్లుడిగా , మేనమామను ప్రతిఘటించే యువకుడిగా ఎనర్జిటిక్ గా నటించి , మంచి పేరు తెచ్చుకున్నారు . ప్రసాద్ బాబుకి కూడా రెండో సినిమాయే .
ఈ సినిమాలో ద్రౌపది కాని ద్రౌపది పాత్రను వేసిన శోభ తెలుగులో రెండు సినిమాలే నటించింది . ఆ రెండింటిలో ఒకటి ఈ సినిమా . అమాయక గ్రామీణ యువతిగా , దొరగారి చేతిలో భంగపడిన యువతిగా చాలా బాగా నటించింది . ఈ సినిమా అంతా ఆల్మోస్ట్ తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు సమీపంలో ఉన్న దోసకాయలపల్లి గ్రామంలో షూటింగ్ చేయబడింది . సినిమా కధకు చక్కని నేపధ్యం ఈ గ్రామంలో కనిపిస్తుంది .
నిత్యం దొర గారి చేతిలో ఓడిపోయి డబ్బులు సమర్పించుకునేందుకు ఓ పేకాట పిచ్చోడు ధర్మయ్య పాత్ర కూడా ఉంది . కాంతారావు వేసారు . ఇతర ప్రధాన పాత్రల్లో అల్లు రామలింగయ్య , సారధి , ఝాన్సీ , హలంలు నటించారు .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా బాగుంటాయి . కొన్ని బాగా హిట్టయ్యాయి కూడా . పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా అనే అల్లుని మోసే పాట చాలా బాగుంటుంది . నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా పాట మరొకటి . బాగుంటుంది . ప్రసాద్ బాబు , గీతల మీద తోటలో చిత్రీకరించబడింది . బాపు సినిమాలో తోట లేకుండా ఎలా !
సిత్రాలు చేయురో శివుడో శివుడా , ఒరేయ్ పిచ్చి సన్నాసీ , మంచికి చెడ్డకి పోరాటం పాటలు కృష్ణంరాజుతో ఉంటాయి . కదిలిందయ్యో రధము కదిలిందయ్యో దొర గారు చెయి వేస్తే కదిలిందయ్యో పాటతోనే సినిమా మొదలవుతుంది . జయమాలిని మీద కూడా ఓ పాట , డాన్స్ ఉంది కానీ బాపు మార్కు కనిపించదు .
ఈ సినిమా చూడనివారు ఉండరేమో ! తరచూ టివిలో వస్తూనే ఉంటుంది . చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . A decent , artistic , entertaining movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article