Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భాగ్యనగరమే ఒక షాపింగ్ మాల్… అద్దాల అంగడి మాయ…

December 3, 2024 by M S R

.

భాగ్యనగరమే ఒక షాపింగ్ మాల్… అద్దాల అంగడి మాయ

ఒక ఆదివారం మధ్యాహ్నం ఊరికే అలా ఎటైనా వెళదాం అన్నాను నేను మా ఆవిడతో. యాదగిరిగుట్టకు వెళదాం అంది. సెలవురోజు యాదగిరిగుట్టకు వెళ్లేంత భక్తి ఉన్నా… ధైర్యసాహసాలు మాత్రం లేనివాడిని అని నా అశక్తతను స్పష్టంగా చెప్పాను.

Ads

నిజమేనని… దైవదర్శనానికి పైరవీలు చేయలేని నా అశక్తతకు మా ఆవిడ నిట్టూర్చింది. దుర్గంచెరువు దగ్గర పేరుమోసిన షాపింగ్ మాల్ కు వెళదాం ఎలాగూ ఇంటికి కొనాల్సిన ఏవో సరుకులు కూడా ఉన్నాయి కదా! అన్నాను. సరేనంది. బయలుదేరాము.

ముప్పయ్యేళ్ళకు పైబడి తిరుగుతున్న హైదరాబాదే. బహుశా ఈమధ్య కొన్నేళ్ళుగా ఆ మాల్ కు వెళ్ళకపోవడంతో పార్కింగ్ దగ్గర నుండే కష్టాలు చెప్పిరావడం మొదలయ్యాయి. భారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగలడే కానీ బయటికి రాలేడు.

మేము వెళ్లాల్సిన మాల్ వారిదే పక్కన ఎస్ఈజెడ్ ఉంది. ఆదివారం అక్కడ కార్యాలయాలకు సెలవు కావడంతో, మాల్ కు ఉన్న సువిశాల పార్కింగ్ ఫ్లోర్లు నిండిపోవడంతో ఎస్ఈజెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ భూగర్భంలో పార్కింగ్ కు ప్రయివేటు సెక్యూరిటీ వారు బాధ్యతగా దారిచూపారు.

మహాభారతంలో అభిమన్యుడి పద్యాలను మననం చేసుకుంటూ… ఒక గంట క్యూ తరువాత నా కారుకు పార్కింగ్ చోటు దొరికింది. కారెక్కడ పార్క్ చేశానో అది ఏ నంబరో ఎలాగూ మరచిపోతాము కాబట్టి సెల్ ఫోన్ తో ముందుజాగ్రత్తగా ఫోటో తీసుకున్నాను.

అక్కడినుండి సరిహద్దు దాటబోయిన శరణార్థులను పట్టుకుని క్యూలో శరణార్థి శిబిరాలకు సైనికులు తరలించినట్లు మాతోపాటు అనేకమందిని మేమెళ్లాల్సిన మాల్ లోకి తరలించారు. అక్కడ ఎక్కడా బోర్డుల్లేవు. తప్పిపోయేవారు తప్పిపోతున్నారు.

“మన ఇద్దరి దగ్గరా సెల్ ఫోన్లు ఉన్నాయిలే! తప్పిపోయినా మళ్ళీ కలుసుకోగలం!” అని మా వెనుక ఒక యువజంట అనుకోవడం మాకు వినిపించి… మన పరిస్థితీ సేమ్ టు సేమ్ అన్నాను నేను మా ఆవిడతో.

ఈగ ఇల్లలుకుతూ తన ఇంటిపేరు మరచిపోతుంది. ఒక కాంప్లెక్స్ నుండి మరో కాంప్లెక్స్ లోకి అర కిలో మీటర్ నడిచి… అనేక లిఫ్ట్ లు, లెక్కలేనన్ని ఎస్కలేటర్లు ఎక్కేసరికి మేము ఏమి కొనడానికి వెళ్ళామో మరచిపోయాము. ఎక్కడ చూసినా జనమే జనం. కూర్చోవడానికి చోటు లేదు. నిలుచోవడానికి వీల్లేకుండా తోసేస్తూ ఉంటారు. మన ప్రమేయం లేకుండా అటో ఇటో ఎటో వెళ్ళిపోతూ ఉంటాం.

ఏమి కొనాలో ఎప్పుడో మరచిపోయాము కాబట్టి ఏమీ కొనకుండా తిరుగుతూ అలసిపోయాము. అయిదవుతోంది. టీ తాగాలనుకున్నాం. పై అంతస్థు నిండా ఫుడ్ కోర్టులే. పాతిక స్టాళ్లు దాటినా టీ ఎక్కడ దొరుకుతుందో తెలియలేదు. చివరికి ఒక చాయ్ పాయింట్ దొరికింది.

