.
Subramanyam Dogiparthi ……. ఆనాటి సామాజిక , ఆర్ధిక వ్యత్యాసాలను ఎండకడుతూ వచ్చిన సినిమా ఈ మరోమలుపు సినిమా . అస్పృశ్యత వంటి సామాజిక అంశాల మీద మాలపిల్ల , జయభేరి , బలిపీఠం వంటి సినిమాలు ఈ సినిమాకు ముందు వచ్చినా ఈ మరోమలుపు సినిమా తెలుగు సినిమాలను ఓ చిన్న మలుపు తిప్పింది .
ఆర్ధిక వ్యత్యాసాల మీద జగ్గయ్య , తిలక్ , మాదల రంగారావు వంటి వారు చాలా సినిమాలు తీసారు . శివకృష్ణ , వేజెళ్ళ సత్యనారాయణ కాంబినేషన్ ఒకటి ఈ సినిమాతో ఉద్భవించింది .
Ads
ఈ సినిమాకు ముందు ఒకటి రెండు సినిమాలలో గుర్తింపు రాని , లేని చిన్న చిన్న పాత్రలను వేసిన శివకృష్ణ హీరోగా నటించిన మొదటి సినిమా ఇది . తన మిత్రుడు వేజెళ్ళ సత్యనారాయణని దర్శకుడిగా కూడా పరిచయం చేసాడు . ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావటంతో వీరి కాంబినేషన్లో మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి .
పేరుకు అగ్ర కులమయినా కడు పేదరికంలో తింటానికి తిండి కూడా లేని ఓ గ్రామంలో అర్చకుడి పాత్ర ప్రేక్షకుల్ని కదిలిస్తుంది . ఆ దయనీయ పాత్రలో గుమ్మడి అద్భుతంగా నటించారు . సాంప్రదాయ మూఢాచార సంకెళ్ళలో తనను తాను బంధించుకున్న అర్చక పాత్రకు ఆయనకు బెస్ట్ సపోర్టింగ్ ఏక్టరుగా నంది అవార్డు కూడా వచ్చింది . ఆయన భార్యగా లీలావతి , కుమార్తెగా జ్యోతి గొప్పగా నటించారు .
ఆవేశపరుడిగా , ఆందోళనపరుడిగా , సామాజిక స్పృహ ఉన్న యువకుడిగా శివకృష్ణ హీరోగా మొదటి సినిమాలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు . ఇలాంటి మరెన్నో సినిమాలలో నటించాడు . ఓ బ్రాండ్ అయ్యాడు .
అస్పృశ్యుడి పాత్రలో సాయిచంద్ బాగా నటించాడు . గ్రామాన్ని పీడించే రాయుడిగా నూతన్ ప్రసాద్ , అతనికి దుష్ట సలహాలను ఇచ్చే కరణంగా పి యల్ నారాయణ ఎప్పటిలాగానే చాలా బాగా నటించారు . యన్టీఆర్ కరణం , మునుసబు , పటేల్ , పట్వారీ వ్యవస్థను ఎందుకు రద్దు చేసాడో అర్థం అవుతుంది .
ఈ సినిమాలో డ్యూయెట్లు పాడుకునే జంటగా నరసింహరాజు , గీత ప్రేక్షకులకు రొమాన్స్ పార్టుని అందిస్తారు . వివక్ష సామాజికం మాత్రమే కాదు , ఆర్ధికం కూడా అనే అంశాన్ని నరసింహరాజు పాత్ర ద్వారా చెపుతుందీ సినిమా .
పరుచూరి గోపాలకృష్ణ , బాబీ , వేజెళ్ళ ముగ్గురు కలిసి ఈ కధను తయారు చేసారు . పరుచూరి చురకత్తుల్లాంటి డైలాగులను కూడా వ్రాసారు . సాంప్రదాయం , కుల కట్టుబాట్లు అనే పేరుతో అంటరాని వాడిని తాకినందుకు కుటుంబం మొత్తానికి ప్రాయశ్చిత్తంగా నాలుక మీద దర్భను కాల్చి చేసే అగ్ని సంస్కారం ప్రేక్షకులను కదిలిస్తుంది .
అలాగే సంచార దేవాలయాల పేరుతో తాగుబోతు అర్చకుడు దేవుళ్ళ బొమ్మల్ని రోడ్డు మీదకు తీసుకుని వచ్చి డబ్బు చేసుకునే ప్రయత్నాన్ని కూడా బాగా చూపిందీ సినిమా . ఈరోజుకీ మనం రోడ్ల మీద చూస్తుంటాం . రిక్షాల్లో , బండ్ల మీద , ఆటోల్లో దేవుళ్ళ బొమ్మల్ని పెట్టి జనం దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళని . ఇలాంటి ఎన్నో సున్నితమైన అంశాలను స్పృశించిన సినిమా ఈ మరో మలుపు .
బాధాకరం ఏమిటంటే వందల సంవత్సరాల నుండి మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ కుల వివక్ష , అస్పృశ్యత ఇంకా మనల్ని వదలక పోవటం . నిన్న కాక మొన్న తమిళనాడులో బుల్లెట్ నడుపుతున్నాడని ఓ కాలేజీ కుర్రాడి చేతుల్ని నరికారు . సనాతన ధర్మాన్ని కొందరు ఆషాఢభూతులు , సమాజ విద్రోహులు ఎలా నాశనం చేసారో , చేస్తున్నారో చూస్తుంటే బాధ కలుగుతుంది . మళ్ళా సినిమాలోకి వద్దాం .
సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . ముఖ్యంగా అర్చక పాత్రలో గుమ్మడి పాడే పాట అమ్మా అమ్మా అమ్మా తీయగరాదా తెర తీయగరాదా అనే పాట హైలైట్ . అర్చకుల్లో ఎంతో మంది సంపాదన కొరకే కాకుండా దైవంతో ఎలా ఎటాచ్ అవుతారో బాగా చూపించాడు వేజెళ్ళ .
ఇది విజయం ఘన విజయం పాట కూడా బాగుంటుంది . ఇతర డ్యూయెట్లు కూడా శ్రావ్యంగా ఉంటాయి . గీత హుషారుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . ఇతర పాత్రల్లో తాతినేని రాజేశ్వరి , సాక్షి రంగారావు , ప్రభృతులు నటించారు .
మరో ప్రధాన పాత్ర రమణమూర్తిది . అర్చకుని బావమరిది పాత్రలో హేతుబధ్ధంగా , ప్రాక్టికల్ గా ఆలోచించే ఆలోచనాపరుడిగా , చట్టానికి గౌరవమిచ్చే పౌరుడిగా రమణమూర్తి చాలా బాగా నటించారు . గుర్తింపు వచ్చిన పాత్ర .
కధాబలంతో , గట్టి స్క్రీన్ ప్లే దర్శకత్వాలతో వచ్చిన ఈ సినిమాకు మరో రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి . నూతన దర్శకుడి కేటగిరీలో వేజెళ్ళకు , రెండవ ఉత్తమ చిత్రంగా నిర్మాతలకు నంది అవార్డులు వచ్చాయి . 1982 ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమాకు 43 ఏళ్ళు నిండాయి .
వినిమయ ప్రపంచంలో , స్మార్ట్ ఫోన్ల రంగుల ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న నేటి జనానికి ఈ సినిమా రుచించదేమో తెలియదు . కానీ , సమాజం గురించి ఆలోచించే ప్రతీ బాధ్యత కల పౌరుడు ఓపిక చేసుకుని తప్పక చూడవలసిన సినిమా . A thought provoking movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article