Sampathkumar Reddy Matta…. వైరుబుట్టల విద్య
~~~~~~~~~~~~
డెబ్బయిలల్ల ఎనుబయిలల్ల
వైరు బుట్ట, ఇంటింటికి సరికొత్త వస్తువ.
అంతకుముందు మేరోళ్ల మిషినుకాడ
కుప్పలువడ్డ రంగురంగుల గుడ్డముక్కలు
బిల్లలుబిల్లలు కత్తిరిచ్చి చేసంచులు కుట్టేది.
పయినం దుకాణం అంగడి అన్నీటికి బట్టసంచే.
వైరుబుట్టలు కొత్తగ వచ్చి, చేసంచుల చిన్నబుచ్చినై.
~•~•~•~•~•~
మా ఊరు కరీంనగరుకు పక్కపొంటే, కీకెపెట్టు దూరం.
సినిమాలు, దుకాండ్లు, ఫోటువలు, బట్టలు, వస్తువలు
అన్నిటికి అందిపుచ్చుకున్న పట్టణపు అలవాట్లే ఉంటుండే.
యుక్తవయసున్న మగపిల్లలేకాదు, ఆడపిల్లలది అంతేవేగం.
ఆటగాడు వేటగాడు సినిమాలు మొదటి షోలు చూసే ట్రెండు.
పట్టణపు అలవాట్లు చదువులు వేషభాషలు మాత్రమేనా,
కుట్లు అల్లుకాలు పోతలు కొత్తవస్తువలు తయారుజేసుట్ల
మా ఊరు ఆడపిల్లలది చుట్టాల బలుగంలనే ఓ పెద్ద ఖదర్.
ఆ చేతిపని వన్నెలన్నిటికి వన్నెవంటిది, వైరుబుట్టల అల్లుకం.
నాలుగైదురకాల రంగుల వైరుకండెలు తెచ్చి, మొదలువెడితే
రెండోరోజు మాపటికే ఎంతపెద్ద వైరుబుట్టయినా తయారయేది.
మా అక్కలు బుట్టలల్లేటప్పటికి మా కత్తంత నాలుగయిదేండ్లది.
ఆ అల్లుకం చూసి, మాక్కొద్దిగ వైరివ్వుమని చిన్నచిన్న ముక్కలు
ముందటేసుకోని అల్లుడు నేర్చుకునుటానికి ఆరాటపడుదుము.
ఆక్కూరలు కట్టలు కట్టుటానికి రోజూ ఈతకమ్మలు తెచ్చేవాళ్లు.
చేనుకాడికివోతె తాటి బొత్తలల్ల ఆకు కోసియ్యిమని హఠం చేసేది.
ఎక్కడేమిలేకుంటె పెరట్ల ఉల్లాకులు తెంపుకోని అల్లుకం ప్రాక్టీసు.
ఎట్లయితేంది నాకుసుత జెప్పన్నే వైరు అల్లుడు చెయితిరిగింది.
కొలుతదీసి వైరు కత్తిరిచ్చుడు, కలర్ల సెలెక్షను, బుట్టకు అడుగు
మొదలువెట్టి, చేతికిస్తే ఇగ బుట్టలల్లుట్ల అన్నిటిమర్మం తెల్సినా
బుట్టకు చేతులు లేదా చేర్లు అల్లుడుపని కొద్దిగ అంతుచిక్కలే.
చేర్ల అల్లిక డిజైన్లు రెండురకాలు, రెండూ ఎడుమచెయి వాటమే.
ఎంత తిప్పలవడ్డా చేర్లు అల్లుడు రాకముందే, అక్క పెండ్లయింది.
మాకోసం అక్కలు ఇష్టంగ అల్లిచ్ఛిన చిన్నారి ఆటబుట్టలకు తోడు
ఆ వైరు, ఈ వైరు అన్నిగలిపి చానరోజులు బుట్టనింపి దాచుకున్న.
తనకు వైరు బుట్టలు అల్లుడు వస్తదని అత్తగారి ఊర్ల తెలిసిపాయె.
ఉన్నవైరూ, పాత బుట్టల రిపేర్ల కోసమని అక్కనే తీస్కుని పోయింది.
అక్కడితోటి వైపు బుట్టల అల్లుకం.. శాశ్వతంగ కనుమరుగయింది.
ఇదీ.. నేను బడిబాట పట్టకముందు బుట్టచుట్టు అల్లుకున్న యాది.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article
Ads