ఎవ్వరిది వాళ్లు ఎంత సంపాదించామా.. ఎంత మంచి ఇల్లు కట్టామా… ఎన్ని ఇళ్లు కొనగలం… ఎన్ని భూములను సొంతం చేసుకోగలం… ఎన్ని ఆస్తులు కూడగట్టుకోగలమని యోచించే జమానా ఇది. కానీ, ఇలాంటి రోజుల్లో కూడా ఇతరులకు సేవ చేసేందుకు డబ్బు సంపాదించాలనేవాళ్లూ ఉన్నారంటే.. ఎక్కడో ఇంకా కొంత మంచి బతికున్నట్టే! కాస్త అతిశయోక్తిగా అనిపించినా స్ఫూర్తినిచ్చే నిజమైన ఈ మిషన్ వన్ రూపీ కథ మీరూ ఓసారి చదివేయండి!
మీ వంతుగా జస్ట్ ఒక్క రూపాయి సాయం చేయండి చాలు అని ఓ ప్లకార్డ్ పట్టుకుని బయల్దేరారు ఆ ఇద్దరు స్నేహితులు. అడుక్కుంటున్నారనుకుంటున్నారా…? అవునూ.. నిజమే! కానీ, వారి కోసం కాదు.. పేదల కోసం.. బ్రిటీషర్స్ వెళ్లిపోయాక కూడా కూడు, గూడు, గుడ్డ కోసం ఆకలితో అలమటిస్తున్న దేశంలోని బీదల పాట్ల కోసం. నిలువ నీడలేని వారికి ఇంత ఆశ్రయం కల్పించే ఉద్ధేశ్యంతోనే యాదృచ్ఛికంగా దోస్తులైన ఓ ఇద్దరు కలిసి చేపట్టిన సైకిల్ యాత్ర ఇది.
నిజిన్ కే.జీ, టీ.ఆర్. రెనీష్… ఈ ఇద్దరూ కేరళైట్స్. నిలువ నీడలేని నిరుపేదలకు ఇళ్లు కట్టించే యోచనతో భారత్ మొత్తం సైకిల్ యాత్రను చేపట్టింది ఈ దోస్తుల జోడీ. ఇప్పటికే వందల కిలోమీటర్లు చుట్టేసిన వీరి యాత్ర.. అలుపెరుగని సమర్థుల జీవయాత్ర. అందుకే, ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వీరు తిరిగిన ప్రాంతాల్లో వీరి మోటో తెలుసుకుని రూపాయి రూపాయి ఇచ్చినవారందరి డబ్బూ కలిపి.. సుమారు 2 కోట్లకు పైగా విరాళాలు పోగయ్యాయి. అయితే వీరి స్టోరీయే జనాన్ని ఇన్స్పైర్ చేస్తుంటే… వీరిని ఓ బుడతడు ఇన్స్పైర్ చేసిన విధానం ఇంకా విశేషం.
Ads
కేరళలోనే రాజపురం అనే గ్రామానికి చెందిన నివిన్ రోనీ అనే 9 ఏళ్ల బాలుడు చిన్ననాట్నుంచి తన తల్లిదండ్రులు, ఇతర బంధువులెవరైనా ఇచ్చిన డబ్బుల్ని రూపాయి రూపాయి గల్లాపెట్టెలో పోగుచేశాడు. ఆ మొత్తం తను 9 ఏళ్ల వయస్సుకొచ్చేసరికి.. సరిగ్గా 11 వందల 17 రూపాయలయ్యాయి. అయితే ఆ డబ్బును ఆ బుడ్డోడు తనకు కావల్సిన ఏ బొమ్మో, చాక్లెట్టో, బిస్కట్టో కొనేందుకు ఉపయోగించుకోకుండా… పేదల ఇళ్ల నిర్మాణానికై సైకిల్ ఎక్కి బయల్దేరిన ఆ ఇద్దరు యువకులకిచ్చి.. వారిలో మరింత స్ఫూర్తి నింపాడు.
అలాగే మరో నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు కూడా ఇలాగే నిజిన్, రెనీష్ జోడీ సైకిల్ యాత్ర గురించి యూట్యూబ్ లో చూసి… తాను సైకిల్ కొనడానికి జమ చేసుకున్న డబ్బుల్ని ఈ జోడీకిచ్చేశాడు. తన సైకిల్ కొనడాన్ని మరికొంత కాలానికి వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పి… ఏ ఉద్ధేశ్యంతోనైతే నిజిన్, రెనీష్ ఆ సైకిల్ యాత్రను చేపట్టారో దాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చోదకమయ్యాడు.
తమ ప్రాజెక్ట్ సీరియస్ నెస్ గురించి చెప్పడానికే సైకిలెక్కిన బాటసారులు!
