A. Saye Sekhar………… #సీఎంకావాల్సినోడు ఇది డిసెంబర్ మూడో వారం 1995 లో జరిగిన సంఘటన… ఎల్యీ రావు గారని ఓ పెద్దమనిషి ఓ మధ్యాహ్నం లక్డీకాపూల్ ఇందూ హోటల్ పేవ్‌మెంట్ మీద నిలబడున్నారు. నేనూ, మిత్రుడు వై సూర్యప్రకాష్ (అప్పట్లో ఆంధ్రభూమి బ్యూరో చీఫ్) కార్ అక్కడ పార్క్ చేసి దిగాం. వెంటనే సూర్యప్రకాష్ ఎల్యీ రావు గారిని ఇంటి పేరుతో సహా పిలిచి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కుశలప్రశ్నలు వేసీ… ఏంటి, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా అనడిగి, ఆయన ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్ళడానికి ఆటో కోసం చూస్తున్నారని తెలుసుకున్నారు.
మన సూర్యప్రకాష్ గారికి కాస్త వెటకారం పాళ్ళు ఎక్కువ. నన్ను చూపించి సాయి శేఖర్, డెక్కన్ క్రానికల్ సీనియర్ కరస్పాండెంట్, తెలుసా అనడిగారు. ఆయన అమాయకం గా తెలీదు అన్నారు. అంతే …”సాయి శేఖర్ తెలీదా ? Deccan Chronicle published simultaneously from Secunderabad, Visakhapatnam and Vijayawada, volume, issue, price, headline, కింద రోజూ By A Saye Sekhar అని వచ్చే బైలైన్ ఈయనదే. తెలీదా ?” అంటే, ఆయన సిగ్గు పడిపోయి “సారీ అండీ. గుర్తుపట్ట లేదు” అన్నారు. నేనే కల్పించుకుని పర్లేదు లెండి, నేనేం పెద్దవాణ్ణి కాదు అని ఆపాను.
వెంటనే సూర్యప్రకాష్ గారు నన్నుద్దేశించి “సాయీ, నీకు ఎల్యీ రావు గారు తెలుసా. ఒక టర్మ్ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఒక దశలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పేరు సీరియస్ గా పరిశీలించారు ఇందిరా గాంధీ. ” అని ఆ పెద్దమనిషి వేపు తిరిగి “ఎప్పుడండీ రావు గారూ? చెన్నారెడ్డిని దింపి అంజయ్యని చేసినప్పుడా, భవనం వెంకట్రాంని దింపి కోట్లని చేసినప్పుడా?” అన్నారు.
Ads
ఆయన మళ్ళీ సిగ్గుపడిపోయి, “అంజయ్య గారు దిగిపోయి భవనం వెంకట్రాం అయినప్పుడు, మా జిల్లా నుంచి నా పేరు కూడా వచ్చింది,” అని సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నిజానికి అతని పేరేమీ పరిశీలనకి రాలేదు. ఒక్కసారే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సూర్యప్రకాశ్ గారు ఆపడుగా… “చూశావా సాయీ. ఎల్యీ రావుగారు నిగర్వి. సీఎం కావాల్సిన వాడు … ఆటో కోసం … పేవ్మెంట్ మీద…” అన్నాడు.
ఇంతలో ఓ ఆటో వస్తే ఆపి “ఇదిగో రావు గారు. పెద్దమనిషి. ఎక్కడ దిగుతానంటే అక్కడే దింపు. డబ్బులిచ్చేస్తారు” అని ఆ ఆటో ఆయనకి చెప్పి, నన్ను భోజనానికి తీసుకెళ్ళాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒకాయన నేను ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా చాలా సార్లు వచ్చినా వదిలేశాను అని చేస్తున్న క్లెయిం మీద కొన్ని సెటైర్లు కనిపిస్తేనూ … (ఈమధ్య జర్నలిస్టుల జ్ఞాపకాల నెమరేత పాపులర్ ట్రెండ్ కదా… అందుకని ‘ముచ్చట’లో ఈ పాత పోస్టును పబ్లిష్ చేస్తున్నామన్నమాట…)
Share this Article