ఫైర్ ఫైటర్స్, డీప్ సీ డైవర్స్ గా మహిళలు … నెత్తి మీద నీటి బిందెలతో మైళ్ళ దూరం నడచి వెళ్లే మహిళల శక్తి సామర్ధ్యాలు మనకి పట్టవు… రోడ్డు పక్కన బండరాళ్లను అవలీలగా పగలగొట్టి రోళ్ళుగా మలచి చవకగా అమ్మే ఆడవారు ఆనరు… సన్నని తాడుపైన పాదాలతో బాలన్స్ చేసుకుంటూ కర్ర చేత్తో పట్టుకుని నడిచే అమ్మాయిని చూసి ఆనందించడమే తప్ప ఆమె సాహసం గుర్తించరు. ఎంత చదువుకుని ఉన్నత హోదాలో ఉన్నా వివక్ష తప్పదనే చెప్పాలి.
ముదితల్ నేర్వగరాని విద్యగలదే అనే నోటితోనే ఆడవాళ్లు కుటుంబాలకే ప్రాధాన్యమివ్వాలనే వారు ఉన్నారు. పైగా కొన్ని రంగాల్లో మహిళలకు ప్రవేశమే ఉండదు. ఈ వివక్షను రూపుమాపే ప్రయత్నం చేస్తోంది టాటా కంపెనీ. ఆ బాటలోనే మరికొన్ని కంపెనీలు కూడా అడుగులు వేస్తున్నాయి.
ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం జె ఆర్ డి టాటా ని ప్రశ్నించి టెల్కోలో ఉద్యోగం సాధించారు సుధామూర్తి. ఆ తర్వాత టాటా… తమ సంస్థల్లో వీలయినంత వరకు మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తూనే ఉంది. ముప్ఫయ్యేళ్ళ క్రితం టైటాన్ చేతి గడియారాల ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడూ ఎక్కువ మంది మహిళలకే పని కల్పించారు. నా డిగ్రీ అయిన తొలినాళ్లలో ఆ వాచ్ కంపెనీలో పనిచేయడానికి అప్లై చేస్తే మైసూరు సమీపంలో ఫ్యాక్టరీకి తీసుకెళ్లి వివరంగా ట్రైనింగ్ ఇచ్చారు.
Ads
అక్కడ పనిచేసే వారంతా మహిళలే. అప్పుడే తెలిసింది వారు మహిళల నియామకాలకు ప్రాధాన్యం ఇస్తారని. కాలంతో పాటు టాటా కంపెనీ అంతకంతకూ విస్తరిస్తూ ఇంతకుముందు మహిళలకు అవకాశాలు ఉండవు అనుకున్న రంగాల్లోనూ ప్రవేశం కల్పిస్తోంది. గత సెప్టెంబర్ లో టాటా స్టీల్ 25 మంది మహిళా ఫైర్ ఫైటర్స్ ని నియమించి ఆ రంగంలో ఇన్నాళ్ల పురుషాధిక్యానికి చెక్ పెట్టింది.
టాటా స్టీల్ కళింగర్, వెస్ట్ బొకారో ఫ్యాక్టరీల్లో మూడు షిఫ్టులలో మహిళలు పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలు, బరువైన సాధనాలు ఉన్నచోట ఇంతకుముందు మహిళలకు అవకాశం ఉండేది కాదు. సుమారు 220 మంది మహిళలు ఆపరేషన్స్ , మెయింటెనెన్సు విభాగాల్లో పనిచేస్తున్నారు. బొకారో ప్లాంటులో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఆపరేటర్స్ గా విధుల్లో ఉన్నారు. మరో బ్యాచ్ శిక్షణలో ఉందని టాటా స్టీల్ లో ప్రధానాధికారి జయా సింగ్ పాండే వివరించారు.
స్పెషల్ డ్రైవ్ కింద ఈ నియామకాలు చేపట్టామని, మహిళలకు సమానావకాశాలు కల్పించడం, వివక్ష రూపుమాపడం లక్ష్యమన్నారు. ముఖ్యంగా అల్పాదాయవర్గ మహిళలకు మేలు జరుగుతుందని, భిన్న నైపుణ్యాలున్న మహిళల చేరిక కంపెనీలకు కొత్త ఆలోచనలు, విస్తరణకు అవకాశమిస్తుందన్నారు. ఇదే ఆలోచనతో మరికొన్ని కంపెనీలూ మహిళలను నియమిస్తున్నాయి.
టాటాల బాటలో…
– హిందూస్తాన్ జింక్ కంపెనీ మైనింగ్, డ్రిల్లింగ్ విభాగాల్లో మహిళలను నియమించింది.
– ఎల్ అండ్ టీ క్వాలిటీ ఇన్సపెక్టర్స్ , మైంటెనెన్స్ ఇంజనీర్స్
– ఓఎన్జీసీ లో డీప్ సీ ఎక్స్ ప్లోరర్స్ (సముద్ర మథనం)
పైన చెప్పిన పనులన్నీ కష్టంతో కూడుకున్నవి. ఎంతగా టెక్నాలజీ సహాయమున్నా పెద్ద పెద్ద యంత్రాలు జరపాల్సి ఉంటుంది. అలాగే ఆయా మహిళల భద్రత, పనిచేసేచోట వారికి సదుపాయాల కల్పన సులభం కాదు. అవన్నీ దాటి మహిళలు ముందుకెళ్లడం సంతోషం. ఇకపై కొండలు పిండి చేయాలన్నా, చెట్లు, పుట్టలు, సముద్రాలు గాలించాలన్నా మహిళలు సిద్ధమని గుర్తుంచుకోండి…. -కె. శోభ … shobhas292@gmail.com
Share this Article