వాస్తవానికి నేటి సోషల్ మీడియా యుగంలో ఒక్క క్లిక్కుతో క్రౌడ్ ఫండ్ రైజింగ్ కు అవకాశముంది. కానీ, తామెందుకు తిరుగుతున్నామో… వారి మోటో వెనుక ఉన్న సదుద్ధేశ్యమేంటన్నవి నిజాయితీగా చెబుతారు వీరిద్దరు. తమ మిషన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవడానికే.. నేరుగా సైకిల్ యాత్రైతేనే బెటర్ అని యోచించారట ఈ ఇద్దరు దోస్తులు. తమ టాస్క్ పూర్తి చేయగల్గేందుకు సోషల్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఏ కష్టం లేకుండా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేయడానికి ఆస్కారమున్నా… అలా చేయకుండా తమ నిజాయితీని చాటుకునే యత్నంలో సైకిల్ పై రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తున్నారు ఈ బాటసారులు.
2021, డిసెంబర్ 10వ తేదీన తమ సైకిల్ జర్నీని ప్రారంభించారు ఈ బాటసారులు. తమ ప్రయాణంలో తమకందిన విరాళాలను ప్రతీ రెండు రోజులకొకసారి బ్యాంకులో జమ చేస్తారు. ఇప్పటికే వందల కిలోమీటర్లు దాటిన వీరి సైకిల్ ప్రయాణం… 400 గ్రామాల మీదుగా సాగుతూనే ఉంది. అంబలవాయల్ కు చెందిన రెనీష్.. వాయనాడ్ కు చెందిన నిజిన్ స్నేహమూ.. ఈ మోటో ప్రాతిపదికగానే బలపడి ఇలా సైకిల్ యాత్రకు పురిగొల్పడమూ ఈ కథలో మనకు కనిపించే మరో విశేషం.
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నిజిన్ తన మోబైల్ రిపేర్ కోసం మోబైల్ షాపుకు వెళ్లడం.. అక్కడ మాజీ సేల్స్ పర్సనైన రెనీష్ కలవడం.. మాటామాటా కలిసి ఇద్దరూ ఇలా ఓ సామాజిక ప్రయోజనం కోసం జట్టు కట్టి సైకిల్ యాత్రకు బయల్దేరడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. సుమారు నెలరోజుల పాటు తమ సైకిల్ యాత్ర కోసం ప్లానింగ్ చేసుకున్నారు. కానీ, ఇరువురి ఇళ్లలో ముందు కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా… వారి ఆలోచనకు ఫిదా అయిన కుటుంబీకులు కూడా అనుమతించడం.. వీరి యాత్ర వివరాలు తెలుసుకున్న రెనీష్ మిత్రుడు కేవలం ఏడు లక్షల రూపాయలకే ఇళ్ల నిర్మాణం కోసం 20 సెంట్ల భూమిని కారుచౌకగా ఇచ్చేశాడు. అంతేకాదు నిర్మాణ సామాగ్రికి కూడా తనవంతు సాయమందించాడు. లోన్ తో భూమి కొన్న ఈ ఇద్దరు మిత్రులు.. వాటిని ఈఎంఐల రూపంలో తీర్చేస్తూ.. మరోవైపు బీదల కోసం ఇళ్ల నిర్మాణం వైపు అడుగులేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
అయితే, సైకిల్ పై ప్రయాణాలు చేయడమనేది ఇప్పుడు చాలామందికి ఫ్యాషన్ గా మారిపోవడం.. అలాగే, పర్యావరణ పరంగా వాహనాలతో తలెత్తుతున్న ముప్పును నివారించాలన్న ఉద్ధేశ్యంతో సైకిల్ యాత్రను ప్రోత్సహిస్తుండటం వంటివి ఇప్పటి వరకూ చూస్తూ వచ్చాం. కానీ, ఇలా ఒక్క రూపాయి మిషన్ పేరుతో సైకిల్ యాత్రతో నిజిన్, రెనీష్ స్నేహితుల జోడి వార్తల్లో వ్యక్తులయ్యారు. అయితే, వీరి గమనంలో ఎన్ని విజయాలో.. అన్ని చేదు అనుభవాలూ కనిపించాయంటారు. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో సైకిల్స్ పంక్చర్లవ్వడం నుంచి.. ఒక్కరూపాయి ఇవ్వమని అడగటాన్ని ఎగతాళి చేసేవారు.. ఇవ్వనివారు.. ఎక్కడెక్కడో నిద్రలేని రాత్రులు గడపడం.. ఇలా ఎన్నో చేదు-తీపి అనుభవాల సారంగా సాగుతున్న వీరి సైకిల్ యాత్ర..పేదల ఇళ్ల నిర్మాణంకై వీరు చేపట్టిన టాస్క్ .. నిజంగా ఓ నిస్వార్థపు రిస్క్ ఫ్యాక్టర్…… (రమణ కొంటికర్ల … 99126 99960)
Share this Article