Sankar G……….. సినిమాలు రిలీజ్ అయ్యాక 50 రోజుల వరకు OTT కి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది. అసలు ఎందుకు 50 రోజుల వరకు ఇవ్వకుండా ఉండాలి… అలాచేస్తే చచ్చినట్టు ధియేటర్ కు వస్తారు అని అంచనా అయ్యిండొచ్చు. వస్తారా… రారు గాక రారు. చాలామందికి ధియేటర్లోనే చూడాలి అనే జిల తగ్గిపోయింది. హీరోలను బాగా అభిమానించే వారి సంఖ్య తగ్గిపోయింది. తమ హీరో స్క్రీన్ మీద కనపడితే చాలు సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు అనేవారి సంఖ్య 2 శాతం ఉండరు. మళ్ళీ వీరిలో కూడా రిపీట్ ఆడియన్స్ ఉండరు. ఇప్పటి యూత్ లో పరిణతి కనిపిస్తూ ఉంది. మానసికంగా ఎదగని హీరోల పిచ్చిగాళ్ళు, కులపిచ్చిగాళ్ళను వదిలేస్తే, హీరోలను పిచ్చి పిచ్చిగా ఆరాధించటం మానేస్తున్నారు. వారు ఇంగ్లీష్ లేదా ఇతర భాషాచిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
సినిమాలు ఎంత సూపర్ హిట్ అయినా మాక్సీమమ్ 20 రోజులకు మించి ఆడవు. 10 రోజుల తర్వాత మెయిన్ ధియేటర్లు తప్ప మిగతా ధియేటర్లలో కలెక్షన్లు ఘోరంగా ఉంటాయి. అసలు నిర్మాతల ఉద్దేశ్యమే ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేసి, అధిక రేట్లకు తోడు, బెనిఫిట్ షోల టికెట్ రేట్ వెయ్యి రెండు వేలు పెట్టి తక్కువ రోజుల్లో రోజుకు యాభై కోట్ల కలెక్షన్లు చొప్పున టాకు బయటికి రాకముందే ఊడ్చి పారేయటమే…
అదే కాకుండా టికెట్ ధరలు కక్కుర్తిపడి పెంచేసుకున్నారు. అతిచేస్తే గతి చెడుతుందన్న విషయం మరిచిపోయారు. పైగా ఏపీ ప్రభుత్వంతో వివాదం వల్ల మీడియాలో రచ్చ రచ్చ చేసుకోవటం వల్ల జనాల్లో టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి అన్న విషయం రిజిస్టర్ అయ్యింది. ధియేటర్లో సినిమా చూడటం దండగమారి ఖర్చు అనే నిర్ణయానికి వచ్చారు. పైగా ఇంట్లో కూర్చుని ఓటిటిలో సినిమా చూస్తూ ఫోన్ వస్తేనో, ఫ్రెండ్స్ వస్తేనో కాసేపు పాజ్ చేసి, మళ్ళీ ఆన్ చేసి చూసుకోవచ్చు. డైలాగ్ అర్ధం కాకపొతే రివైండ్ చేసి మళ్ళీ వినొచ్చు. ధియేటర్ కు వెళ్లకపోతే ఖర్చు సమయం ఆదా అవుతాయి అని గ్రహిస్తున్నారు.
Ads
ఇక OTT కి యాభైరోజులవరకు ఇవ్వకపోతే ఏం చేస్తారు… లాంగ్వేజ్ బాలన్స్ కోసం ఇతర భాషా చిత్రాలను తెలుగు ఆడియో సింక్ చేస్తారు లేదా తెలుగు సబ్ టైటిల్స్ ఆడ్ చేస్తారు. కంటెంట్ బాగున్న తెలుగు చిన్న చిత్రాలను ఇబ్బడిముబ్బడిగా కొని ఆడిస్తారు. యాభై రోజుల కండిషన్ చిన్న నిర్మాతలు అసలు పట్టించుకోరు. ఎందుకంటే వారి సినిమాలకు ధియేటర్లే ఇవ్వరు. బయర్లు ఉండరు. ఒక ధియేటర్లు దొరికినా ఎదురుడబ్బు కట్టి ఆడించుకోవాలి. దీనికన్నా OTT యే బెటర్ అని ఫిక్స్ అవుతారు. కాబట్టి ఈ యాభై రోజుల కండిషన్ మూన్నాళ్ళ ముచ్చటే ఔతుంది. దీన్ని బ్రేక్ చేసేది ముందుగా సురేష్ బాబో, అల్లు అరవిందో అయ్యుంటారు. ఎందుకంటే వీరిది పక్కా కమర్షియల్ మైండ్…
Share this Article