సోషల్ మీడియాలో ఒకటే చర్చ… మోడీ మామూలుగా వచ్చి పోడు కదా… ఏదైనా కాస్త చర్చను అంటించి వెళ్తాడు… ఇక మీడియా, సోషల్ మీడియా వదలవు… రకరకాల క్రియేటివ్ ఊహాగానాలు… పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రపంచంలో ఎవరికీ అర్థం కారు… ఇంకేం..? బోలెడు ప్రచారాలు ఆల్రెడీ స్టార్టయ్యాయి…
ఇంతకీ జరిగింది ఏమిటి..? చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి మోడీని రమ్మన్నాడు… సరే, పాత కక్షలు ఎన్నున్నా… ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ప్రబలంగా ఉన్నా… ఎవరు ఎవరిని వెనుక నుంచి పొడుస్తారో ఎవరికీ తెలియకపోయినా సరే, మోడీ వచ్చాడు, బాబును ఆలింగనం చేసుకున్నారు… అదొక విచిత్ర దృశ్యం… ఇలా…
Ads
మోడీ అంటేనే మహా ముదురు, దేశముదురు ఇండియన్ పాలిటిక్సులో… అలాంటిది తను చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడూ అంటే… అదీ చంద్రబాబు గతంలో తన మీద అనేక సందర్భాల్లో అంతులేని విషం కక్కి, తన ప్రత్యర్థులకు సాయం చేసిన సంగతీ తెలిసిన వాడూ అంటే… రేప్పొద్దున టైమ్ ను బట్టి మళ్లీ ఇదే మోడీని ముంచేసే గణంలో ముందు వరుసలో ఉంటాడూ అంటే… మోడీ, బాబు కౌగిలి… చరిత్రాత్మకం…
సరే, వేదిక మీదకు వచ్చాడు, అందరికీ తనదైన స్టయిల్‌లో అభివాదం చేశాడు ప్రజలకు… అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కనీసం మట్టీ, నీరు తెచ్చి ఇచ్చాడు… ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు కదా… కానీ మెగా బ్రదర్స్… అనగా చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ప్రత్యేకంగా అలుముకుని, చేతులెత్తించి విజయ సంఘీభావ సూచికగా జనానికి ప్రదర్శించాడు… జనంలో ఒకటే ఆహాకారాలు, చప్పట్లు…
ఈమధ్యే చిరంజీవికి అదేదో విభూషణ్ కూడా ఇచ్చారు… సో, మిస్టర్ పవన్ కల్యాణ్ టైమ్ బీయింగుగా ఈ చంద్రబాబుతో ఉండు, కానీ నన్ను నమ్ముకో, నీ భవిష్యత్తు నాకు వదిలెయ్ అని చెబుతున్నట్టుగా ఉంది… ఏమో, తన మదిలో కూడా డౌట్ అలాగే ఉంది… ఆ నితిశ్, ఈ చంద్రబాబు అత్యంత చంచల మనస్కులు, ఎక్కడ కాడి కింద పడేస్తారో, ఏం కొంప ముంచుతారో తెలియదు, సో, నువ్వయితే నాతో ఉండు అని పరోక్షంగా చెబుతున్నట్టుగా ఉంది…
అక్కడికి వెంకయ్యనాయుడు కూడా వచ్చాడు… చాన్నాళ్ల తరువాత ఓ ప్రజావేదిక మీద దర్శనం సారు గారు… మెగా బ్రదర్స్‌తో మోడీ విన్యాసాలను చూస్తూ ఇక్కడ ఏదేదో జరుగుతోంది అనుకుంటూ చంద్రబాబు కూడా వచ్చాడు హడావుడిగా.. వెంకయ్యనాయుడు మోడీకి ఎదురుపడి ఏదో అభివాదం చేయడానికి ప్రయత్నించినా మోడీ పట్టించుకున్నట్టు కనిపించలేదు… ఆయన అద్వానీనే పట్టించుకోడు, వెంకయ్య ఎంత…? పైగా ఇదే చంద్రబాబు ధిక్కార సమయంలో ఇదే వెంకయ్య సపోర్ట్ అని కదా పాపం, మోడీ డౌటనుమానం…
సరే, ఇదంతా వోకే… పవన్, చిరంజీవిలకు ఏం చెప్పదలిచాడు మోడీ… ఈ చిన్న దుకాణం దేనికి, బీజేపీ దుకాణంలో కలిపేయాలని చెబుతున్నాడా..? మనం మనం కలిసి నడుద్దాం అనే సంకేతమిచ్చాడా..? ఏమో, మోడీ అర్థం కాడు, ఆయన సైగలు అర్థం కావు… దానికి పవన్ కల్యాణ్ తోడయ్యాడు… భలే కలిశారు ఇద్దరునూ…!!
చంద్రబాబుది జస్ట్, ఎన్టీయార్ మార్గ్… సారీ, పవన్ కల్యాణ్ మార్గమేమిటో పవన్ కే తెలియదు… మొదట మోడీ మార్గ్‌లోనే బయల్దేరినా, తరువాత ఫూలే మార్గ్‌లోకి మళ్లి, అక్కడి నుంచి చేగువేరా జంక్షన్ మీదుగా… లెఫ్ట్ వీథుల్లో తిరుగుతూ, బీఎస్పీ చౌరస్తాలో నిలబడి… ఎటూ దిక్కతోచని స్థితిలో మళ్లీ కాషాయదారిలోకి మళ్లిన అయోమయావస్థుడు… సో, చంద్రబాబు బెటరా..? పవన్ కల్యాణ్ బెటరా అనే డైలమా పీడిస్తున్న దశలో… ఎందుకైనా మంచిదని పవన్ కల్యాణ్, చిరంజీవిలను హత్తుకున్నట్టున్నాడు మోడీ… భలే చతురుడివి మహాశయా..!!
Share this Article