.
విజయవాడలో మా బంధువుల అబ్బాయి ఒకడు టీడీపీకి వీరాభిమాని.. ఎన్టీయార్ పేరు విన్నా బాలకృష్ణ పేరు విన్నా నిద్రలో కూడా జై కొడతాడు !
అంత అభిమానం
అయితే వీడికి ఎన్టీఆర్ తెలుసు బాలకృష్ణ తెలుసు కానీ వాళ్ళకి వీడు తెలీదు కదా ! ఓ రోజు బాలయ్య విజయవాడలో ఏదో కార్యక్రమంలో పాల్గొంటానికి వస్తున్నాడని వీడికి తెలిసింది
బాలయ్యను అట్టహాసంగా రిసీవ్ చేసుకోవటానికి స్థానిక టీడీపీ నాయకులు లారీల్లో అభిమానులను తీసుకెళ్ళటానికి ఏర్పాటు చేశారు.
Ads
అందరు కార్యకర్తలతో పాటు వీడు కూడా లారీ ఎక్కి జై బాలయ్య అంటూ స్లొగన్స్ ఇస్తూ కేరింతలు కొడుతున్నాడు
లారీ సున్నపుబట్టీల సెంటర్ కు రాగానే వేగంగా మలుపు తిరగటంతో వీడు స్లిప్ అయి లారీ నుంచి కింద పడ్డాడు
ఆ పడటం పడటం కాలు ఫ్రాక్చర్ అయ్యింది
తెలిసిన మనిషి వాడ్ని ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడు
దగ్గర్లో ప్రైవేట్ హాస్పిటల్ కు తీసికెళ్తే కాలు ఫ్రాక్చర్ అయ్యింది కాబట్టి అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ చేస్తామన్నారు.
కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్తోమత వాళ్లకు లేదు.
విషయం తెలుసుకున్న మేము ఈ సంగతి అప్పటి తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వంగవీటి మోహన రంగా గారి దృష్టికి తీసుకెళ్లాం !
పైగా వాడు టీడీపీ కార్యకర్త అనీ.. బాలయ్యను రిసీవ్ చేసుకోవడానికి లారీలో వెళ్తూ కాలు జారి కిందపడటంతో కాలు విరిగిందనీ.. ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేదనీ కూడా చెప్పాం.
దానికి వంగవీటి చిరునవ్వుతో “హ్యూమానిటేరియస్ గ్రౌండ్స్ లో సాయం చెయ్యటానికి అతడు ఏ పార్టీ అయితే ఏముంది ? పైగా నా నియోజకవర్గం కూడా… నేను గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మాట్లాడుతా… అక్కడ అడ్మిట్ చెయ్యండి.. ట్రేట్మెంట్ చేయిద్దామ్..” అని చెప్పటమే కాదు, హాస్పిటల్ అధారిటీతో అప్పటికప్పుడు మాట్లాడి ఆ కుర్రాడికి ట్రీట్మెంట్ చెయ్యమని, సర్జరీకి కానీ ఇతరత్రా బయటి నుంచి ఏమన్నా తెప్పించటానికి అవసరమైతే ఖర్చులు ఎమ్మెల్యే ఫండ్ నుంచి రిలీజ్ చేస్తానని చెప్పటంతో ప్రభుత్వ హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేయించుకుని బయటపడ్డాడు !
నాయకుడిగా ఎదగాలనుకునేవాడు శత్రువులను కూడా అభిమానులుగా మలుచుకోగలడు. అటువంటి నాయకత్వ లక్షణాలు వంగవీటిలో పుష్కలంగా ఉన్నాయ్. అందుకే అంతమంది అబిమానులను సంపాదించుకోగలిగారు.
ఆ రోజు నుంచి ఆ కుర్రాడు కూడా వంగవీటి అభిమాని అయ్యాడు ! ఈ విషయం అప్పట్లో చాలామందికి తెలీదు కూడా. ఇప్పుడు ప్రతి చిన్న సాయానికి మన పార్టీ వాడా కాదా అని నిర్దారించుకున్న తర్వాతే ముందుకు వస్తున్న నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఇది !
పైగా చేసిన సాయం గోరంత అయితే దానికి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ కొండంత పబ్లిసిటీ చేసుకునే నాయకులు కూడా ఎక్కువయ్యారు కదా !…… పరేష్ తుర్లపాటి
(…… అంతేకాదు, మాస్ గ్యాదరింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే… తరువాత ఏదైనా జరిగితే ఎవరూ పట్టించుకోరు, దయార్ద్రహృదయులైన ఎవరైనా లీడర్లు చేయూతనిస్తే తప్ప ఆ కుటుంబాలు గాడినపడవు… వైఎస్‌ను మెచ్చుకోవచ్చు, తన స్కీమ్స్ అన్నీ సంతృప్తస్థాయి… తన, పర భేదం ఉండదు ఆ పథకాలకు…)
Share this Article