.
మనసు శరీరంలో ఒక అవయవం కాదు. గుండె పక్కనో, గుండె మీదో, గుండెలోనో మనసు ఉన్నట్లు సినిమా వాళ్లు కనుక్కున్నారు కానీ…మానసిక శాస్త్రం మనసుకు మెదడే ఆధారం అని శాస్త్రీయంగా నిరూపించింది. మెదడులో ఆలోచనలు స్పందనగా గుండె లయలో మార్పులు తెస్తాయి కాబట్టి గుండెలో మనసు ఉందని అనుకుని ఉంటారు. గుండెకు మనసు ఉంది కానీ…గుండెలో మనసు లేదు.
ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ను ఒకరు తయారు చేసి ఇన్స్టాల్ చేయాలి. మన మనసు సాఫ్ట్ వేర్ ను మనమే తయారు చేసుకుంటాం. ఇష్టాయిష్టాలు, ప్రేమ – ద్వేషం ; కోపతాపాలను మనమే లోపలికి వేసి వాటిని పెంచి పోషించుకుంటూ ఉంటాం.
Ads
మనం తీసుకునే ఆహారంలో పదహారో వంతు భాగం మనసుకు వెళుతుందని సంప్రదాయవాదులు చెబుతారు. అంటే అవయవంకాని మనసుకు ఆహారం ఎందుకు ? అన్న సందేహం రావచ్చు. ఫ్యాన్ ఉంది – కరెంట్ ఉంటేనే తిరుగుతుంది. కార్ ఉంది – పెట్రోల్ , డీజిల్ పోస్తేనే కదులుతుంది . అలాగే ప్రాణం ఉంది. కానీ ఆ ప్రాణానికి ఉన్న చైతన్య స్వభావం ఏర్పడడానికి, ఆ స్వభావం ఆరోగ్యంగా ఉండడానికి మనసుకు చక్కటి ఆహార సారం వెళ్లాలి. మనసు ఉల్లాసంగా, నిత్యం చైతన్యంగా ఉండడానికి తగిన వాతావరణం ఉండాలి.
“మనసులోని మర్మమును తెలుసుకో!”
అని త్యాగయ్య అన్నది భక్తికి సంబంధించే అయినా…అంతకుమించి ఇంత అంతరార్థముందనుకోవాలి.
“Don’t take it to heart”
అని ఇంగ్లీషులో ఒక మాట. “మనసులో పెట్టుకోకు” అన్నది బహుశా దీనికి తెలుగులో సరైన మాట. కానీ ఇది చెప్పినంత సులభం కాదు. అన్నీ గుండెకే తీసుకుంటాం. అన్నీ మనసులోనే పెట్టుకుంటాం. గుండె- మెదడు మధ్య జ్ఞాపకాలు, స్పందనలు, అనుభూతులు ఇంకా ఏవేవో మాటల్లో చెప్పలేని అమూర్త భావనల సమాహారం మనసు. కోపతాపాలు, ఉద్వేగ ఆనందాలకు గుండె స్పందనల్లో మార్పు సహజం. ఆ సమయంలో రక్తపోటులో ఎగుడు దిగుళ్లు ఉంటాయి. నిజానికి మనం మనసు భారాన్ని గుండె మీద పెట్టి దాని దుంప తెంచుతున్నాం. ఏడిస్తే మనసు కుదుట పడుతుందనుకుని కుళ్లి కుళ్లి ఏడుస్తూ గుండెను తెగ ఏడిపిస్తున్నాం.
మనసు, మెదడు, మతి- దేనికదిగా వేరు వేరు విషయాలు. కళ్లు, చెవులు ఇతర ఇంద్రియాలతో మనం తీసుకున్న ఇన్ పుట్స్ ను మెదడు రికార్డ్ చేస్తుంది. భద్ర పరుస్తుంది. మనకు కావాలన్నపుడు వెలికి తీసి ఇస్తుంది. గూగుల్ లో సెర్చ్ కొడితే ఫైల్ ను వెతికిపెట్టినట్లు కొన్ని కీ వర్డ్స్ వినపడగానే దానికి సంబంధించిన మొత్తం డేటాను మెదడు మతికి అందిస్తుంది. మతి వెంటనే ఆ డేటాను ఎలా కావాలంటే అలా ప్రకటించడానికి సిద్ధం చేస్తుంది. మతి అంటే గుర్తు. మతిమరపు అంటే గుర్తు లేకపోవడం.
ఉదాహరణకు- ఒక పాట ట్యూన్ వినపడగానే ఆ పాట మనం పాడుతున్నామంటే ఆ పాట మ్యూజిక్, సాహిత్యం, వీలయితే ఆ పాట వీడియోలను మన మెదడు రికార్డ్ చేసి పెట్టుకుని ఉండాలి. ఎన్నో సార్లు విని ఉండాలి. పాట మనం రాయకపోయినా గాయకుడికంటే ముందే పాడేస్తూ ఉంటాం. ఎందుకంటే మతికి మెదడు వెంట వెంటనే ఆ పదాలను అందిస్తోంది కాబట్టి. అలాగే చిత్రం, దృశ్యం, శబ్దం, స్థలం, రుచి, వాసన, రంగు…సకలాన్ని మెదడు కొన్ని కొన్ని కీ వర్డ్స్ తోనే గుర్తు పెట్టుకుంటుంది. దూకేప్పుడు ప్యారాచూట్ ఓపెన్ చేస్తేనే అది పని చేస్తుంది. లేకపోతే ప్యారాచూట్ దానికదిగా తెరుచుకోదు. మెదడు కూడా అంతే. ఓపెన్ చేస్తేనే, వాడితేనే పనిచేస్తుంది.
