ఒక వార్త ఆశ్చర్యపరిచింది… దాని సారాంశం ఏమిటంటే..? మొన్న తెలంగాణ అభిమానించిన ఉద్యమగాయకుడు సాయిచంద్ హఠాత్తుగా మరణించాడు కదా… పాపం, భర్తను కోల్పోయిన బాధలో ఆయన భార్య రజని తల్లడిల్లిపోయింది… ఎడతెరిపి లేకుండా ఏడుస్తోంది… ఆ ఇంట్లో విషాదం ఆవరించింది… ఎవరినైనా కోల్పోయినప్పుడు ఏ ఇంట్లోనైనా ఈ పరిస్థితి సహజమే…
ఒకవైపు భర్త పోయిన బాధలో ఉంటే… మరోవైపు రజని దగ్గరికి యూట్యూబర్లు వచ్చి ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తూ సతాయిస్తున్నారు… ఆమె ఉన్న విషాద స్థితిలో ఒకవైపు పరామర్శలు, మరోవైపు ఈ యూట్యూబర్ల తాకిడితో ఆమె మానసిక స్థితి మీద ప్రెజర్ బాగా పెరిగిపోయింది… దీనికితోడు అన్నం, నీళ్లు కూడా మానేసి దుఖిస్తోంది… ఫలితంగా సొమ్మసిల్లిపడిపోయింది…
Ads
సోమవారం ఆమెను ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది… మమ్మల్ని వదిలేయండ్రా బాబూ అని రజని బంధుగణం చెప్పినా యూట్యూబర్లు వినిపించుకోలేదు… ఇదీ వార్త సారాంశం… బీపీ డౌన్ కావడంతో హాస్పిటల్‌లో చేర్చుకుని, స్వస్థత చిక్కాక మంగళవారం ఆమెను డిశ్చార్జ్ చేశారు… ఇప్పుడు వోకే… ఇక్కడ సమస్య ఏమిటంటే… యూట్యూబర్లు..!
ఎక్కడ ప్రెస్‌మీట్ జరిగినా సరే, ఏ సంఘటన జరిగినా సరే… ముందుగా వాలిపోయేవి ఈ యూట్యూబర్ల గొట్టాలే… వీళ్లకు భయపడాల్సి వస్తోంది ఇప్పుడు… ఇంట్లో శుభం జరిగితే, అంటే పొరపాటున ఇంటి ముందు పందిరి, లైట్ల డెకొరేషన్, సన్నాయి గట్రా కనిపిస్తే చాలు హిజ్రాలు వాలిపోతున్నారు… జబర్దస్తీగా వేలకువేలు వసూలు చేస్తున్నారు… అశుభం జరిగినా, ఏదైనా మీటింగ్ జరిగినా, ఏదైనా దుర్ఘటన జరిగినా యూట్యూబర్లు ప్రత్యక్షం…
పేరుకు అందరూ జర్నలిస్టులే… ఐనా బాధలో ఉన్నవాళ్లతో ఇంటర్వ్యూలు ఏమిట్రా, కనీసం ఏడ్చేందుకు కూడా ప్రైవసీ లేదా ఈ నగరంలో..? మా ఏడుపు మమ్మల్ని ఏడవనివ్వండ్రా అని బతిమిలాడుకోవాల్సిన దుస్థితి… మనం అప్పుడప్పుడూ టీవీ9 చానెల్ సహా ఇతర చానెళ్లను విమర్శిస్తుంటాం కదా… హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవాడి మూతి మీద కూడా గొట్టం పెట్టేసి, అది చెప్పు, ఇది చెప్పు అని వేధించే ధోరణిని… మెయిన్ స్ట్రీమ్‌ను చూసి యూట్యూబర్లు కూడా అలాగే తయారయ్యారు… కాకపోతే యూట్యూబర్లు ఇంకాస్త ఎక్కువ రస్టిక్ వే…
పోనీ, ఇలాంటి విషాద సంఘటనల్ని కవర్ చేయడానికి వెళ్తే సైలెంటుగా అక్కడ జరిగేదాన్ని, వాతావరణాన్ని షూట్ చేసుకుని వస్తారా అంటే అదీ లేదు… పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు నిర్దేశించినట్టుగా… నువ్వు అటు జరుగు, నువ్వు ఇంకాస్త ముందుకు రావాలమ్మా, ఆ లైట్ తీసేయండి అంటూ పెడపోకడలు… ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఇంటి బయట ఓ టెంట్ వేస్తారు, పరామర్శకు వచ్చీపోయేవారు కూర్చోవటానికి అంత్యక్రియలు అయ్యేదాకా కుర్చీలు కూడా వేస్తారు… ఇకపై అక్కడే ఓ బోర్డు కూడా తగిలించాలి… ‘‘మీడియా వారికి విజ్ఞప్తి, ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి…’’
Share this Article