Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా…
అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా…

May 19, 2024 by M S R

“ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా…
ఇప్పుడు రాత్రి
అర్ధ రాత్రి
నాకేం తోచదు
నాలో ఒక భయం
తెల్లని దళసరి మంచు
రాత్రి చీకటికి అంచు
దూరంగా పక్క డేరాలో కార్పోరల్ బూట్స్ చప్పుడు
ఎవరో గడ్డి మేట నుంచి పడ్డట్టు –
నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక
చచ్చిన జీవుల మొరలా వుంది…
పోదు నాలో భయం-
మళ్ళీ రేపు ఉదయం
ఎడార్లు నదులూ అరణ్యాలు దాటాలి
ట్రెంచెస్ లో దాగాలి
పైన ఏరోప్లేను
చేతిలో స్టెన్ గన్
కీయిస్తే తిరిగే అట్ట ముక్క సైనికులం

మార్చ్!
వన్ టూ త్రీ షూట్ డెడ్ ఎవడ్?
నువ్వా నేనా?
కేబుల్ గ్రాం యిప్పించండి కేరాఫ్ సో అండ్ సో
(మీ వాడు డెడ్)
సృహతప్పిన ఎనెస్తిషియాతో
వెన్నెముక కర్రలా బిగిసింది
యుద్ధం యుద్ధం…
లిబియాలో బెర్లిన్లో స్టాలిన్ గ్రాడ్ లో
స్వార్థం పిచ్చి కుక్కలా పెరిగింది…
నేనిది వరకటి నేను కాను
నాకు విలువల్లేవు
నాకు అనుభూతుల్లేవు
చంపడం… చావడం
మీసం దువ్వడం లాంటి అలవాటయ్యింది
కనిపించే ఈ యూనిఫారం క్రింద ఒక పెద్ద నిరాశ, అనాగరికత బ్రిడ్జీ క్రింద నది లాగా రహస్యంగా వుంది

వదల లేని మోపు ఊబిలాగా వుంది
నేనంటే నాకే అసహ్యం
అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను
ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు…
తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో!
నిన్ను చూస్తానో?
ఎన్నాళ్ళకి? ఎన్నాళ్ళకి?
కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య
ఒక యుగంలా అడ్డు పడింది
ఇంక సెలవ్ మై డియర్!
నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా
అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా నిలబడ్డాడు …
మళ్ళీ జవాబు వ్రాయ్ సుమీ!
ఎన్నాళ్ళకో మరీ
సెలవ్! అబ్బా! చలి!
చలి గుండెల మీద కత్తిలా తెగింది
నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది”.

Ads

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు ఎనభై ఏళ్ల కిందట దేవరకొండ బాల గంగాధర తిలక్ (1921-1966) రాసిన కవిత ఇది. నాలుగు పదుల వయస్సు మాత్రమే బతికి తన అక్షరాలను వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో ఆడుకునే అమ్మాయిల్లా తీర్చి దిద్దినవాడు తిలక్. కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం- అని శ్రీ శ్రీ అంతటి వాడు పొంగి పరవశించిన కవిత తిలక్ ది. తెలుగు లేఖా సాహిత్యంలోనే ఆణిముత్యంలాంటి కవిత ఇది. ఒకప్పుడు తిలక్ రాసిన నీవు లేవు నీపాట ఉంది…. ఈ సైనికుడి ఉత్తరం కవితలు చదవనివారు అసలు ఉండేవారే కాదు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశం కోసమో, ఏ దేశంతోనో, ఎక్కడో యుద్ధం చేసే మన సైనికుడి మానసిక సంఘర్షణను తిలక్ ఈ కవితలో ఒక డాక్యుమెంటరీ కంటే అద్భుతంగా రికార్డు చేశాడు. ఆ మధ్య క్రిష్ చక్కగా తెరకెక్కించిన కంచె సినిమా కథకు మాతృక ఈ కవితే. తెలుగు వచన కవితలో శిఖరాయమానమైన కవిత ఇది. ఇదే ఇంగ్లీషులో ఉండి ఉంటే ప్రపంచ అత్యుత్తమ కవితల్లో ఒకటి అయి ఉండేది. అలా కాలేదని బాధపడాల్సిన పని లేదు. ఒక తెలుగు కవి భాషాతీతంగా ప్రపంచ సైనికులందరికీ భార్యకు రాసుకోవాల్సిన ఉత్తరం రాసి పెట్టిన కవిత ఇది.

లేహ్ లో భారత మిలటరీ వారు నిర్వహిస్తున్న హాల్ ఆఫ్ ఫేమ్ ప్రదర్శనశాలకు వెళ్లి బయటికి వచ్చాక దేవరకొండ కవితా సైనికుడు నన్ను ఆవహించాడు. అనితర ధైర్య సాహసాలకు, అత్యుత్తమ సేవలకు, యుద్ధంలో వీరోచిత త్యాగాలకు మరణానంతరం పొందిన మహా వీర చక్ర, పరమ వీరచక్ర కథలను వరుసగా చదువుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగి ఎదురుగా దృశ్యాలు మసకబారాయి. గొంతు బొంగురుపోయి మాట పెగల్లేదు. ఆ వరుసలో కార్గిల్ వీరుడు పద్మపాణి ఆచార్య, గాల్వన్ లోయ వీరుడు సంతోష్ బాబు త్యాగాలను చదువుతున్నప్పుడు గుండె మెలిపెట్టినట్లయ్యింది. పరమవీర చక్ర యాదవ్ కథనం చదివాక కాసేపు అంతా శూన్యంగా తోచింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల వివరాలతో పక్కనే వందల స్మృతి ఫలకాలతో ఒక నివాళి ప్రదేశం ఏర్పాటు చేశారు.

మనం అనుభవించే నిర్నిరోధమైన స్వేచ్ఛ వెనుక ఎందరి సైనికుల ప్రాణాలు గాలిలో కలిశాయో!
మనం ఇళ్లల్లో గుర్రుపెట్టి హాయిగా పడుకునే నిద్రకు ఎన్ని లక్షల సైనికుల కళ్లు నిద్రను త్యాగం చేశాయో!
దోమకాటుకే నైతిక బాధ్యతగా ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండు చేసే మనకు… మైనస్ నలభై డిగ్రీల కార్గిల్, సియాచిన్ కొండల మంచులో మంచుగా గడ్డ కట్టుకుపోయే సైనికుల కష్టం ఎలా తెలుస్తుంది?
అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన చోట రాత్రి పగలు తిరుగుతూ డ్యూటీ చేసే సైనికులు సజీవంగా, నిలువుగా ఇంటికి తిరిగి వచ్చినా… జాతీయ పతాకంగా రూపాంతరం చెంది పెట్టెలో అడ్డంగా తిరిగి వచ్చినా…వారి వెనుక భద్రంగా మిగిలి ఉన్నది మనమేనన్న స్పృహ మాత్రం మనకు ఉండి తీరాలి. లేదంటే మనకు మనుషులన్న పేరు తీసి…ఇంకేదో పేరు పెట్టాలి. -పమిడికాల్వ మధుసూదన్       9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions