రచయితలారా మీరెటు వైపు అంటూ 1970 లో వినిపించిన ప్రశ్న 53 ఏళ్ళ క్రితం సాహిత్యంలో ఓ సంచలనం . అప్పుడు నేను ఇంకా స్కూల్ లో కూడా లేను కానీ ఆ ప్రశ్న గురించి ఆ తరువాత కూడా చాలాసార్లు చదివాను . అప్పటి వివాదం , అప్పటి చర్చ లోతుల్లోకి వెళ్ళలేను కానీ .. ఈ మధ్య వచ్చిన సినిమా పాట ఆ వైపు నుంటావా ? ఈ వైపు నుంటావా అని రంగస్థలంలో రాం చరణ్ ప్రశ్నకు మూలం ఈ ప్రశ్ననే కావచ్చు . పైకి ప్రశ్నలానే ఉన్నా అందులో ఒక రకమైన బెదిరింపు కూడా ఉంది అనిపిస్తోంది . విప్లవ రచయితల సంఘం రచయితలారా మీరెటువైపు అని అడిగిన ప్రశ్నలో మా వైపున ఉంటే ఓకే లేకుంటే అంతే అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ చదువు చదివిన నాలాంటి వ్యక్తికి అనిపిస్తోంది . రచయితలు అంటే కొందరు అటు కొందరు ఇటూ అన్నట్టు , మరి కొందరు ఎటో తెలియనట్టు ఉండడం వల్ల అదో సంచలనం , సమాధానం కావలసిన ప్రశ్న . మరి జర్నలిస్ట్ లారా మీరెటు అంటే ?
********************
జర్నలిస్ట్ లారా మీరెటువైపు అని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లే కాదు , పత్రికలు చదివే పాఠకులు , ఛానల్స్ చూసే ప్రేక్షకులు కూడా క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు . కొందరు మేం తటస్థులం అని నటిస్తుంటారు . ఓ నిమిషం మాట్లాడితే ఏ పార్టీ తటస్థులో తేలిపోతుంది . తెలంగాణకు చెందిన ఓ ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ బీజేపీల మధ్య పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు . ఆ ఛానల్ ఓనర్ ఎటు మారితే ఛానల్ అటు మారుతుంది .
Ads
జర్నలిస్ట్ తనకు ఇష్టం వచ్చినట్టు రాస్తారు అనుకుంటాను కానీ యజమాని ఇష్టం వచ్చినట్టు రాయాలి , రాస్తారు . కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి , జీతాలు ఇచ్చి మీడియా సంస్థలను నడిపేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకో , ప్రజల స్వేచ్ఛ కోసమో కాదు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 1950 ప్రాంతంలోనే సబ్బుల వ్యాపారం ఎలానో మీడియా వ్యాపారం కూడా అంతే , దీనికి పెద్దగా విలువలు అంటగట్టకండి అన్నారు . మీడియాది వ్యాపారం అని జర్నలిస్టులకు , యజమానులకు , సంపాదకులకు , యూనియన్ నాయకులకు తెలియదా ? అంటే పాఠకులకే తెలిసినప్పుడు వారికి తెలియకుండా ఎందుకు ఉంటుంది . దేవతా వస్త్రాల కథలా అందరూ నటించేస్తుంటారు . గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు మీడియా మొత్తం వివిధ పార్టీలకు అనుబంధంగా పని చేస్తోంది . యజమాని ఏ పార్టీకి అనుబంధంగా పని చేస్తే ఆ మీడియా జర్నలిస్ట్ తనకు నచ్చినా నచ్చకపోయినా ఆ పార్టీకి ప్రయోజనం కలిగించే కోణంలోనే పని చేయాలి .
95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అనేక వార్తల్లో , వ్యాసాల్లో నేను ఆంధ్రభూమిలో వెన్నుపోటు అని రాశాను . ఆ వెన్నుపోటులో మీడియా పాత్ర కూడా ఉంది . వారి పత్రిక తరపునే కాకుండా చిత్తశుద్ధితో వెన్నుపోటుకు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఈ మధ్య ఒక వ్యాసంలో 95 సంఘటన ప్రస్తావిస్తూ వెన్నుపోటు అని రాశారు . అది వెన్నుపోటు అని గ్రహించడానికి ఆ జర్నలిస్ట్ కు పాతికేళ్ళు పట్టిందా ? అంతే కాదు, 95లో వెన్నుపోటుకు సహకరించిన మీడియాలో ఉన్నారు . పాతికేళ్ల తరువాత వెన్నుపోటు అని రాసినప్పుడు జగన్ మీడియాలో ఉన్నారు .
నేను వెన్నుపోటు అని రాశాను అనీ, స్వతంత్రంగా రాశాను అనీ కాలరెగరే ఓ జర్నలిస్ట్ మిత్రుడు అది మీ పత్రిక పాలసీ కాబట్టి అలా రాయగలిగావు అంతే తప్ప అది మీ మీడియా ఇచ్చిన స్వేచ్ఛ కాదు అన్నాడు… ఆలోచిస్తే అతని వాదనలో కూడా నిజం ఉంది అనిపించింది . ఒక్కోసారి యజమాని జర్నలిస్ట్ ఒకే కోణంలో ఉంటే అదృష్టమే . బాబు వెన్నుపోటు సమయంలో మేనేజ్ మెంట్ , ఎడిటర్ , నేనూ వెన్నుపోటు అనే భావించడం వల్ల రాతలకు ఇబ్బంది కలుగలేదు .
