Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“స్వచ్చ్ దూద్‌సే బనాహువా కలాఖండ్‌వాలా కోవా… సిర్ఫ్ దస్ రూపయే”

April 5, 2023 by M S R

Sweet Auto: మంగళగిరి మెయిన్ రోడ్డు పక్కన ఏపిఐఐసి ఆఫీసు. దాని ముందు రోడ్డు మీదే “హలో ఇడ్లి” టిఫిన్ హోటల్. రెండు వారాల పాటు రోజూ ఉదయం ఏడు గంటలకే అక్కడ ఇడ్లీలు తినాల్సిన అనివార్య పరిస్థితి. హోటల్ దగ్గర కారు దిగగానే… పాలకోవా అమ్మే ట్రాలీ ఆటో ఒకటి రోజూ కనిపిస్తుంది. వినిపిస్తుంది. ఆటో వెనుక, ముందు సౌండ్ బాక్స్ లు. అందులో తెలుగు, హిందీలో ముందే రికార్డ్ చేసి పెట్టిన ఆడియో లూప్ లో వెంట వెంట ప్లే అవుతూ ఉంటుంది.

“స్వచ్ఛమయిన పాలతో తయారు చేసిన పాలకోవా…. పది రూపాయలే”.

“స్వచ్చ్ దూధ్ సే బనాహువా కలాఖండ్ వాలా కోవా… దస్ రూపయే”

Ads

ఇంతవరకు అయితే నేను పట్టించుకునేవాడిని కాను. తెలుగుకు ముందు…

“పాలకోవా…చూసిపోవా!
అందుకోవా…జుర్రుకోవా!
పాలకోవా…పాలకోవా!”

అని ఒక జింగిల్ చక్కటి మ్యూజిక్ తో వస్తోంది. ఏదయినా సినిమాలో పాటేమో అనుకున్నా. ఒక రోజు పొద్దున్నే విపరీతమయిన వర్షం పడుతుంటే ఆ పాలకోవా ఆటో అతను నాతోపాటు హోటల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఈ పాలకోవా పాట సంగతి తేల్చుకోవాలని మాట కలిపాను.

అతడిది రాజస్థాన్ అట. ఇరవై ఏళ్ల కిందట రైలెక్కి విజయవాడ వచ్చేశాడు. చక్కటి కృష్ణా జిల్లా తెలుగు మాట్లాడుతున్నాడు. మొదట ఒక స్వీట్ షాపులో పనిచేసి తరువాత సొంతంగా షాపు పెట్టుకున్నాడట. షాపు నిర్వహణ బరువై చివరికి ట్రాలీ ఆటో సంచార షాపులోకి దిగాడట. ఇప్పుడు బాగుందట. ఇంట్లో స్వీట్లు చేయడం, వీధుల్లో ఆటో మీద అమ్ముకోవడం. అతనే డ్రయివర్. అతనే కౌంటర్లో సేల్స్ మ్యాన్. అతనే ఓనర్.

ఈ పాట సంగతి ఏమిటి? హిందీలో ఆడియో ప్రకటన ఎందుకు? పైగా ఆటో మీద కూడా తెలుగుతో పాటు హిందీ అక్షరాలున్నాయి? అంటే పూసగుచ్చినట్లు అతని మార్కెటింగ్ అనుభవ పాఠం చెప్పాడు- ఒక స్టాన్ఫోర్డ్ మేనేజ్ మెంట్ టీచర్ చెప్పినట్లు.

విజయవాడ, గుంటూరుల్లో సినిమా పాటలంటే క్రేజ్ ఎక్కువట. అందుకు ఏదో సినిమా పాటలో పాలకోవా ట్యూన్ ను అనుకరిస్తూ 30 సెకెన్ల పాట రాయించి, రికార్డు చేయించాడట. హిందీ వినపడగానే ఉత్తరభారతం నుండి ఇక్కడికొచ్చి పనిచేసే వలస కార్మికులు ఆకర్షితులవుతారట. స్పష్టమయిన స్థానిక తెలుగు లేకపోతే ఇక్కడి తెలుగువారు పట్టించుకోరట.

“పాలకోవా… చూసిపోవా!… అందుకోవా!… జుర్రుకోవా!…”
రాసిందెవరో గుర్తు లేదట. కీ బోర్డు ప్లేయరే రాసి ఉంటాడన్నాడు.

ఇంత అంత్యప్రాసలతో పాలకోవా రుచికి ఏమాత్రం తీసిపోని పాటకోవా పేర్చిన ఆ అజ్ఞాత రచయిత నిజంగా అభినందనీయుడు. రోడ్డు మీద మిఠాయిలు అమ్మడానికి ఇంత సాహిత్యం సృష్టించిన మిఠాయివాలా మరింత అభినందనీయుడు. వర్షంవల్ల ఆటో ఫోటో, అతడితో సెల్ఫీ తీసుకోలేకపోయినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.

సాహిత్య ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడానికి ఎన్నెన్నో పుస్తకాలు చదివాను. చదువుతూ ఉన్నాను. వాటన్నిటినీ తోసిరాజని సాహిత్యానికి ఇంతకంటే తక్షణ ప్రయోజనం ఏముంటుంది? అని మిఠాయివాలా కొత్త పాఠం చెబుతున్నట్లుగా ఉంది నాకు.

“ఎంత కోయిల పాట వృధయయ్యెనో కదా
చిక్కు చీకటి వనసీమలందు
ఎన్ని వెన్నెల వాగు లింకిపోయెనొ కదా
కటిక కొండలమీద మిటకరించి
ఎన్ని కస్తురి జింకలీడేరెనో కదా
మురికి తెన్నెల మీద పరిమళించి
ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా
పండిన వెదురు జొంపములలోన
ఎంత గంధవహనమెంత తంగెటిజున్ను
యెంత రత్న కాంతి యెంత శాంతి
ప్రకృతి గర్భమందు! భగ్నమైపోయెనో
పుట్టరానిచోట బుట్టుకతన’’

అని నవయుగ కవితా చక్రవర్తి జాషువా ఇంకేదో సందర్భంలో అన్నాడు. అలా ఇలాంటి వారెందరో వెలుగులోకి రాకుండా ఇలా తమ సృజనాత్మకతను రోడ్ల మీద ప్రదర్శించుకుంటూ…ఆ రోడ్ల మీదే ఉండిపోతూ ఉంటారు.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions