.
ఆ అయిదుగురూ పార్టీలు ఫిరాయించలేదు, ఆధారాల్లేవు అన్నాడు తెలంగాణ స్పీకర్… ఇంకొందరివి తేల్చడం బాకీ ఉంది… తేల్చేయాల్సిందే… అదీ తప్పదు… ఐతే కేటీయార్ స్పందన ఏమిటి..?
‘అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం… కాంగ్రెసోళ్లకు చట్టమంటే, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఉపఎన్నికల్లో జనం శాస్తి చేస్తారని భయపడ్డారు…’’ ఇలా వ్యాఖ్యానించాడు… సరే, కేసీయార్ తను అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా ప్రతి పార్టీ నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, ఏకంగా విలీనాలే చేసుకుని, కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేసినప్పుడు అది అనైతికం కాదా..? అది పవిత్ర కార్యక్రమమా..?
Ads
- కేసీయార్ కాలంలో ఎన్ని ఫిరాయింపులనే లెక్కల జోలికి ఇక్కడ పోవడం లేదు… తను సమర్థన బుకాయింపు పదం ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ మార్మిక అర్థాల జోలికీ పోవడం లేదు… ఫిరాయింపులు నిజం… కానీ లీగల్, టెక్నికల్ చిక్కులతో వేర్వేరుగా బాష్యాలు చెప్పబడతాయి… అంతే… ఇంకాస్త చెప్పుకుందాం…
ఏణ్నర్థం క్రితం ‘ముచ్చట’ కథనం ఇది… (ఫిరాయింపుల ప్రతిభను మీరే అందరికీ నేర్పి, మీరే గతంలో భీకర నైపుణ్యం చూపించిన విద్యయే కల్వకుంట్ల నీరజాక్షా )…
మాయాబజార్ సినిమాలో… ద్వారకలో అడుగుపెట్టిన ఘటోత్కచుడికి శ్రీకృష్ణుడు ఓ ముసలివాడి రూపంలో కనిపించి ఓ పాట పాడతాడు… ‘‘చిన చేపను పెద చేప… చిన మాయను పెను మాయ… అది స్వాహా… ఇది స్వాహా.. అది స్వాహా… ఇది స్వాహా.. చిరంజీవ చిరంజీవ సుఖీభవ!’’
సరే, విషయానికొద్దాం… ఢిల్లీలో శ్రీమాన్ కేటీయార్ గారేమన్నారు..? మేం చేసుకున్నది విలీనం… ఫిరాయింపులు కావు… అవి రాజ్యాంగబద్ధం, అదీ చూడాల్సింది, అదే చట్టబద్ధత అన్నాడు… అంటే తమ హయాంలో సాగిన ఫిరాయింపులు, సారీ, విలీనాల నైతికత గురించి అడగొద్దు, జస్ట్ థింక్ అబౌట్ లీగాలిటీ అంటున్నాడన్నమాట…
ఫాఫం, కేసీయార్ కనీసం రాజకీయ శక్తుల పునరేకీకరణ అనబడే ఓ భ్రమపదార్ధం వంటి సూత్రీకరణ చేసుకున్నాడు… కేటీయార్ 80 వేల పుస్తకాలు చదవలేదు కదా డాడీలాగా… సమయానికి పడికట్టు పదాలు దొరకలేదు… తడబడి ఏదేదో చెప్పుకొచ్చాడు… జనం ఏమనుకుంటారు అనేది అప్రస్తుతం, అది తనకు అనవసరం… తాము గతంలో చేసింది సంసారం, రేవంత్ రెడ్డి చేసేది వ్యభిచారం…
ఈ నేపథ్యంలో మిత్రుడు బెల్లంకొండ ప్రసేన్ ఏమంటాడంటే… ‘‘విలీనం, ఫిరాయింపు వేర్వేరు అంటున్నాడు ది గ్రేట్ ఎంపరర్ ఎడ్వర్డ్ కేటీఆర్ ఈ రోజు డిల్లీలో ప్రెస్ తో … కానీ…
‘మత్స్య న్యాయ’ అని ఒక పురాతన భారతీయ తత్వ శాస్త్రం ఒకప్పుడు అమలులో ఉండేది… ఇది చేపల చట్టం అనే సూత్రం ఆధారిత ప్రకృతి నియమం … అంటే, పెద్ద చేప చిన్న చేపను మింగడం ప్రాథమిక సూత్రం… లా ఆఫ్ జంగిల్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు.. అంటే జంతు నీతి …
మనుష్య నీతి కూడా ఉంటది, అదేంటి అంటే బలహీనులను కాల్చుకుని తినడం, బానిసలను చేసుకోవడం, తన్నడం , చంపడం అదనపు సౌకర్యం…
సాధారణ మనుషులు పవిత్రులు అయ్యాక చట్ట సభలకు వెళ్తారు… అలగా జనాలను పురుగులకన్నా హీనంగా చూస్తూ మన నెత్తిన ఎక్కి కూర్చుంటారు. వాళ్లు చెప్పిందే న్యాయం, ఆచరించిందే చట్టం…
గెలిచిన వాడు బలహీనుడు అయితే బలవంతుని సంకన చేరతాడు. దీన్నే ఆధునిక రాజ్య భాషలో ఫిరాయింపు అంటారు. ఒక జంతువుని చంపకుండా ఒక్కొక్క అవయవాన్ని కోసుకుని తినడం అన్నమాట, దాన్ని జంతు ఫిరాయింపు న్యాయం అంటారు.,
ఇలా అవయవాలను ఒక్కొక్కటీ కోసుకోకుండా ఒకేసారి మంటల్లో కాల్చి తినేయడాన్ని విలీనం అంటారు… ఇప్పుడు గ్రేట్ KTR ఏమంటాడూ అంటే చంపి తినడం న్యాయం, ఒక్కొక్క అవయవం నరుక్కోవడం అటవికం అంటాడు…
మీకు చేతనైతే గతంలో మేము కాంగ్రెస్ ని చేసినట్టే.,. ఖీమా కొట్టి తినండి అంటున్నాడు… ఇలా చావకుండా బ్రతకకుండా BRS ను బరిబాత చేయొద్దు అంటున్నాడు…
వాళ్లు అలా నరికి, తుంచి, కాల్చి, రోస్ట్ చేసి చేసేది ఓటర్ల నమ్మకాన్ని అనేది జనాలకు అర్థం అయ్యే రోజు కోసం చూడాలి… సో, విలీనం నాగరికం, ఫిరాయింపు అటవికం అంటాడు… ఇదండీ నవ్య రాజకీయ చేప నీతి…!!
Share this Article