‘‘ఈమధ్యే… కాదు, నిజానికి మొన్ననే… నా భార్యతో మాట్లాడుతున్నాను… తన సోదరుడి గురించి… తను సన్యాసిగా మారిపోయాడు… ఆఫీసుకు వెళ్లడం మానేశాడు… భౌతిక ప్రపంచంతో అసలు సంబంధమే లేనట్టు మాట్లాడుతున్నాడు… తన పాత సంబంధ బాంధవ్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు… అసలు తను తనేనా..? తరచి పరిశీలిస్తే నాకు బాగా ఆశ్చర్యమేస్తోంది…
బొంబాయిలోని ప్రతి ప్రముఖ బార్ సందర్శించేవాడిని తనతో కలిసి… యుక్త వయస్సులోనే కాదు, ఈ బార్ల సందర్శన అనే పుణ్యకార్యం మొన్నమొన్నటివరకూ నడిచింది… అఫ్ కోర్స్, గుళ్లు కూడా తిరిగేవాళ్లం… చాలా సంగతులు నాతో షేర్ చేసుకునేవాడు… కానీ గత అయిదేళ్లుగా మనిషే మారిపోయాడు… దేవుడిలో మునిగిపోయాడు తను… నేల మీద పడుకుంటున్నాడు… చాలా సాత్వికాహారం తీసుకుంటున్నాడు… కాస్త పప్పు, కాస్త అన్నం… అంతే… మసాలా ఫుడ్ తాకడం లేదు… దేవుడి గురించి తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు…
నాకు ఆరోజు ఏం జరిగిందో బాగా గుర్తుంది… ఆమధ్య ఓసారి నేను తనకు ఫోన్ చేశాను… బహుశా నెలరోజులు దాటి ఉంటాయి… ‘‘చాన్నాళ్లయింది నీతో మాట్లాడి, అందుకే కాల్ చేశాను… ఎటూ నాతో రావడం లేదు, తరచూ కాల్స్ చేసేవాడివి, బంద్ పెట్టావు…’’ అన్నాను… ఇంకా నేను చెప్పేది పూర్తి కానేలేదు… ‘‘నన్నెందుకు గుర్తుచేసుకోవడం, దేవుడిని గుర్తుచేసుకో’’ అని పెట్టేశాడు… నన్నేమీ అవమానించినట్టు నేను ఫీల్ కాలేదు, తనను కొన్నాళ్లుగా గమనిస్తున్నాను కదా, పెద్దగా ఆశ్చర్యపోలేదు…
Ads
తరువాత ఏదో రోజు కాల్ చేశాను ఉండబట్టలేక… తన మాటలన్నీ దాదాపు ఆధ్యాత్మిక అంశం మీదే ఉన్నాయి… అసలు నా భార్యతో కూడా మాట్లాడటం మానేశాడు… తనకు సొంత సోదరి ఆమె… ఎవరైనా తనకు కాల్స్ చేస్తే, మాట్లాడాలనిపిస్తే పొడిపొడిగా ఒకటీరెండు మాటలతో సరిపుచ్చేస్తున్నాడు… రోజూ ఉదయం మూడున్నరకు నిద్రలేస్తాడు… రామ్ రామ్ అని నాకు ఓ సందేశం పంపిస్తాడు… బహుశా చాలాకొద్దిమందికి ఇలాంటి మెసేజులు పెడుతూ ఉంటాడేమో, నేనెవరినీ అడగలేదు… నేనయితే ప్రాంప్ట్‌గా రామ్ రామ్ అని రిప్లయ్ పంపిస్తాను… ఇదొక్కటే మా నడుమ మిగిలిన కమ్యూనికేషన్… ఇప్పుడు ఆయన వయస్సు 66 ఏళ్లు…
ఇదేరకం భక్తో నీకేమైనా తెలుసా అనడిగాను నా భార్యను..? ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది… నీ సోదరుడి గురించే అడుగుతున్నాను అన్నాను… అందరితో పూర్తిగా బంధాలు ఏమీ తెంచుకోలేదు… అలాగని బంధుత్వాల్ని పట్టించుకున్నట్టుగానూ ఉండడు… బంధుగణమంతా ఓ కేటగిరీ, దేవుడు ఒక్కడే మరో కేటగిరీ… కానీ రెండు కేటగిరీలతోనూ కమ్యూనికేషన్‌లో ఉంటాడు… ఇటు పూర్తి సన్యాసి కాదు, అలాగని సన్యాసి కాకుండానూ లేడు…
అలాంటప్పుడు మాలో కూడా దేవుడిని ఎందుకు చూడలేడు..? ఎప్పుడో ఓసారి మాతో తనే కనెక్ట్ కావచ్చు కదా… కాడు… ఇదేం సన్యాసమో సమజ్ కావడం లేదు… కాకపోతే ఒకటి మాత్రం అభినందించాలి… రోజువారీ సంపాదన మీద ధ్యాస నుంచి బయటపడ్డాడు… అవసరముంటేనే ఆరోజు పనిచేస్తాడు… లేకపోతే లేదు, ఏ గుడిలోనో కనిపిస్తాడు… అంటే ఇది సన్యాసాశ్రమం లేదా వానప్రస్థానికి మోడరన్ రూపాంతరమా..? ఇక దీని గురించి లోతుగా ఆలోచించి బాధపడదలుచుకోలేదు, ఎక్కువ ఆలోచిస్తే నేనూ అలాగే అయ్యేట్టున్నాను… సావాసదోషం… కానీ దగ్గరి వాళ్లతో సంబంధాలను తెంచుకోవడం నాకు నచ్చడం లేదు………..’’ ఈ కథంతా నేను ఫేస్ బుక్‌లో చదివాను, ఎవరి వాల్ మీదో గుర్తులేదు… కానీ సరిగ్గా నా అభిప్రాయాలనే పోలి ఉంది… ఓసారి ఓషోను చదువుతున్నప్పుడు కూడా ఇదే అనిపించింది…!!
Share this Article