2001 తెలంగాణ ఉద్యమం వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది . నేనేమో తెలంగాణ కోరుకున్న వాడిని , యాజమాన్యం కొన్ని కారణాల వల్ల మనం సమైక్యాంధ్ర అంది . ఎడిటర్ తెలంగాణ అనే మాట వినడానికే ఇష్టపడని వారు . ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎడిట్ పేజీలో వారం వారం రాసే పొలిటికల్ కాలంలో ధైర్యం చేసి తెలంగాణ ఎందుకు అవసరమో రాశాను . అది పబ్లిష్ అయ్యాక ఆఫీస్ లో తెలంగాణ మిత్రులు మెల్లిగా ఏంటీ మన పత్రికలో తెలంగాణ గురించి రాశావ్ అని మెల్లగా అభినందించి వెళ్లేవారు …
ముందుగా ఊహించినట్టుగానే ఎడిటర్ నుంచి ఫోన్ .. అక్షింతలు .. ఇంకోసారి నాకు చూపకుండా పంపవద్దు అని వార్నింగ్ .. నిజానికి నేను అంతకన్నా ఎక్కువ నష్టానికి మానసికంగా సిద్దమై ఉన్నాను . ఉద్యమం ఉదృతం అయ్యాక తెలంగాణ గురించి రాసుకొనే అవకాశం లభించింది . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం రాస్తే నేను తెలంగాణ కోసం రాశాను . పత్రికల్లో కొంత మేరకు యాజమాన్యం స్వేచ్ఛ ప్రసాదించినా , మాకు వద్దంటే వద్దు అని ఎడిటర్ , యజమాని ఏం కోరుకుంటే అదే రాద్దాం అనుకునేవాళ్లనూ చూశాను . 95లో వెన్నుపోటు గురించి రాసే అవకాశం భూమిలో ఉన్నా చాలా మంది ఉపయోగించుకోలేదు . అలానే తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక రాసే అవకాశం ఉన్నా స్వేచ్ఛను ఉపయోగించుకోని వారు ఉన్నారు . ఎడిటర్ పేపర్ కు తానే ఓనర్ అన్నట్టు వ్యవహరించేవారు .. ఆంధ్రభూమి యాజమాన్యం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు . దీనివల్ల కొంత వరకు రాయాలన్నది రాసే అవకాశం లభించింది …
*****************
రాష్ట్ర విభజన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని విధంగా మీడియా రాజకీయ పార్టీలను మించి రాజకీయ అభిమానం చూపుతోంది . బాబు అరెస్ట్ తరువాత ఛానల్స్ లో కొందరు యాంకర్లు మాట్లాడుతున్న మాటలు పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడలేరు . పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు సైతం యాంకర్ల పార్టీ భక్తి చూసి ఈర్ష్య పడేట్టుగా ఉంది . రెండు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉంది . కొన్ని మీడియాలను ఏకంగా పార్టీలే నడుపుతుంటే , కొన్ని మీడియాలేమో పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి . సొంతంగా పార్టీలు నడిపే మీడియా పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది . పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా పార్టీ మారదనే నమ్మకం లేదు . మారుతూ ఉంటుంది .
రాజకీయ పార్టీల్లో , మావోయిస్టుల్లో కోవర్ట్ లు ఉన్నట్టే మీడియాలో కూడా కోవర్ట్ లు ఉంటారు . ఒక పార్టీ మీడియాలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ కి సమాచారం చేరవేస్తారు . ఆ మధ్య ప్రభూత్వ ఉద్యోగులను ఓ మీడియా యజమాని బాబు ముందే తిడుతుంటే రికార్డ్ అయి బయటకు వచ్చింది ఇలానే . ఆ వీడియో టీడీపీకి నష్టం కలిగించింది .
***********
జాతీయ స్థాయిలో కొన్ని మీడియాలను బీజేపీ, మరి కొన్నింటిని కాంగ్రెస్ బహిష్కరించింది . దానితో కాంగ్రెస్ సానుభూతిపరులు అంటూ ఎవరో ఒకరిని డిబేట్ లో కూర్చోబెట్టి చర్చ రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు . రాహుల్ గాంధీ అదానీపై ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే , దానిని ప్రశ్నలతో రసాభాస చేయమని ndtv ఒక జర్నలిస్ట్ ను పంపితే , అతను నా వల్ల కాదు అని రాజీనామా చేశారు . మేనేజ్ మెంట్ చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగం లేదంటే బయటకు వెళ్ళాలి .
సామాజిక మాధ్యమాల పుణ్యమా ? అని మీడియాలోని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి . ప్రతి మీడియాకు రాజకీయ అనుబంధం ఉంది .. కొందరు అనుబంధం కోసం పార్టీలకు దరఖాస్తు చేసుకున్నా వీరికి అంత సీన్ లేదు అని పార్టీలు పట్టించుకోవడం లేదు . గతంలో ఓ కొత్త మీడియా వస్తుందీ అంటే ఎడిటర్ ఎవరు ? అనే ప్రశ్న వినిపించేది .. ఇప్పుడు ఓనర్ ఏ పార్టీ అనే ప్రశ్న వినిపిస్తుంది …. – బుద్దా మురళి
Share this Article