ఎవరి నోటికి ఏది తోస్తే అది రాయడం, కూయడమే ప్రజెంట్ జర్నలిజం ట్రెండ్… రంగూరుచీవాసనచిక్కదనం లేని టీ అసలు టీయే కాదన్నట్టు… పరిపక్వత, పరిణతి, హుందాతనం, కామన్‌సెన్స్ గట్రా ఏమీ లేకపోతే అదసలు వార్తే కాదని ఎవరూ చెప్పలేదు… చెప్పాల్సిన పనిలేదు… ఉదాహరణలుగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన టీవీ వార్తలు, పత్రికల వార్తలు చదివితే చాలు… ఏ పాజిటివ్ లక్షణం లేకపోవడం కాదు, పాచికంపు కొడుతుండటం అదనపు విశేషం…
నిజానికి పెద్దగా సాధనసంపత్తి, శిక్షణ, అనుభవం లేని చాలామంది యూట్యూబ్ న్యూస్ చానెళ్లు నడిపిస్తున్నారు… వాళ్లను ఏదేదో అనాల్సిన పనిలేదు… వాళ్ల రేంజ్ అంతే… మేమేమీ కాకలు తీరిన జర్నలిస్టులం అని వాళ్లు చెప్పుకోరు… ఏదో వాళ్లకు ఉపాధి మార్గం… కానీ టీవీ5, ఏబీఎన్, మహా న్యూస్ వంటి మెయిన్ స్ట్రీమ్ చానెళ్లలో కూడా జర్నలిజం ఇలాగే ఏడిస్తే ఈ సిట్యుయేషన్‌ను ఏమని చెప్పుకోవాలి… (అవి మెయిన్ స్ట్రీమ్ అని ఎవరన్నారు అనే ప్రశ్న దయచేసి వేయకండి…)
Ads
ఆంధ్రజ్యోతి బట్టలు విప్పి బజారులో భజన చేస్తుందని అందరికీ తెలుసు… కానీ ఈనాడు సైతం ఆంధ్రజ్యోతికన్నా దిగువకు జారిపోయింది… ఇదొక విషాదం… టీవీ జర్నలిజం మరీ ఏ స్థాయికి చేరిందంటే… అప్పట్లో టీవీ9లో రుధిరం, పోస్కో, ఆటో స్పై వంటి పదాలు పెద్ద పెద్ద తలకాయల నుంచి విని ప్రేక్షకులు తలలు పట్టుకున్న సంగతి తెలుసు కదా… మహాన్యూస్ అనబడే చానెల్‌లో ఓ పెద్దమనిషి (ఓనర్ అట…) డ్రగ్స్‌ను టాల్కం పౌడర్ అని ప్రస్తావించాడు… దేవుడా… ఇక టీవీ5లో సాంబశివరావు అనే టీవీ ప్రజెంటర్ స్థాయికి ఏ తెలుగు జర్నలిస్టూ చేరుకోలేడు… రాస్తే ఒడవదు, తెగదు అది…
ఇప్పుడు మరీ అరాచకం… ఓ వీడియో కనిపించింది… జైలులో ఉన్న చంద్రబాబును దోమలతో కుట్టించి చంపడానికి కుట్ర పన్నాడట జగన్… ఎక్కడి నుంచో దోమల్ని తీసుకొచ్చి స్లో పాయిజన్ ప్రయోగిస్తున్నారట… బహుశా పాత్రికేయంలో ఎవరూ ఇంతకుమించి ఇప్పటివరకు దిగజారలేదు కావచ్చు… ఏమో, తమ రికార్డును తామే బద్దలు కొట్టడానికి ఇంకా దిగజారడం కూడా వీళ్లకే సాధ్యమేమో… చివరకు యూట్యూబ్ చానెళ్లు కూడా సిగ్గు పడుతున్నాయి ఈ రిపోర్టింగ్ చూసి…
ఆ వీడియో మీద సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు జోరుగా పడుతున్నయ్… బహుశా ఆ దోమల్ని జగన్ పులివెందుల నుంచి తెప్పించి ఉంటాడు, కసిగా కుట్టడానికి అంటూ..! ఇలాంటివి బోలెడు… అంతేనా..? మరో వార్తలో ఏకంగా వంద దేశాలు చంద్రబాబుకు వందనం చేస్తున్నాయట… అంటే వంద దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని..! అతిశయోక్తికే అతి పాఠం నేర్పించడం ఇది… ఓ నాయకుడు జైలులో ఏసీ లేదంటాడు… ఓ సతీమణి ఆయనకు భద్రత లేదంటుంది, అసలు వేడి నీళ్లు ఏవి అనడుగుతుంది… అన్నీ ఉంటే అది జైలు ఎందుకవుతుంది..? అదేమైనా నోవాటెల్ హోటలా..? ఆయన గెస్ట్ కాదు, విచారణ ఖైదీ…
చివరగా… ఈనాడు గానీ, ఆంధ్రజ్యోతి గానీ, టీవీ5 గానీ… లేదా సదరు మహాన్యూస్ గానీ… ఇలాంటి వార్తలతో చంద్రబాబుకు నష్టం చేకూరుస్తున్నారు… చంద్రబాబును జగన్ అన్యాయంగా జైలులో పడేశాడు, ఇదంతా రాజకీయమే అనే కాస్త సానుభూతిని, జాలిని చూపించేవాళ్లు సైతం ఈ వార్తలు విని, చదివి, చూసి… ఆ సానుభూతిని కూడా వదిలేస్తారు… సో, భజనలో క్వాలిటీ ఉండాలి… కీర్తనలో శృతి ఉండాలి… లేకపోతే వాటిని మొరుగుళ్లు అంటారు తప్ప వార్తాకథనాలు అనరు… ఘాటుగా ఉన్నా ఇదే నిజం… నిష్ఠురంగా ఉన్నా సరే…!!
Share this Article