అందుకే- మెదడు ఉందా? లేదా? మెదడు పనిచేస్తోందా? మెదడులో చిప్ ఏమన్నా కొట్టేసిందా? చిన్న మెదడు చిట్లిందా? మెదడు ఉండే మాట్లాడుతున్నావా? మెదడు లేనోడా! లాంటి ఎన్నో మాటలు మెదడున్న వారు కనుక్కుని వాడుకలో పెట్టారు. ఇంతకంటే లోతుగా వెళితే ఇది వైద్యశాస్త్ర పాఠం అవుతుంది.
మనసెరిగి నడుచుకోవడం;
మనసున మనసై;
మనసులో మాట;
మనోవేదన;
మనోబలం;
మనో నిబ్బరం;
మానసిక శాంతి/అశాంతి;
మానసిక వైద్యం;
మానసిక వికాసం;
మనసుకు హాయి;
ముక్కలైన మనసు;
కుదుటపడ్డ మనసు;
లోతైన మనసు;
మానసిక సంఘర్షణ;
మానసిక వైక్లబ్యం;
సున్నితమైన మనసు;
బండబారిన మనసు;
మనసులేని మనిషి;
మనసా వాచా కర్మణా… ఇలా మనసు పెట్టి ఆలోచించినా…చించకపోయినా అడుగడుగునా మనసే. ముందు, వెనుక విశేషణాలతో విశేషమైన మనసు పొందే రూపాలెన్నో! పేర్లెన్నో!
ఎదుటివారి మనసు చదవగలగడం అంత సులభం కాదు. కానీ నిజజీవితంలో అత్యంత అవసరమైనది ఇదే. మన మనసుకు నచ్చితేనే ఏ పనైనా చేస్తాం. మనసుకు నచ్చకపోతే తిట్టుకుంటూ…విసుక్కుంటూ చేస్తాం. ఆ విసుగు పనిలో, ఫలితంలో ఎలాగూ ప్రతిఫలిస్తూ ఉంటుంది.
మనసులో ఏదో పెట్టుకుని పైకి ఇంకేదో మాట్లాడుతున్నావ్ అని అంటుంటాం. నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? అని అంటుంటాం. నా మనసులో ఉన్నది ఉన్నట్లు భలే చెప్పావే! అని అంటుంటాం. అలా మనసులో ఉన్నది ఉన్నట్లు చదివే యంత్రాలు వస్తే ఎంత బాగుండు! అని ఇంతకాలం అనుకునేవారు. ఇప్పుడిక ఆ దిగుల్లేదు. తెరిచిన మనసులనే కాకుండా మూసిన మనసు పొరల్లో లోలోపలికి వెళ్ళి…చదివి…అందులో ఏముందో రాసిపెట్టే యంత్రాన్ని ప్రపంచంలో తొలిసారిగా చైనా ఆవిష్కరించింది. మెదడుకు గాయమై…మూర్ఛ వ్యాధి బారినపడి…మాటపడిపోయిన ఒక రోగి మనసులో ఏమనుకుంటోందో ఈ యంత్రం ద్వారా చదవగలిగారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ తో పనిచేసే ఈ ప్రక్రియకు “బ్రెయిన్ రీడింగ్ మెషిన్” అని పేరు పెట్టారు.
బాబ్బాబూ! చైనా బాబూ!
మీ పెరట్లో పుట్టిన ఆ కొత్త వైరస్ హెచ్ ఎం పి వీ ప్రపంచాన్ని చుట్టుముట్టి…అల్లకల్లోలం చేయడానికంటే ముందే…ఈ మనసు చదివే యంత్రాలను కోట్లకొద్దీ ఉత్పత్తి చేసి…మాకు యమర్జంటుగా ఎగుమతి చేసేయండి. ఇక్కడ మేము చదివితీరాల్సిన మనసులు కోట్లకొద్దీ ఉన్నాయి!
(మెదడు, మనసు ఒకటి కాదు. చైనా కృత్రిమ మేధ యంత్రం బహుశా మెదడును చదివేది అయి ఉండాలి. ఒక మనిషి మెదడులో ఆలోచనలను చదవగలిగితే…ఆ మనిషి మనసును చదివినట్లే అన్న స్థూల అర్థంలో ఒక సంచలనంగా ఇది ప్రచారంలోకి వచ్చినట్లుంది. మెదడును చదవగలిగిన యంత్రం రేప్పొద్దున మనసును కూడా చదవకపోదు!)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article