కూర్చోవడానికి మ్యూజికల్ చైర్ ఆటలా ఉంది పరిస్థితి. ఒక టేబుల్ ఖాళీ కాగానే అమాంతం జంప్ చేసి మా ఆవిడ రెండు కుర్చీలను దొరకబుచ్చుకుంది. ఆదిలాబాద్ అడవిలో పులినుండి భర్తను రక్షించుకున్న భార్య ధైర్యసాహసాలకు తోడుగా ఇలాంటి చిన్న చిన్న సాహసాలను కూడా ప్రస్తావిస్తే పెద్ద తప్పు కాదని అనుకుంటూ కాళ్ళు లాగుతుండడంతో కుర్చీలో కూర్చున్నా.

సాయంత్రం అయిదప్పుడు అన్నం తింటున్న కుటుంబాలు; ఒక ఐస్ క్రీము కప్పు కరిగిపోయేలోపు తినకుండా స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటున్న ప్రేమపక్షులు; రెండు మూడేళ్ళుగా ఉపవాసముండి అప్పుడే ఉపవాసదీక్ష విరమిస్తుండడం వల్ల ప్లేట్లు పట్టనంత ఆహారం పేర్చుకుని కుంభకర్ణుడు సిగ్గుపడేలా తింటున్న ఆహారదీక్షాపరాయణులు…

ఇలా చుట్టూ ఎటు చూస్తే అటు ఆహారసంక్షోభమేదో తాండవిస్తున్నట్లు అనిపించింది. తలవంచుకుని మసాలా చాయ్ తాగి… కాంప్లెక్స్ దిగడానికి లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. లిఫ్ట్ పైకి వెళ్ళినా… కిందికి వెళ్ళినా అందులో ఇంకొకక్కరికి కూడా చోటు లేదు. కిక్కిరిసిన జనం. మెట్లెక్కడ ఉంటాయని అడిగితే… ఆ సెక్యూరిటీ మహిళ అడుక్కునేవారికి నిర్లక్ష్యంగా చెప్పినట్లు చేత్తో చూపించింది.

అన్ని అంతస్థులు మెట్లు దిగి… కార్ పార్క్ చేసిన మరో కాంప్లెక్స్ లోకి వెళ్ళబోతే వర్షం. తడవడమా! నిరీక్షించడమా! ఇపుడేదీ కర్తవ్యం? అని గొణుక్కుంటూ ఉంటే ఇక్కడి నుండి అక్కడికి వెహికిల్ షటిల్ సర్వీస్ ఉందని ఎక్కించారు.

అక్కడికెళ్ళి సెల్ ఫోన్లో ఏ సెల్లార్ స్తంభం దగ్గర పార్క్ చేశామో ఫోన్లో ఫోటో చూసి కారును గుర్తు పట్టగానే… పోయిన కారు దొరికినంత ఆనందం పొంగుకొచ్చింది. అక్కడినుండి ఎగ్జిట్ మరింత అవమానకరంగా ఉంది. వచ్చినదారి కాకుండా ఎస్ఈజెడ్ అంతా తిప్పి ఎక్కడో అవుట్ గేట్ పెట్టారు.

ఆ గేట్లో నుండి వెళితే వచ్చిన రోడ్డులో నేను కోరుకోని హైటెక్ సిటీ కనపడింది. మళ్ళీ చుట్టూ తిరిగి హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదుగా ఇంటిదారి పట్టాము. అప్పుడు అసలెందుకు ఇంటి నుండి బయలుదేరామో గుర్తుకొచ్చింది. అలవాటైన ఒక కిరాణా షాపుకెళ్ళి సరుకులు కొనుక్కుని చీకటి పడుతుండగా ఇల్లు చేరాము.

నాకిలా జరిగిందని… అందరికీ ఇలాగే జరిగి ఉంటుందని నేననుకోవడం లేదు. ఇలాగే జరగాలని కోరుకోవడం లేదు కూడా.

హైదరాబాద్ ఈజ్ రైజింగ్.
హైదరాబాద్ ఈజ్ షైనింగ్.
ఆ మిరుమిట్ల దీపపు క్రీనీడల్లో వినిపించే ఇలాంటి దారితెలియని కథలకు నిలువనీడ ఉండదు!

మనల్ను మనం మరచిపోవాల్సిన చోట్లకు వెళ్ళడం వరకే మన పని! ఆపై మనం ఎవరో ఆడించే బొమ్మలం!

“సంతలో తప్పిపోయిన పిల్లాడు తల్లిదండ్రుల కోసం గుక్కపెట్టి ఏడ్చినట్లు”- అని తెలుగులో ఒక సామెత. ఇక్కడ సంతలో తప్పిపోయిన తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏడుస్తున్నారు. సామెతలో “తప్పిపోయినవారు” మారారు తప్ప ఏడుపు మారలేదు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions