….. By…… Bharadwaja Rangavajhala………… పాటసారి… వేటూరి
డబ్బింగ్ పాటలు రాయడం చాలా తేలిక అని చాలా మంది అభిప్రాయం. అది వాస్తవం కాదు. డబ్బింగ్ పాటలు రాయాలంటే…అవతల భాష తెలిసి ఉండడంతో పాటు…అనువాదం చేస్తున్న భాష మీద అధికారం ఉండాలి.
ముఖ్యంగా వకాబలరీ తెలిసి ఉండాలి. ఎందుకంటే….లిప్ మూమెంట్ కు తగ్గట్టుగా ఉంటూనే…భావం చెడకుండా రచన సాగాల్సి ఉంటుంది.
Ads
ఈ ఫీట్ చేస్తూనే…కవితాసొగసులు చెదరకుండా చూసుకున్న కవి వేటూరి.
అయితే వేటూరి రాసిన డబ్బింగ్ గీతాలు హిట్ అయి ఉండవచ్చుగానీ … గజిబిజి కాస్త ఎక్కువనే విమర్శ కూడా ఉంది ..
గీతాంజలి తర్వాత మణిరత్నం సినిమాలకు మాత్రమే రాశారనుకుంటారు. కానీ ఆత్రేయ, ఆరుద్ర, రాజశ్రీ అంత విస్తృతంగా కాదుగానీ…తనతో రాయించుకోడానికి వచ్చిన నిర్మాతల్ని మాత్రం నిరాశపరచలేదు.
సఖి చిత్రంలో అలైపొంగెరా…పాటలో కాదలి వేణుగానం కానడ పలికే అని ప్రయోగిస్తారు. కాదలి తమిళ పదం మాత్రమే కాదంటారాయన. పోతన సరస్వతీదేవి గురించి రాసిన తెలుగు పద్యంలో కాదలి కోడలా అనే ప్రయోగం ఉందని సాక్షం చూపిస్తారు.
అంటే ప్రియమైన కోడలా అనే అర్ధంలో వాడారనేది వేటూరి వివరణ. తమిళం, తెలుగు రెండూ ద్రవిడ భాషలే కాబట్టి సారూప్యం సహజమనేది ఆయన అభిప్రాయం.
ఎన్నో ఏళ్లుగా హీరోపై ప్రేమని పెంచుకుని, అతని సంతోషాల్నీ, వేదనల్నీ అన్నిటినీ ప్రేమిస్తూ..అతని ప్రేమ కోసం మౌనంగా సాగించిన సుధీర్ఘ నిరీక్షణ అనంతరం..అతని ప్రేమని పొందిన పరవశంలో… తన్మయత్వంతో హీరోయిన్ పాడే పాట సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో వినిపిస్తుంది. వేటూరి రాసిన డబ్బింగ్ పాటల్లో హంటింగ్ మెలోడీ ఈ గీతం. నిదురే కల అయినదీ వేటూరి రాసిన డబ్బింగ్ పాటే.
గజనీలో కూడా ఆయన రాశారు. కానీ వేటూరి రాసిన డబ్బింగ్ పాటలు ముఖ్యంగా యువ సినిమాలో వచ్చిందా మేఘం లాంటి పాటలూ ఇద్దరులో పాటలూ కాస్త కంగారు పెట్టేస్తాయి.
స్ట్రెయిట్ గీతాల్లోనే ఆయన హాయిగా ఉంటారు …
వేటూరి జర్నలిస్టిక్ పోయిట్ …ఎక్కువ టైమ్ తీసుకోకుండా వేగంగా రాసివ్వడం ఆయన స్పెషాలిటీ …
మల్లాది పింగళి ఆత్రేయల ప్రేరణ తనపై ఉందని చెప్పుకున్న వేటూరి సినిమా మాస్ పాటల్లోకి అందంగా జానపద సొగసు ప్రవేశపెట్టేవాడు.
కొండమీన సందమామా లాంటి అనేక పాటలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజానికి వేటూరి బావా అని పిల్చుకున్న సంగీత దర్శకుడు చెక్కురవర్తి కూడా తన మాస్ బాణీలకు జానపదాల్నే ఊతంగా తీసుకుని కథ నడిపించేశాడు …
వీరి రూట్స్ … అక్కడున్నాయ్ … పల్లెపాటల్లో ఉన్నాయి … అందుకే ఎంతో కొంత మట్టి వాసన కొడతాయ్ … ఆ మట్టి వాసన కొట్టే పాటలేవైనా బతికే ఉంటాయ్ …
కొండ మీన సందమామా అయినా … పుట్టింటోళ్లు తరిమేశారు అయినా సరదాగా ఎప్పటికీ వింటారు … జనం …
నేను మాత్రం పీపుల్స్ ఎన్కౌంటర్ పాటలకు వేటూరిని క్షమించలేను.
అయినా ఏం చేస్తాం….
Share this Article