Ms not so Perfect… సాధారణంగా సీరీస్‌లు, సినిమాలు చూసిన తర్వాత రివ్యూలు రాయాలంటే మహా బోరు బద్దకం. కానీ ఈ కళాఖండంపై రాయాలనుకునీ రాయకుండా టైం పాస్ చేసా… కానీ, రాయడం వల్ల ఇలాంటి కళాఖండాల బారిన పడకుండా వుంటారని గుర్తొచ్చింది. సరే, ఇంతకీ ఏంటి ఈ కళాఖండం కథాకమామీషు…..
డిస్నీహాట్‌స్టార్‌లో కొత్తగా రిలీజయిన ‘Miss Perfect’ గురించి… దీనిలో లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్‌లో నటించింది… ఆమెకి జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ నటించాడు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించగా విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు…
ఒక కార్పొరేట్ కంపెనీలో HR & quality consultant గా వున్న లావణ్యకి OCD అనే డిజార్డర్ వుంటుంది… మన సినిమాల్లో ప్రధాన పాత్రలకు కేన్సర్ తర్వాత ఇదే అతిపెద్ద రుగ్మత… ఈ డిజార్డర్ ని పురస్కరించుకుని అతిశుభ్రత అనే జాడ్యం ఉంటుంది. తన ఇల్లు, తన ఆఫీసు, తన పరిసరాలు మాత్రమే కాకుండా పక్కింటిని, ఎదురింటిని శుభ్రంగా ఉంచడం కూడా తన ప్రధమ కర్తవ్యం అని ఫీలయ్యే వింత కారెక్టరన్నమాట ఆమెది… అది ఓసీడీకన్నా పెద్ద డిజార్డర్…
Ads
ఉద్యోగరీత్యా ప్లస్ వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయి వస్తుంది… ఆ క్రమంలో తను ఉండే అపార్ట్మెంట్ లోనే హీరో కూడా నివాసం వుంటాడు… నాటకీయ పరిణామాల మధ్య హీరో ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది… అక్కడ ఆ బాచిలరుడి ఇంటిని చూసి, తనలోని OCD నిద్రలేస్తుంది, వెంటనే ఇంటిని శుభ్రం చేసేస్తుంది… అలా ప్రతిరోజు పనిమనిషి అవతారంలో అతగాడి ఇంటికి వెళ్ళి, అంట్లు కడిగి, ఇల్లు ఊడ్చి, తుడిచి, ఆ గదులు సర్ది, అలా అతని మనసులోకి దూరుతుంది…
పనిలో పనిగా హీరో కూడా తనకొచ్చిన పాకశాస్త్ర ప్రదర్శన ఆమె ముందు ఉంచుతాడు… ఆమెకు నచ్చిన వంటలు వండుతూ, ఆమె తింటుంటే పరవశించి, పలకరించి, పనిలోపనిగా తను కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఈమె పనిమనిషి కాదని, తన బాసే అని క్లైమాక్స్ లో గానీ తెలీదు…
చివరికి ఏమవుతుందనేది సదరు డైరెక్టర్ కి తెలీకపోయినా బాగా ఎక్స్పీరియన్స్ వున్న ప్రేక్షకులం కదా, మనకు మొదటి ఎపిసోడ్ లోనే తెలిసిపోతుంది… ఇలా తన బాసే తన మనిషిగా, పనిమనిషిగా పనిచేసి తన మనసు గెల్చుకోవడానిక్ వీలుగా, వారెప్పుడూ కలుసుకునే వీలు లేకుండా ‘కరోనా పాండమిక్’నిన్నూ, హీరోని హీరోయిన్ మాత్రమే చూడగలిగేందుకు వీలుగా హీరోయిన్ ఇంట్లో బైనాక్యులర్స్ ప్లేస్ లో మినీ టెలిస్కోప్ ని కూడా ఏర్పాటు చేసాడు డైరెక్టర్…. ఎంత మేథస్సు !
ఒక హీరోయిన్ ఎవరి ఇంట్లో అంట్లయినా తోమడం…. ఒక హీరో వండి వార్చడం అనే ఆలోచనే ఎంతో రాడికల్, ఎంతో ప్రోగ్రెసివ్… అసలు అద్భుతం!
ఈ ఒక్క థాట్‌కే మినీ ఆస్కార్ ఇవ్వొచ్చు. అసలు కరోనా లాక్‌డౌన్ ని కథలో ఇలా కూడా వాడొచ్చని ఎంత బాగా చూపించాడో… అసలు కామెడీ గానీ, ఆహ్లాదకరమైన సీన్లు గానీ, కొద్దిగానైనా ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, సమాజానికి ఉపయోగపడే అంశాలు గానీ ఏవీ ఇసుమంతైనా వుండకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్…
ఒకే అపార్ట్మెంట్‌లో మొత్తం సీరీస్ తియ్యడం ఎలా, కరోనా లాక్‌డౌన్‌ని కథలో వాడుకోడం ఎలా, సపోర్టింగ్ కారెక్టర్స్ తో కడుపులో చల్ల కదలకుండా కూర్చోబెట్టి, డైలాగులు చెప్పించడం ఎలా, ఆడ సపోర్టింగ్ పాత్ర అనగానే పాతచింతకాయ పచ్చడిలాగే లూస్ కారెక్టర్ లాగా ఎలా చూపించాలో, ఒక అత్తెసరు కథని వుడికీ వుడకని ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎలా తియ్యాలో అన్నపూర్ణ వారి ఆడపడుచు సుప్రియను చూసి నేర్చుకోవాలి… ఇంత గొప్ప కళాఖండాన్ని తమ ఓటీటీలో పోటీపడి రిలీజ్ చేసిన హాట్ స్టార్ కి చివరిగా వందనాలు…
తెలుగు సినిమా అట్టడుగు స్థాయిలో వుంది అని గొంతు చించుకునే వారి బాటలోనే … తెలుగు వెబ్ సీరీస్ పాతాళ స్థాయిలో వున్నాయని నేనూ అరవాలని వున్నా అరవలేను… ప్చ్, మనదీ ఓ డిజార్డరే…!! ఏమాటకామాట… వెబ్ సీరీస్ అనగానే బూతులు, హాట్ సీన్లు ఉంటాయనే భ్రమ ఒకటి వ్యాపించి ఉంది కదా… ఇందులో మాత్రం అశ్లీలం, అసభ్యత జోలికి వెళ్లలేదు దర్శకుడు… అదొక్కటే ఈ సీరీస్ ప్లస్ పాయింట్…!! By — అజ్ఞాతి
Share this Article